Share News

పోటెత్తిన పసుపుదండు

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:51 AM

ఎర్రగొండపాలెంలో కనివిని ఎరగని రీతిలో ఎరిక్షన్‌బాబు నామినేషన్‌ కార్యక్రమం నిర్వహించారు.

పోటెత్తిన పసుపుదండు

ఎర్రగొండపాలెం (పుల్లలచెరువు), ఏప్రిల్‌ 19 : ఎర్రగొండపాలెంలో కనివిని ఎరగని రీతిలో ఎరిక్షన్‌బాబు నామినేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. నామినేషన్‌ సందర్భంగా జరిగిన ర్యాలీలో పాల్గొనేందుకు నియోకవర్గం నుంచి పసుపుదండు పోటెత్తింది. దీంతో ఎర్రగొండపాలెంలోని రోడ్లన్ని కిక్కిరిశాయి. నామినేషన్‌ దాఖలుకు వెళుతూ.. ఎర్రగొండపాలెం ర్యాలీలో పాల్గొన్న టీడీపీ కూటమి అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు, ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డిలు ప్రచార వాహనం పైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేశారు. టీడీపీ కార్యాలయం నుంచి వేలాది మంది ప్రజానీకంతో బయలుదేరి బంగ్లా మీదుగా ప్రధాన రోడ్డులోకి వచ్చారు. అక్కడ నుంచి ఎన్టీఆర్‌ కూడలి మీదగా బస్టాండ్‌ పుల్లలచెరువు రోడ్డు వరకు ర్యాలీ చేశారు. అనంతరం ఎన్టీఆర్‌ కూడలిలో ప్రజలను నేతలు ఉద్దేశించి మాట్లాడారు. ఎన్‌టీఆర్‌ కూడలిలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఎక్సకవేటర్‌తో గజ మాల వేశారు. ర్యాలీలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రజానీకానికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ర్యాలీలో రాష్ట్ర విభిన్న ప్రతిభవంతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోనుగుంట్ల కోటేశ్వరరావు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మహిళలు పెద్దఎత్తున పాల్గొని ఆనందంలో నృత్యాలు చేశారు. పుల్లలచెరువు రోడ్డులో టీడీపీ అభిమానులు ఎరిక్షన్‌బాబుకు, మాగుంట శ్రీనివాసులరెడ్డికి భారీ గజమాలను వేశారు. నేతల ప్రసంగం అనంతరం ఆర్‌వో కార్యాలయానికి వెళ్లి నామినేషన్‌ వేశారు. నామినేషన్‌ సందర్భంగా పట్టణంలో కోలాహ లం నెలకొంది. వై.పాలెం చరిత్రలో ఇంతమంది జనం నామినేషన్‌ కార్యక్రమానికి తరలిరావడంతో టీడీపీ కూటమి శ్రేణులు ఆనందోత్సవంలో ఉన్నాయి. ఇంచుమించు 30 వేల మంది కార్యకర్తలు నామినేషన్‌ కార్యక్రమానికి హాజరైనట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వై.పాలెం టీడీపీ నామినేషన్‌ ర్యాలీ విజయవంతం కావడంతో, అధికార పార్టీ వర్గాల్లో కూడా చర్చ నడిచింది. గిరిజన తాండాలు, చెంచుగూడేంల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. నామినేషన్‌ సందర్భంగా టీడీపీ శ్రేణులు పట్టణంలో బైకు ర్యాలీ నిర్వహించారు.

