Share News

ప్రతి రోజూ నీరేది?

ABN , Publish Date - Apr 27 , 2024 | 01:13 AM

ఒంగోలు నగర ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. ‘ఈ ఎన్నికల్లో గెలిపించండి.. నగరానికి ప్రతిరోజూ తాగునీరు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.’ ఇదీ గత ఇరవై ఏళ్లుగా ఒంగోలు ప్రజలకు వినిపిస్తున్న హామీ.

ప్రతి రోజూ నీరేది?

జీవోలు, హామీలతో తీరని దాహం

మండుతున్న ఎండలతో నగరానికి ఎక్కిళ్లు

ఒంగోలులో అస్తవ్యస్తంగా తాగునీటి సరఫరా

అడుగంటిన గుండ్లకమ్మ.. సాగర్‌ జలాలూ కష్టమే..

అంతంతమాత్రంగా ఎస్‌ఎస్‌ ట్యాంకుల్లో నీరు

రోజూ ఇస్తాం.. మళ్లీ ‘ఎమ్మెల్యే పాత పాట’

మండిపడుతున్న నగరవాసులు

ఒంగోలులోని దేవుడు చెరువు రోడ్డు ప్రాంతానికి గురువారం రాత్రి 10గంటలకు నీరు విడుదల చేశారు. బిందెడు నీటి కోసం మహి ళలు నిద్రమానుకుని కొళాయిల వద్ద ఎదురుచూశారు. అయితే అర్ధగంటకే సరఫరా నిలిచిపోవడంతో తాగడానికి తప్ప, ఇంటి అవసరాలకు నీరు సరిపోలేదని మహిళలు వాపోయారు.

నగరంలోని తూర్పుకమ్మపాలెంకు బాలినేని నామినేషన్‌ కోసమని ముందురోజైన అదివారం అర్ధరాత్రి అరగంటపాటు హడావుడిగా నీరు విడుదల చేశారు. అప్పటి నుంచి మళ్లీ ఇవ్వలేదు. ఐదురోజుల తర్వాత శుక్రవారం సాయంత్రం సరఫరా చేశారు. అదీ అరగంటే..!

ఒంగోలు నగర ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. ‘ఈ ఎన్నికల్లో గెలిపించండి.. నగరానికి ప్రతిరోజూ తాగునీరు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.’ ఇదీ గత ఇరవై ఏళ్లుగా ఒంగోలు ప్రజలకు వినిపిస్తున్న హామీ. ఎన్నికలు వచ్చినప్పుడల్లా గెలుపు కోసం.. నగరానికి రోజూ నీరిస్తామంటూ స్థానిక ఎమ్మెల్యే పాడే పాత పాటపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికే ఒంగోలు నగరంలో ఎక్కిళ్లు మొదలయ్యాయి. ఎస్‌ఎస్‌ ట్యాంకుల్లో నీరు అడుగంటింది. మూడురోజులకొకసారి.. అదీనూ అరకొరగా సరఫరా చేస్తున్న పరిస్థితి. వైసీపీ నాయకుల హామీలతో ఎప్పటి కప్పుడు ఆశతో ఎదురుచూస్తున్న జనానికి నిరాశే మిగులుతోంది.అయితే మళ్లీ నన్ను గెలిపిస్తే ప్రతిరోజూ నీరు అంటూ ఎమ్మెల్యే పాతపాటే పాడుతుండటంపై నగరవాసులు మండిపడుతున్నారు.

ఒంగోలు (కార్పొరేషన్‌), ఏప్రిల్‌ 26: నగర ప్రజలు గత కొన్నేళ్లుగా ఎదుర్కొంటున్న తాగునీటి సమ స్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. ఇప్పటికే ‘ఒకరోజు మోటారు పాడైంది.. ఇంకో రోజు పైపులైను పగిలిపోయింది.. మరోసారి కరెంటు పోయింది’ అంటూ నీటి సరఫరాను అధికారులు నిలిపివేస్తున్నారు. కానీ అసలు కారణం వేరని సమాచారం. నగరానికి నీరందించే నీటి వనరులు అడుగంటాయి. మండుతున్న ఎండలతో పెరుగుతున్న తాగునీటి అవసరాలను పాలకులు పట్టించుకోవడం లేదు. వేసవి దృష్ట్యా యంత్రాంగం ముందుచూపు లేకపోవడంతో నగరమంతా నీటి సరఫరా అస్తవ్య స్తంగా తయారైంది. దీనిపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నగరపాలక సంస్థ నిర్లక్ష్యం, వైసీపీ పాలకులు పట్టించుకోనితనంతో పదేపదే తాగునీటి సమస్య ఎదురవుతోంది. నగరంలో రోజూ తాగునీటి సరఫరా చేస్తామంటూ ప్రతిసారీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే బాలినేని ప్రచార అస్త్రంగా వాడుతున్న విషయం విదితమే. ప్రతి రోజూ నీరు ఇస్తాను.. లేదంటే పోటీ చేయనంటూ ఆయన మరోసారి చెప్పడం.. పాతపాటే అంటూ ప్రజలు పెదవివిరుస్తు న్నారు. ఇదిలా ఉంచితే గతేడాది తాగునీటి కోసం వైసీపీ ప్రభుత్వం రూ.339.92 కోట్లకు జీవో జారీ చేసింది. దీంతో అదేదో నీరొచ్చినట్లే జీవో కాపీలు చేతపట్టి బైక్‌ ర్యాలీతో నగరంలో నానా హడావుడి చేశారు. అయితే ఆ జీవో విడుదలై ఏడాది పూర్తయినా నేటికీ పనులు ప్రారంభానికి నోచు కోలేదు.

