Share News

అసామాన్యుడు

ABN , Publish Date - Apr 25 , 2024 | 06:04 AM

ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో సుండుపల్లె మండలంతో ముడిపడిన పేరు యర్రపురెడ్డి ఆదినారాయణరెడ్డి.

అసామాన్యుడు

జనహితం ఆదినారాయణరెడ్డి రాజకీయ జీవితం

ఉమ్మడి కడప జిల్లా రాజకీయాల్లో సుండుపల్లె మండలంతో ముడిపడిన పేరు యర్రపురెడ్డి ఆదినారాయణరెడ్డి. పింఛా ప్రాజెక్టు, గంగనేరు ప్రాజెక్టు, కడపలో రేడియో స్టేషన్‌ ఏర్పాటు....ఇలా ప్రతి అభివృద్ధికీ ఆయనదే తొలి అడుగు. స్వాతంత్య్ర సమరయోఽధుడైన ఈ తొలితరం ఎమ్మెల్యే సామాన్యుడిగా ఉంటూనే అసామాన్యునిగా గుర్తింపు పొందారు. ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు ఏర్పాటు చేసిన పార్టీలో 1930ల్లో జనరల్‌ సెక్రటరీగా ఆదినారాయణరెడ్డి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఎడ్లబండిపై గ్రామ గ్రామానికి తిరుగుతూ స్వరాజ్య ఉద్యమ ప్రచారం సాగించేవారు. క్విట్‌ ఇండియా ఉద్యమంలో అరెస్టు అయి రాయవెల్లూరు జైలులో కొంతకాలం గడిపారు. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో రాయచోటి నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాతి ఎన్నికల్లోనూ విజయం సాధించారు. ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా, ఎమ్మెల్సీగా పనిచేశారు. గంజి కరువు నేపథ్యంలో 1952 అక్టోబరు 7న రాయచోటి సందర్శనకు వచ్చిన దేశ ప్రథమ ప్రధాని నెహ్రూను కలిశారు. కరువును పారదోలేందుకు తాత్కాలిక సహాయక చర్యలు తీసుకుంటూనే శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. ఇందుకోసం వెలిగల్లు ప్రాజెక్టు నిర్మించాలని వినతి పత్రం అందించారు. కడప వాసుల చిరకాల కోరిక అయిన పింఛా ప్రాజెక్టు, గంగనేరు ప్రాజెక్టులను సాకారం చేశారు. కడప జిల్లాలో రేడియో స్టేషన్‌ ఏర్పాటుకు కృషిచేశారు.

- సుండుపల్లె

Updated Date - Apr 25 , 2024 | 06:07 AM