Share News

ప్రచారంలో టీడీపీ స్పీడు

ABN , Publish Date - Apr 27 , 2024 | 01:09 AM

జిల్లాలోని టీడీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో స్పీడ్‌ పెంచారు. వివిధ కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియడంతో అటు అభ్యర్థులు రోడ్‌షోలు, సభలు నిర్వహిస్తున్నారు.

ప్రచారంలో టీడీపీ స్పీడు
పామూరులో రోడ్‌షో నిర్వహిస్తున్న ఒంగోలు ఎంపీ అభ్యర్థి మాగుంట, కనిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ఉగ్ర

రోడ్‌షోలతో అభ్యర్థులు బిజీ

ఇంటింటికీ తిరుగుతున్న కుటుంబ సభ్యులు

వైసీపీ నుంచి కొనసాగుతున్న వలసల జోరు

ఒంగోలు, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని టీడీపీ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో స్పీడ్‌ పెంచారు. వివిధ కార్యక్రమాలతో దూసుకుపోతున్నారు. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియడంతో అటు అభ్యర్థులు రోడ్‌షోలు, సభలు నిర్వహిస్తున్నారు. ఇటు వారి కుటుంబ సభ్యులు ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అదేసమయంలో వైసీపీ నుంచి వలసల జోరు కొనసాగుతోంది. పార్టీ అధిష్ఠానం అభ్యర్థులను ప్రకటించకముందే టీడీపీ నేతలు వివిధ రూపాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ వచ్చారు. తమ పేర్లను ఖరారు చేసిన తర్వాత క్రమపద్ధతిలో కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈనెల 18నుంచి 25వరకూ నామినేషన్ల దాఖలు సందర్భంగా ర్యాలీల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ జనజాతర మధ్య నామినేషన్ల ఘట్టాన్ని ముగించారు. ఆ సందర్భంగా పార్టీ శ్రేణులు, అలాగే మద్దతు ఇస్తున్న జనసేన, బీజేపీ కార్యకర్తల్లో కనిపించిన ఉత్సాహాన్ని గుర్తించిన అభ్యర్థులు అదే ఊపును పోలింగ్‌ వరకూ తీసుకెళ్లే దిశగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు.

ప్రచారాలు.. చేరికలు..

ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల దాఖలు, పరిశీలన ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే గడువు ఉంది. దీంతో టీడీపీ నుంచి రంగంలో ఉన్న పార్లమెంట్‌, అసెంబ్లీ అభ్యర్థులు.. వారికి మద్దతుగా కుటుంబ సభ్యులు ప్రచారం ముమ్మరం చేశారు. మరోవైపు అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ నుంచి పెద్దసంఖ్యలో వివిధ స్థాయి నేతలు, క్రియాశీల కార్యకర్తలు టీడీపీలోకి వచ్చి చేరుతున్నారు. అలా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో శుక్రవారం కూడా పెద్దసంఖ్యలోనే చేరికలు జరిగాయి.

జనం మధ్యలోనే టీడీపీ అభ్యర్థులు

జిల్లాలోనే టీడీపీ అభ్యర్థులంతా జనం మధ్యనే గడుపుతున్నారు. శుక్రవారం కూడా వారు ముమ్మర ప్రచారంలో నిమగ్నమై కనిపించారు. ఒంగోలు పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులరెడ్డి, కనిగిరి అసెంబ్లీ అభ్యర్థి ముక్కు ఉగ్రనరసింహారెడ్డిలు శుక్రవారం పీసీపల్లి, పామూరు పట్టణంలో రోడ్‌షోలు నిర్వహించారు. కొండపి ఎమ్మెల్యే, అక్కడి టీడీపీ అభ్యర్థి అయిన డాక్టర్‌ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి జరుగుమల్లి మండలంలో దాదాపు పది గ్రామాల్లో రోడ్‌షోలు, వీధి మీటింగ్‌లు నిర్వహించారు. రాత్రికి సింగరాయకొండలో యువనేత దామచర్ల సత్య సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్న నేతల చేరికల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒంగోలు అభ్యర్థి దామచర్ల జనార్దన్‌ నగరంలోని 23వ డివిజన్‌లో రోడ్‌షోతోపాటు ఇంటింటి ప్రచారం చేపట్టారు. సంతనూతలపాడు అభ్యర్థి బీఎన్‌ విజయ్‌కుమార్‌ మద్దిపాడు మండలం నందిపాడులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గిద్దలూరు అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి గిద్దలూరు పట్టణంలోని పలు వార్డులలో పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. దర్శి అభ్యర్థి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి దర్శి మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఎర్రగొండపాలెం అభ్యర్థి ఎరిక్షన్‌బాబు.. కొలుకుల, గంజివారిపల్లి గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారిని వై.పాలెంలోని తన కార్యాలయంలో సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించారు. మార్కాపురం అభ్యర్థి కందుల నారాయణరెడ్డి తర్లుబాడు మండలం మీర్జాపేట, గొల్లపల్లి, నాగెళ్లముడుపు తదితర గ్రామాల్లో ప్రచారం చేపట్టారు.

Updated Date - Apr 27 , 2024 | 01:09 AM