Share News

ఆలూరంటే అలుసే

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:49 PM

ఆలూరు అసలే వెనుకబడిన ప్రాంతం. పశ్చిమ కర్నూలు జిల్లాలో కరువు, వలస, పేదరికం, నిరక్షరాస్యత మొదలైనవి తాండవించే నియోజకవర్గం.

ఆలూరంటే అలుసే

నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేసిన వైసీపీ ప్రభుత్వం

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్న స్థానికులు

తీరని తాగు నీటి కష్టాలు

నిధులు లేక ఆగిపోయిన వేదవతి, నగరడోణ ప్రాజెక్టులు

జాడలేని జింకల పార్కు

పూర్తికాని జాతీయ రహదారి పనులు

ఆలూరు అసలే వెనుకబడిన ప్రాంతం. పశ్చిమ కర్నూలు జిల్లాలో కరువు, వలస, పేదరికం, నిరక్షరాస్యత మొదలైనవి తాండవించే నియోజకవర్గం. నీటి పారుదల రంగంలో ఘోరంగా దగా పడింది. దీని వల్ల సుస్థిర అభివృద్ధి ఊసే లేకుండాపోయింది. ఇలాంటి నియోజకవర్గాన్ని ఐదేళ్ల వైసీపీ పాలన మరింత అధ్వానంగా తయారు చేసింది. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రతికక్ష హోదాలో ఉన్నప్పుడు ఆలూరు నియోజకవర్గానికి అంతులేని హామీలు ఇచ్చారు. వాటిలో ఒక్కటి కూడా ముఖ్యమంత్రి అయ్యాక ఆయనకు గుర్తు లేదు. అప్పట్లో జగన్‌ పాదయాత్ర ఆస్పరి మండలంలో కారుమంచి, పుప్పాలదొడ్డి మీదుగా బిలేకల్లు వరకు సాగింది. బిలేకల్‌లో నిర్వహించిన బహిరంగ సభలో వాగ్దానాలు ఎన్నో గుమ్మరించారు. కానీ ఆలూరు అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ప్రజల సమస్యలు ఏవీ పరిష్కారం కాలేదు.

ఆలూరు, ఏప్రిల్‌ 25: వైసీపీ ప్రభుత్వానికి వెనుకబడిన ఆలూరు నియోజవర్గమంటే అలుసే. ప్రజలు కోరుకున్న కనీస అవసరాలు తీర్చకుండా ఐదేళ్ల పాలన ముగించుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఓట్లు వేయమని వైసీపీ ప్రజల ముందుకు వస్తోంది. ఈ సందర్భంలో జగన్‌ విస్మరించిన హామీలను ప్రజలు గుర్తు చేస్తున్నారు.

ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ పాదయాత్ర చేసినప్పుడు స్థానిక రైతులు జింకల బెడద వల్ల పంటలు నష్ట పోతున్నాయని తెలిపారు. దీనికి ఆయన తమ పార్టీ అధికారంలోకి వస్తే జింకల పార్కు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అది ఏ మాత్రం అమలుకు నోచుకోలేదు.

ఆలూరు ప్రాంతంలో 80 వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు వేదవతి నదిపై జలాశయం నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అయితే పనులు ప్రారంభించి రైతుల పొలాల్లో పైపు లైన్‌లు వేసి పరిహారం కూడా ఇవ్వలేదు. రూ. వంద కోట్లు బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్‌ పనులు నిలిపివేశారు. దీంతో ప్రాజెక్టు అర్థాంతరంగా ఆగిపోయింది.

వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలోకి చేర్చాలని జగన్‌ను వాల్మీకి సంఘాలు కోరగా అ ధికారంలోకి వచ్చాక ఎస్టీ జాబితాలోకి వాల్మీకి బోయలను చేరుస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదు.

అస్పరిలో తాగు నీటి సమస్యను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీ పరిష్కారం కాకపోవడంతో మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అస్పరి, జొహర పురం, కారుమంచి, బిలేకల్ల్‌, కైరుప్పల్ల, డి. కోటకొండ, ములుగుందం, శంకర్‌ బండ గ్రామాల్లో 12 రోజులకు ఒక్కసారి మాత్రమే నీరు సరఫరా అవుతున్నది.

ఆస్పత్రిలో వైద్య సేవలు అంతంత మాత్రమే..

ఆలూరు నియోజకవర్గ కేంద్రంలో ఉన్న ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో వైద్యులు లేకపోవడంతో ఆదోని, బళ్ళారి ఆస్పత్రులకు సిబ్బంది రెఫర్‌ చేస్తున్నారు. ఈ ఆస్పత్రిలో వైద్యం అందుబాటులోకి తెచ్చి పూర్తి స్థాయిలో వైద్యులను, వసతులు కలుస్తానని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు.

ఆలూరు నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు

నియోజకవర్గ కేంద్రంలో బస్‌ డిపో లేదు.

