Share News

బుగ్గన నామినేషన్‌పై హైడ్రామా

ABN , Publish Date - Apr 27 , 2024 | 04:50 AM

రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల పరిశీలన పర్వం శుక్రవారం ముగిసింది. ఇండిపెండెంట్లు సహా కొన్ని చిన్న పార్టీల అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు పలు కారణాలతో తిరస్కరించారు.

బుగ్గన నామినేషన్‌పై హైడ్రామా

ఆస్తులు దాచారంటూ అఫిడవిట్‌పై టీడీపీ ఫిర్యాదు

ఆరుగంటల పాటు పెండింగ్‌

హైడ్రామా మధ్య చివరికి అనుమతి

పొన్నూరులో బీఫాం ఇవ్వని అంబటి

భార్య, కుమార్తె ఆస్తుల దాపరికం

అయినా ఆమోదించిన ఆర్వో

ఆమంచికి విద్యుత్‌ బకాయిల అడ్డు

నామినేషన్‌ పెండింగ్‌.. నేడు నిర్ణయం

కొడాలిపై ఫిర్యాదా.. తీసుకోను: ఆర్వో

వేమిరెడ్డి ఆస్తులపై సాయిరెడ్డి ఫిర్యాదు

స్వీకరించని రిటర్నింగ్‌ అధికారి

రాష్ట్రవ్యాప్తంగా పరిశీలన పూర్తి

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నామినేషన్ల పరిశీలన పర్వం శుక్రవారం ముగిసింది. ఇండిపెండెంట్లు సహా కొన్ని చిన్న పార్టీల అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను అధికారులు పలు కారణాలతో తిరస్కరించారు. ఇక, అభ్యర్థులు స్వయంగా తమ నామినేషన్లను వెనక్కి తీసుకునేందుకు ఈ నెల 29 వరకు అవకాశం ఉంది. అయితే పలు నియోజకవర్గాల్లో నామినేషన్ల పరిశీలన, అనుమతి విషయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా వైసీపీ అభ్యర్థుల నామినేషన్ల విషయంలో హైడ్రామా చోటు చేసుకుంది. ఆయా అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లలో లోపాలను టీడీపీ అభ్యర్థులు ప్రస్తావించి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు చర్యల పేరుతో వాటిని పెండింగులో పెట్టినా.. కొన్ని గంటలు గడిచేసరికి ఆమోదించేశారు. ఈ పరిణామం వెనుక పైస్థాయిలో ఒత్తిళ్లు ఉన్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

డోన్‌లో డ్రామా!

నంద్యాల జిల్లా డోన్‌ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి నామినేషన్‌ను నాటకీయ పరిణామాల మధ్య ఆమోదించారు. బుగ్గన అఫిడవిట్‌లో ఆస్తులు వెల్లడించలేదని టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డి తరఫున ఆయన న్యాయవాదులు శ్రీనివాసభట్‌, భాస్కర్‌ రెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో రిటర్నింగ్‌ అధికారి మహేశ్వరరెడ్డి తొలుత ఈ నామినేషన్‌ను 6గంటలపాటు పెండింగ్‌లో ఉంచారు. తర్వాత ఏం జరిగిందో ఏమో చివరకు ఆమోదం తెలిపారు. అయితే, దీనివెనుక ఉన్నత స్థాయి ఒత్తిళ్లున్నాయని, ఈసీకి ఫిర్యాదు చేయడంతోపాటు, న్యాయ పోరాటం చేస్తామని టీడీపీ నేతలు తెలిపారు.