అడుగంటిన వేసవి చెరువులు

గుండ్లకమ్మ గేట్లు కొట్టుకుపోవడంతో ఉన్న నీరు వృఽథా అయిన విషయం విదితమే. నేటికీ గేట్ల మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రాజెక్టులో నీరు అడుగంటి, క్రీడామైదానంలా మారింది. దీంతో గుండ్లకమ్మ నుంచి సరఫరా నిలిచిపోయింది. ఇదిలా ఉంచితే సాగర్‌ నీటిపైనే ఆశలు పెట్టుకోగా ప్రస్తుతం అది చెరువులకు రావడం లేదు. అయితే వైసీపీ ప్రజాప్రతినిధులు మాత్రం తాగునీటికి కోట్ల రూపాయల జీవోలు తెచ్చాం, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని చెబుతున్న మాటలు ఆచరణలో సాధ్యపడటం లేదు. ఇప్పటి వరకు మూడు రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా చేస్తుండగా, రకరకాల సాకులతో నాలుగు రోజులకు ఒకసారి ఇచ్చేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది. అదికూడా సరఫరా సమయం తగ్గించనున్నారు. దీంతో నగరంలో దాహం కేకలు వినిపించనున్నాయి. ఇప్పటికే నగరంలో అధికశాతం ప్రాంతాల్లో పురాతన పైపులైన్లు ఉన్నాయి. అతి కొద్ది ప్రాంతాల్లోనే కొత్తవి వేశారు. దీంతో పాత పైపులైన్‌లకు పదేపదే లీకులు ఏర్పడుతుండగా, వాటిని నియంత్రించడంలో విఫలమయ్యారనే విమర్శలున్నాయి. దీంతో చెరువుల్లో ఉన్న కొద్దిపాటి నీరు చివరి ఇళ్ల వరకూ చేరడం లేదు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో చర్యలు

అమృత్‌ పథకం నిధుల విడుదల కాకముందు గుండ్లకమ్మ నీటిని రాబట్టుకో వడానికి రూ.40కోట్లు అప్పటి టీడీపీ ప్రభుత్వంమంజూరు చేసింది. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నగరానికి వచ్చిన సమయంలో ప్రకాశం భవనం వద్ద ఈ పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఏడుగుండ్లపాడు వద్ద నుంచి ఒంగోలువేసవి జలాశయం వరకు రూ.40 కోట్లతో 8.9 కిలోమీటర్ల పైపులైను పనులు చేపట్టారు. ఆ పనులు 70శాతం పూర్తికాగా, అప్పటి కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు చేతుల మీదుగా దానిని ప్రారంభించారు. ఆ పైపులైను ద్వారా రోజుకు 60 మిలియన్‌ లీటర్ల నీటిని ఒంగోలు సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులకు సరఫరా చేసే విధంగా పనులు చేపట్టారు. అయితే రోజువారీగా నగర ప్రజల నీటి అవసరాలకు 35 మిలియన్‌ లీటర్ల నీరు సరఫరా చేస్తుండగా, గుండ్లకమ్మ నుంచి వచ్చే దానితో ప్రజలకు మరింతగా అందించడంతోపాటు వేసవిలోనూ సమస్య తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపడం కోసం అప్పటి ఎమ్మెల్యే దామచర్ల ఎనలేని కృషిచేశారు.

దామచర్ల కృషితో అదనంగా రూ.123 కోట్లు

గుండ్లకమ్మ నుంచి ఏడుగుండ్లపాడు వరకు మరోసారి టీడీపీ హయాంలోనే పైపులైను పనులు పూర్తిస్థాయిలో చేపట్టారు. ఒంగోలు నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం రూ.330 కోట్లు కేటాయించాలనిప్రాజెక్టు నివేదికలో పేర్కొన్నారు.ఒకేసారి అంత కేటాయించడం సాధ్యపడక విడతల వారీగా ఇచ్చేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సుముఖత వ్యక్తం చేసింది. అందులో భాగంగా అమృత్‌ పథకం కింద తొలి విడత రూ.123 కోట్లు అదనంగా కేటాయించారు. వీటితో మరో 16కి.మీ పైపులైను నిర్మించడానికి చర్యలు చేపట్టారు. అంతేకాకుండా 15 ఎంఎల్‌డీ సేప్టెజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌నిర్మాణం కూడా ఏర్పాటు అవసరం ఉండటంతో అదనంగా మరో రూ.30.79 కోట్లు కేటాయించారు. దీంతో ఒంగోలు నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం మొత్తం రూ.190.79 కోట్లు వెచ్చించి దాహార్తి తీర్చేందుకు, భవిష్యత్‌లో తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండటం కోసం దామచర్ల అటు కేంద్రప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి అవసరమైన నిధులు రాబట్టారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి పనులు వేగవంతంగా జరిగేలా చర్యలు చేపట్టారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని పక్కన పడేసింది. పనులు నిలిచిపోయాయి. అయితే ప్రజల నుంచి విమర్శలు రావడంతో గతేడాది హడావుడిగా ప్రారంభించారు. అన్నీ పాత నిధులే అయినా తామేదో తెచ్చి చేయించినట్లు చెబుతున్నారన్న విమర్శలు వచ్చాయి. పనులు పూర్తయినట్లు ఆర్భాటం చేసి గత ఏడాది ఆగస్టు 23న ప్రారంభించినప్పటికీ మోటార్లు మొరాయించడంతో అంతా తుస్సుమంది.

Updated Date - Apr 27 , 2024 | 01:13 AM