Share News

అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ హామీపై సురే.. ష్‌...!

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:35 PM

ఆదిమూలపు సురేష్‌.. 2009-2014 మధ్య తొలిసారి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రజలకు అనేక హామీలిచ్చి ఓట్లు వేయించుకున్నారు. ప్రధానమైన హామీల్లో దోర్నాల మేజర్‌ పంచాయతీలో రూ.3 కోట్ల అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీని నిర్మించి మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. ఐదేళ్ల పదవి కాలం ముగిసింది. ఆ హామీ గురించి అతీగతీ లేదు. ఆ తర్వాత ఆయన సంతనూతలపాడు నియోజకవర్గం వెళ్లి అక్కడ పోటీ చేసి గెలిచారు. మళ్లీ 2019లో ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు. అయినప్పటికీ అప్పట్లో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. సంబంధిత శాఖ మంత్రి అయినప్పటికీ ఆ హామీ గురించి పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఇన్ని బాధలు పడుతుంటే పట్టించుకోకుండా మళ్లీ ఇప్పుడు కొండపి నియోజకవర్గానికి మారారని విమర్శిస్తున్నారు.

అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ హామీపై సురే.. ష్‌...!
ఇళ్ల ముందు చేరిన మురికి నీరు

తొలిసారి ఎమ్మెల్యేగా దోర్నాలలో రూ.3 కోట్లతో నిర్మిస్తానని ప్రకటన

2004-09 ఆయన పదవీ కాలం నుంచి నేటికీ నెరవేర్చని వైనం

గత ఐదేళ్లు సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నా పట్టించుకోని ఆదిమూలపు

ఇళ్లముందే మురుగు నిల్వలు

ఎక్కడికక్కడే చెత్త కుప్పలు

ఒకవైపు రోగాలతో.. మరోవైపు సమస్యలతో నరకం అనుభవిస్తున్న ప్రజలు

ముఖ్యంగా వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు

ఆదిమూలపు సురేష్‌.. 2009-2014 మధ్య తొలిసారి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రజలకు అనేక హామీలిచ్చి ఓట్లు వేయించుకున్నారు. ప్రధానమైన హామీల్లో దోర్నాల మేజర్‌ పంచాయతీలో రూ.3 కోట్ల అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీని నిర్మించి మురుగు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీ ఇచ్చారు. ఐదేళ్ల పదవి కాలం ముగిసింది. ఆ హామీ గురించి అతీగతీ లేదు. ఆ తర్వాత ఆయన సంతనూతలపాడు నియోజకవర్గం వెళ్లి అక్కడ పోటీ చేసి గెలిచారు. మళ్లీ 2019లో ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు. అయినప్పటికీ అప్పట్లో ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదు. సంబంధిత శాఖ మంత్రి అయినప్పటికీ ఆ హామీ గురించి పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము ఇన్ని బాధలు పడుతుంటే పట్టించుకోకుండా మళ్లీ ఇప్పుడు కొండపి నియోజకవర్గానికి మారారని విమర్శిస్తున్నారు.

పెద్దదోర్నాల, ఏప్రిల్‌ 24 :దోర్నాలలో పారిశుధ్యం కరువైంది. టీడీపీ హయాంలో 70శాతం, కాంగ్రెస్‌, వైసీపీ హయాంలో 10శాతం సిమెంట్‌ రోడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. అయినప్పటికీ పాలకులు డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా నిర్వహించలేకపోవడంతో వీధులు మురుగుకూపాలుగా మారాయి. పందులు సంచరిస్తూ ఈగలు, దోమలు వృద్ధి చెందుతూ ప్రజలను ఇబ్బందులు పాల్జేస్తున్నాయి. ముఖ్యంగా వర్షాకాలంలో జ్వరం, జలుబు, దగ్గు, వంటి నొప్పులు తదితర సీజనల్‌ వ్యాధులతో పాటు డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులతో ప్రజలు అల్లాడుతున్నారు. కొద్దిపాటి వాన కురిసినా నీరు ఊరు బయటకు వెళ్లే దారి లేక ఇళ్ల ముందే నిల్వ చేరుతుంటుంది. ఈ కారణంగా దుర్గంధం వ్యాపిస్తుంటుంది.

40 వేల జనాభా ఉన్నా పట్టించుకోని నేత

ప్రస్తుతం దోర్నాలలో సుమారు 40 వేల మంది జనాభా నివసిస్తున్నారు. ఇంత జనాభా నివసిస్తున్నప్పటికీ మరుగునీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేదు. వాడుక నీరు మురుగుకాలువల ద్వారా బయటకు ప్రవహించే వీలులేదు. కొత్త మసీదు వీధి, ఫారం వీధిలో, మండల ప్రాథమిక పాఠశాల(మెయిన్‌)వద్ద, పశువైద్యశాల వద్ద తదితర ప్రాంతాల్లో ప్రతి నిత్యం రోడ్లమీదనే మురుగు నీరు ప్రవహిస్తోంది. నెలల తరబడి మురుగు నిల్వ ఉండడంతో దుర్వాసన వస్తోంది.

కొన్ని ప్రాంతాల్లో చెత్త కొండల్లా...

ఆర్‌టీసీ బస్టాండు, బీఎ్‌సఎన్‌ఎల్‌ టవర్‌వద్ద డం పింగ్‌ యార్డును తలపించే విధంగా చెత్తా చెదారం పేరుకుపోతోంది. దీని పక్కనే ఎంపీడీవో, ఎంఈవో కార్యాలయాలు ఉన్నాయి. అయినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అటు మురుగునీరు, ఇటు చెత్తకుప్పల మధ్య ప్రజలు నరకం అనుభవిస్తున్నారు.

మురుగును తీగలేరులోకి మళ్లీస్తేనే పరిష్కారం

దోర్నాల పంచాయతీలో రోజువారీ విడుదలయ్యే మురుగు నీటిని పక్కనే తీగలేరు కాలువలోకి మళ్లిస్తే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ప్రజలు చెబుతున్నారు. దీనికి అనుగుణంగా కాలువ లు నిర్మించి వాగుకు అనుసంధానించి, తమను రోగా ల బారీ నుంచి కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

డ్రైనేజీ సమస్యను తీసుకెళ్లి ప్రత్యక్షంగా చూపించినా...

ఎర్రగొండపాలెం నుంచి తొలిసారి(2004-09) శాసనసభ్యుడిగా ఆదిమూలపు సురేష్‌ ఎన్నికైన సమయంలో ప్రజలు ఆయన దృష్టికి సమస్యను తీసుకువెళ్లారు. అంతేగాక స్వయంగా ఆయనను దగ్గరుండీ బురద నీరున్న వీధుల్లోకి తీసుకెళ్లి చూపించి పరిస్థితిని వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే సురేష్‌ రూ.3 కోట్లతో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజ్‌ నిర్మిస్తానని, దాంతో సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీ ఇచ్చి దాదాపు పదిహేనేళ్లు అయ్యింది. అయినప్పటికీ, ఆ ఊసే లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. 2019 నుంచి విద్యాశాఖ, పట్టణ పురపాలక శాఖమంత్రిగా కూడా పనిచేస్తున్నారు. అయినా ఆ సమయంలో కూడా పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:36 PM