పొన్నూరు పేచీ.. గుంటూరు జిల్లా పొన్నూరు వైసీసీ అభ్యర్థి అంబటి మురళీకృష్ణ దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు వెల్లడించ లేదని టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ ఫిర్యాదు చేశారు. అంబటి తన అఫిడవిట్‌లో భార్య, కుమార్తెల ఆస్తుల వివరాలు పేర్కొనలేదన్నారు. నోటరీ చేసిన వ్యక్తి అనుమతి గుంటూరు నగరానికే పరిమితమైనందున అఫిడవిట్‌ చెల్లదని తెలిపారు. డ్వాక్రా మహిళా సంఘాలు దాచుకున్న దాదాపు రూ.2.50కోట్లను తన సొంత ఖాతాలకు మళ్లించుకున్నారని పేర్కొన్నారని ఇది అభ్యంతరకరమని తెలిపారు. నామినేషన్‌తోపాటు బీఫాం సమర్పించలేదని కాబట్టి నామినేషన్‌ను తరిస్కరించాలని కోరారు. టీడీపీ నేతల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండానే అంబటి నామినేషన్‌ ఆమోదిస్తున్నట్లు ఆర్వో తెలిపారు.

‘ఆమంచి’కి బకాయి బెడద!

బాపట్ల జిల్లా చీరాల అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌ నామినేషన్‌ను పెండింగ్‌లో ఉంచినట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సూర్యనారాయణరెడ్డి తెలిపారు. దీనిపై శనివారం నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆమంచి విద్యుత్‌ బిల్లుల బకాయిలు ఉన్నట్లు ఓ పార్టీకి చెందిన ఏజెంట్‌ తెలిపారని, దీంతో నామినేషన్‌ను పెండింగ్‌లో ఉంచామని పేర్కొన్నారు.

సాయిరెడ్డికి కలెక్టర్‌ నో

నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నామినేషన్‌ను తిరస్కరించాలని వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి(కలెక్టర్‌) హరినారాయణన్‌కు ఫిర్యాదు చేశారు. వేమిరెడ్డి తన అఫిడవిట్‌లో స్వదేశం, విదేశాల్లో ఉన్న ఆస్తులన్నీ చూపలేదని తెలిపారు. ఆయన నామినేషన్‌ చెల్లదని, తిరస్కరించాలని కలెక్టర్‌ను కోరారు. సాయిరెడ్డి ఫిర్యాదును కలెక్టర్‌ తిరస్కరించారు.

వైసీపీ అభ్యర్థిపై అయ్యన్న ఫిర్యాదు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి పెట్ల ఉమాశంకర్‌ గణేశ్‌ అఫిడవిట్‌లో వెల్లడించకుండా దాచిపెట్టిన అంశాలపై ఆర్వో జయరామ్‌కు టీడీపీ అభ్యర్థి అయ్యన్నపాత్రుడు ఫిర్యాదు చేశారు. నామినేషన్‌ను తిరస్కరించాలని కోరారు.

క్రిమినల్‌ కేసులు దాచారు

విశాఖ జిల్లా పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీ్‌పరాజ్‌ నామినేషన్‌పై జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు తరపున ఏజెంట్‌ వేణుగోపాల్‌ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నామినేషన్‌లో క్రిమినల్‌ కేసులకు సంబంధించి సమాచారం ఇవ్వలేదని,దానిని తిరస్కరించాలని కోరారు. దీంతో రిటర్నింగ్‌ అధికారి.. అదీ్‌పరాజ్‌ వివరణ కోరగా, ఏదీ ఉద్దేశపూర్వంగా దాచిపెట్టలేదని సమాధానం ఇచ్చారు. దీంతో అదీ్‌పరాజ్‌ నామినేషన్‌ను ఆమోదించారు.

కొడాలిపై ఫిర్యాదా? నో!

కృష్ణాజిల్లా గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని నామినేషన్‌ను తిరస్కరించి, అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ.. టీడీపీ నేత తులసీబాబు ఫిర్యాదు చేశారు. గుడివాడ మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్సులో కొడాలి తన క్యాంప్‌ ఆఫీసు నిర్వహించారని, కోడ్‌ అమల్లోకి వచ్చాక మున్సిపల్‌ కమిషనర్‌ నోటీసు ఇవ్వడంతో ఆయన ఖాళీ చేశారని తెలిపారు. కానీ నామినేషన్‌ పత్రంలో మాత్రం తాను కాంప్లెక్స్‌ను ఉపయోగించుకోలేదని తెలిపారని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును తీసుకునేందుకు రిటర్నింగ్‌ అధికారి పి.పద్మావతి అంగీకరించలేదు. ఆమె తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Apr 27 , 2024 | 04:50 AM