Share News

అత్యుత్సాహం

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:38 PM

వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణయాదవ్‌ గురువారంనాటి నామినేషన్‌ కార్యక్రమంలో పోలీసులతోపాటు ఆ పార్టీ నేతలు ప్రదర్శించిన అత్యుత్సాహం అంబులెన్స్‌లో ఉన్న రోగికే కాదు ప్రజలకు సైతం ప్రాణసంకటంగా మారింది. దారి ఇవ్వాలని అందరూ వేడుకున్నా వారెవరూ స్పందించలేదు.

అత్యుత్సాహం
కనిగిరిలో వైసీపీ అభ్యర్థి నామినేషన్‌ ర్యాలీలో చిక్కుకున్న అంబులెన్స్‌

కనిగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్‌ కార్యక్రమంలో నేతలు, పోలీసుల తీరుపై విమర్శలు

రోజూకంటే అదనంగా రోడ్లు దిగ్బంధం

రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్‌నూ పట్టించుకోని వైనం

ఇబ్బందులు పడిన ప్రయాణికులు

చంటిబిడ్డ తల్లులు, వృద్ధుల బాధలు వర్ణనాతీతం

కనిగిరి, ఏప్రిల్‌ 25 : వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణయాదవ్‌ గురువారంనాటి నామినేషన్‌ కార్యక్రమంలో పోలీసులతోపాటు ఆ పార్టీ నేతలు ప్రదర్శించిన అత్యుత్సాహం అంబులెన్స్‌లో ఉన్న రోగికే కాదు ప్రజలకు సైతం ప్రాణసంకటంగా మారింది. దారి ఇవ్వాలని అందరూ వేడుకున్నా వారెవరూ స్పందించలేదు.

కనిగిరి నగర పంచాయతీ పరిధిలో గురువారం పోలీసులు ఒంగోలు బస్టాండు, పామూరు బస్టాండు ప్రధాన సెంటర్లన్నీ బారికేడ్లతో నింపేసి రాకపోకలను బంద్‌ చేశారు. రోజూ కంటే అదనంగా రోడ్లను దిగ్బంధించి ప్రజలకు చుక్కలు చూపించారు. దీంతో ఒంగోలు నుంచి, కందుకూరు వైపు నుంచి, పామూరు వైపు నుంచి వచ్చే ప్రయాణికులు నానా ఇబ్బందులు పడ్డారు. పామూరు వైపు నుంచి బస్సులను కొత్తూరు వద్ద ఆపేశారు. దీంతో 3కిలోమీటర్లు ప్రయాణికులు నడిచి రావాల్సిన దుస్థితి ఏర్పడింది. అంతేకాకుండా డిపోకు వెళ్లాలంటే పామూరు బస్టాండు వద్ద కూడా బారికేడ్లు ఏర్పాటు చేశారు. కందుకూరు వెళ్లాల్సిన ప్రయాణికులు డిపోకు నడచి వెళ్లాల్సి వచ్చింది. మధ్యాహ్న సమయంలో ఒంగోలు నుంచి బస్సుల్లో కనిగిరి వచ్చిన ప్రయాణికులు ఎండలో నడిచి వెళ్లలేక నానాఇబ్బందులు పడ్డారు. చంటిబిడ్డలను తీసుకొచ్చే తల్లులూ అవస్థలు పడ్డారు. పామూరు బస్టాండు వద్దకు వచ్చే సరికి ర్యాలీ వస్తుందని ప్రయాణికులను ఎటూ పోనివ్వకుండా పోలీసులు నిలిపేశారు. దీంతో ర్యాలీ జనంలో కలిసిపోయి ఎక్కువ మంది చూపించేందుకు ఇలా చేశారని ప్రజలు విమర్శిస్తున్నారు. అదేవిధంగా కనిగిరి నుంచి పామూరు, ఒంగోలు, కందుకూరు వెళ్లాల్సిన ప్రయాణికులను కూడా పోలీసులు నిలిపివేశారు. ఒకదశలో వారిలో ఆగ్రహం పెల్లుబికి పోలీసులతో వాగ్వివాదం చేశారు. ర్యాలీ ముగిసేంతవరకు ప్రయాణికులు నిలిపివేశారు.

ర్యాలీలో చిక్కుకున్న అంబులెన్స్‌

హనుమంతునిపాడు నుంచి అనారోగ్యంతో ఉన్న పేషెంట్‌ను ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొస్తున్న అంబులెన్స్‌ ర్యాలీ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయింది. ఆ సమయంలో పామూరు బస్టాండు సెంటరులో వాహనంపై ఉన్న వైసీపీ అభ్యర్థి కానీ, నేతలు కానీ ఆ వాహనం వెనకే సైరన్‌ మోగిస్తున్నా ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో దారిలేక అంబులెన్స్‌ అలాగే నిలిచిపోయింది. ఈ విషయంలో పోలీసులు కూడా ప్రేక్షకపాత్ర వహించారు. అరగంటపాటు అంబులెన్స్‌ నిలిచిపోవడంతో పేషెంట్‌ తాలూకూ బంధువులు ఆందోళన చెందారు.

Updated Date - Apr 25 , 2024 | 11:39 PM