సామాన్య కార్యకర్తను.. అవకాశం ఇవ్వండి

‘టీడీపీలో సామాన్య కార్యకర్తను, ఒక్కసారి అవకాశం ఇవ్వండి.., ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తా’ అని వై.పాలెం నియోజకవర్గ టీడీపీ కూటమి అభ్యర్థి గుడూరి ఎరిక్షన్‌బాబు కార్యకర్తలను అభ్యర్థించారు. గురువారం ఎర్రగొండపాలెం టీడీపీ కూట మి అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు. రెండు పర్యాయాలు ఎర్రగొండపాలెంలో వైసీపీని గెలిపించారన్నారు. అయితే ఎర్రగొండపాలెంలో అవినీతి మినహా అభివృద్ధి లేదన్నారు. పుల్లలచెరువు, త్రిపురాంతకం నియోజకవర్గం కేంద్రం నుంచి ఇప్పటికీ సరైన రోడ్లు లేవన్నారు. డబుల్‌ రోడ్డు వేస్తామని చెప్పిన మంత్రి హామీ ఏమయ్యిందని ప్రశ్నించారు. పుల్లలచెరువు మండలానికి అవసరమైన తీగలేరు చిన్నకండ్లేరు అనుసందానికి జీవో ఇచ్చిన ప్రభుత్వం మాయమాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టిందన్నారు. ఎర్రగొండపాలెంలో కరువుతో వలసలు పెరుగుతున్నాయన్నారు. యువతకు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎర్రగొండపాలెంలో పరిశ్రమలు స్థాపించి వలసలు నివారించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. డాక్టరు మన్నె రవీంద్ర మాట్లాడుతూ, ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రతి గడపలో సమస్య తెలిసినా ఏకైక వ్యక్తి ఎరిక్షన్‌బాబు అని అన్నారు. అలాంటి మంచివ్యక్తిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్‌ జాతీయ అధ్యక్షుడు నాగరాజు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్‌రెడ్డి, ఎరిక్షన్‌ బాబు కుమార్తె చల్సియా, కుమారుడు అజిత్‌, గోనుగుంట్ల కోటేశ్వరరావు టీడీపీ మండల అధ్యక్షులు చేకూరి సుబ్బయ్య, మేకల వలరాజు, పయ్యవుల ప్రసాద్‌, మెట్టు గోవిందురెడ్డి, మల్లిఖార్జునరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్‌ చేకూరి ఆంజనేయులు, టీడీపీ ముఖ్య నాయకులు వడ్లమూడి లింగయ్య, రెంటపల్లి సుబ్బారెడ్డి, శనగ నారాయణరెడ్డి, కాకర్ల కోటయ్య, మంత్రునాయక్‌, షేక్‌ మస్తాన్‌వలి, కామేపల్లి వెంకటేశ్వర్లు, నలగాటి చిన్న మల్లికార్జుననాయుడు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

పుల్లలచెరువు : రాష్ట్రంలో, ఎర్రగొండపాలెంలో టీడీపీని ఆదరించి గెలిపించాలని టీడీపీ కూటమి ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులురెడ్డి కోరారు. శుక్రవారం ఎర్రగొండపాలెంలో కూటమి అభ్యర్థి గూడూరి ఎరిక్షన్‌బాబు నామినేషన్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొ ని ప్రజలను ఉద్ధేశించి ప్రసంగించారు. తన ముప్పై ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఎర్రగొండపాలెంలో నామినేషన్‌ కార్యక్రమానికి ఇంత జనాన్ని ఎప్పుడు చూడలేద న్నారు. ఎరిక్షన్‌బాబు గెలుపు ఖాయం అని చెప్పడానికి ఇక్కడి ప్రజాస్పందనే నిదర్శన మన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయకుండానే సీఎం జగన్మోహన్‌రెడ్డి జాతికి అంకితం చేశామని చెప్పడం సిగ్గుచేటన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నీరు వస్తుందని రైతులు, ఈ ప్రాంత ప్రజలు కళ్లకు ఒత్తులేసుకోని చూశారన్నారు. కాని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వెలిగొండను పూర్తి చేస్తామన్నారు. వెలిగొండ జీవోపై సంతకం చేసేది చంద్రబాబు అని స్పష్టం చేశారు. గ్రామస్థాయి నుంచి కార్యకర్తలు పార్టీ గెలుపునకు కృషి చేయాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయ ఢంకా మోగిస్తుందని 150 సీట్లతో చంద్రబాబు సీఎం అవుతారన్నారు. కూటమిలో భాగస్వాములైన జనసేన. బీజేపీ కార్యకర్తలు కలిసి కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే మార్కాపురం జిల్లాగా ఏర్పాటు చేస్తామన్నారు. చంద్రబాబు సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పరుగులు పెట్టిస్తారని అన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:07 PM