Share News

రేపల్లె రైలు మార్గం నిర్మిస్తాం

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:46 AM

ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే మచిలీపట్నం-రేపల్లె రైలు మార్గం నిర్మించి తీరుతామని, ఇందుకు డీపీఆర్‌ సిద్ధం చేశామని బందరు ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు. బందరులో శుక్రవారం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో జిల్లాస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు.

రేపల్లె రైలు మార్గం నిర్మిస్తాం
జిల్లా స్థాయి టీడీపీ, బీజేపీ, జనసేన సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీ వల్లభనేని బాలశౌరి

మచిలీపట్నం టౌన్‌, ఏప్రిల్‌ 26 : ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే మచిలీపట్నం-రేపల్లె రైలు మార్గం నిర్మించి తీరుతామని, ఇందుకు డీపీఆర్‌ సిద్ధం చేశామని బందరు ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి వల్లభనేని బాలశౌరి అన్నారు. బందరులో శుక్రవారం టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో జిల్లాస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలశౌరి మాట్లాడుతూ, వైసీపీ నేతలకు ఓడిపోతామనే భయం పుట్టుకొచ్చిందన్నారు. అందకే తన పేరుతో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులతో నామినేషన్లను పేర్ని నాని వేయించారన్నారు. కూటమి అధికారంలోకి రాగానే కంకిపాడు-గుడివాడ బైపాస్‌ రోడ్డు నిర్మిస్తామన్నారు. బందరు పోర్టుకు అనుబంధంగా పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. టీడీపీ నాయకులు పెద్ద మనసుతో జనసేన అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అవనిగడ్డలో రెండు గ్లాస్‌ గుర్తులు ఉంటాయన్నారు. పామర్రు-చల్లపల్లి జాతీయ రహదారిగా నిర్మిస్తామన్నారు. గుడివాడలో రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేశానన్నారు. మాజీ ఎంపీ, టీడీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ, మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో తొలిసారిగా జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తోందన్నారు. కార్యకర్తలు అభ్యర్థుల గుర్తులను ప్రజలకు చెప్పాలన్నారు. టీడీపీకి గ్రామస్థాయిలో కార్యవర్గం ఉందని, అయితే జనసేన, బీజేపీలకు పోలింగ్‌ కేంద్ర స్థాయిలో కమిటీలు అన్ని ప్రాంతాల్లో పటిష్టంగా లేవని, అందు వల్ల మూడుపార్టీలతో కలిసి మండలస్థాయి, పోలింగ్‌ కేంద్ర స్థాయి కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు గుత్తికొండ రాజాబాబు మాట్లాడుతూ, కూటమి అభ్యర్ధుల విజయానికి కృషి చేయాలన్నారు. చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు పవన్‌కళ్యాణ్‌ రాజమండ్రి వచ్చి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించారన్నారు.జనసేన కృష్ణాజిల్లా కార్యదర్శి బండి రామకృష్ణ మాట్లాడుతూ, పవన్‌కళ్యాణ్‌ ఇచ్చిన పిలుపు మేరకు జనసేన కార్యకర్తలు టీడీపీ, బీజేపీ కార్యకర్తలతో సమన్వయంతో పనిచేయాలన్నారు. ఓట్ల ట్రాన్స్‌ఫర్‌పై కార్యకర్తలు ఓటర్లకు చెప్పాలన్నారు. బ్యాలెట్‌ పేపరు నమూనా వచ్చిన తరువాత నమూనా ఈవీఎంలను ఓటర్ల వద్దకు తీసుకువెళ్లాలన్నారు. కార్యక్రమంలో పరిశీలకులు హరిబాబు, గాంధీ, చలమలశెట్టి రమేష్‌, జనసేన నాయకులు బూరగడ్డ శ్రీకాంత్‌, గల్లా తిమోతి, గడ్డం రాజు, బీజేపీ నాయకుడు శేషుకుమార్‌, టీడీపీ కృష్ణాజిల్లా తెలుగురైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, తెలుగుమహిళ కృష్ణాజిల్లా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత, ఎండి ఇలియాస్‌ పాషా, పిప్పళ్ల కాంతారావు, హసీంబేగ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:46 AM