ఆలూరు ప్రభుత్వ డిగ్రీ, ఐటీఐ కళాశాలలకు సొంత భవనాలు లేవు.

ఆలూరు పట్టణంలో మురుగు సమస్య పరిష్కారం కోసం అండర్‌ గ్రౌండ్‌ డ్రైన్‌ ఏర్పాటు చేయాలి.

తాగు నీరు 15 రోజులకు ఒక్కసారి సరఫరా అవుతుంది. శాశ్వత పరిష్కారం కోసం అదనంగా మరో రెండు సమ్మర్‌ స్టోరేజ్‌లను ఏర్పాటు చేసి బాపురం రిజర్వాయర్‌ సామర్థ్యం పెంచి చెరువులను నింపాల్సిన అవసరం ఉంది.

చిప్పగిరి మండలంలో పెండింగ్‌లో ఉన్న నగరడోన ప్రాజెక్టును నిర్మించాలి.

హెచ్‌ఎల్‌సీ ద్వారా ఆలూరు బ్రాంచ్‌ కెనాల్‌కు నీటి వాటా సక్రమంగా అందించాలి..

హెచ్‌ఎల్‌సీ కాలువపై తూము ఏర్పాటు చేసేందుకు టీడీపీ ప్రభుత్వంలో రూ..2 కోట్లు మంజూరు కాగా జగన్‌ ప్రభుత్వం వచ్చాక రద్దు చేసింది. ఈ సమస్యను పరిష్కరించాలి.

ఆలూరు బ్రాంచ్‌ కెనాల్‌కు మరమ్మతుల కోసం గత ఐదేళ్లుగా నిధులు రాకపోవడంతో పూడికలు, ముళ్ళ కంపలు పేరుకుపోయాయి. దీంతో ఆలూరు, చిప్పగిరి, హాలహర్వి మండలాల్లో 14,285 ఎకరాలకు నీరు అందకపోవడంతో రైతులే స్వచ్ఛందంగా పూడికలు తీసుకున్నారు.

అస్పరి మండలంలో డీ కోటకొండ, ముత్తుకూరు రహదారులు అధ్వానంగా ఉన్నాయి.

టమోటా సాగు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో జ్యూస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదు.

వేదవతి ప్రాజెక్టును పూర్తి చేయాలి

ఆలూరు ప్రాంతంలో కరువు కాటకాలతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. ఎల్‌ఎల్‌సీ ద్వారా వచ్చే నీరు కర్ణాటక రైతుల చౌర్యం వల్ల సక్రమంగా నీటి వాటా రావడం లేదు. గతంలో ప్రతిపక్ష హోదాలో వైఎస్‌ జగన్‌ వేదవతిని పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. కానీ నిధులు ఇవ్వకపోవడం వల్ల పనులు ఆగిపోయాయి. వేదవతి పూర్తి అయితే 80 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుంది. తాగు నీటి సమస్య పరిష్కారం అవుతుంది.

-అంజినయ్య, రైతు, అరికెర, ఆలూరు మండలం

మాట తప్పిన జగన్‌

బోయ వర్గాలను ఎస్టీ జాబితాలోకి చేరుస్తామని జగన్‌ వచ్చిన హామీ అమలు కాలేదు. బోయలను ఓట్ల కోసం జగన్‌ వాడుకున్నారు. ఇచ్చిన హామీ తప్పారు.

-భాస్కర్‌ నాయుడు, వాల్మీకి బోయ సాధికార కమిటీ, కర్నూలు జిల్లా అధ్యక్షుడు

తాగు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నాం

తాగు నీరు 12 రోజులకు ఒకసారి మాత్రమే సరఫరా అవుతుండటంతో ఇబ్బందులు పడుతున్నాం. మా ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. గత ఎన్నికల ముందు వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదు.

-భాను, జోహరాపురం

పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలి

నియజకవర్గ కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. పూర్తిస్థాయిలో వైద్యులను నియమించి మెరుగైన వైద్య సేవలు అందించాలి. రాత్రి సమయాల్లో కూడా వైద్యులు అందుబాటులో ఉండే విధంగా చూడాలి.

-బెంగళూర్‌ కిషోర్‌, టీడీపీ నాయకుడు, ఆలూరు

జాతీయ రహదారి పనులు పూర్తి చేయాలి

ఏళ్ల తరబడి జాతీయ రహదారి నిర్మాణం పనులు పూర్తిస్థాయిలో పూర్తి చేయకపోవడం వల్ల వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలూరు శివారులో, పట్టణంలో ఇంకా నిర్మాణ పనులు పూర్తి కాలేదు. దీంతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు. వైసీపీ ప్రభుత్వం కనీస అభివృద్ధి పనులు కూడా చేయలేదు.

-నారాయణ స్వామి, ఆలూరు

Updated Date - Apr 25 , 2024 | 11:49 PM