Share News

రూ.1.3 కోట్లకు సైబర్‌ నేరగాళ్ల టోకరా

ABN , Publish Date - Apr 24 , 2024 | 02:13 AM

నగరానికి చెందిన ఓ లాజిస్టిక్స్‌ వ్యాపారి సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ.1,30,30,639 పోగొట్టుకున్నాడు.

రూ.1.3 కోట్లకు సైబర్‌ నేరగాళ్ల టోకరా

ఉచ్చులో పడిన విశాఖలోని లాజిస్టిక్స్‌ వ్యాపారి

తక్షణం స్పందించిన సైబర్‌ పోలీసులు

రూ.85,70,923 హోల్డ్‌లో పెట్టిన వైనం

ఎండాడ (విశాఖపట్నం), ఏప్రిల్‌ 23:

నగరానికి చెందిన ఓ లాజిస్టిక్స్‌ వ్యాపారి సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ.1,30,30,639 పోగొట్టుకున్నాడు. మోసపోయానని తెలుసుకుని 1930 హెల్ప్‌ లైన్‌కి కాల్‌ చేయడంతో సకాలంలో స్పందించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రూ.85,70,923ను హోల్డ్‌ చేయగలిగారు. ఈనెల 20వ తేదీన జరిగిన సంఘటనపై సైబర్‌ క్రైం పోలీసులు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం...

నగరానికి చెందిన లాజిస్టిక్స్‌ వ్యాపారికి ఈనెల 20న ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. ముంబైలో ఫెడెక్స్‌ కొరియర్‌ ప్రతినిధినంటూ ముంబై నుంచి తైవాన్‌కు మీపేరుపై పార్శిల్‌ బుక్‌ అయిందని, అందులో నిషేధిత, చట్టవిరుద్ధ వస్తువులు, ఫేక్‌ పాస్‌పోర్టులు, క్రెడిట్‌ కార్డులు, బ్యాంక్‌ పాస్‌బుక్‌లతో పాటు 720 గ్రాముల డ్రగ్స్‌ ఉన్నట్టు కస్టమ్స్‌ అధికారులు గుర్తించారని బెదిరించాడు. అటువంటి పార్శిల్‌ తాను బుక్‌ చేయలేదని లాజిస్టిక్‌ వ్యాపారి చెప్పడంతో, అతడి వివరాలు, ఎక్కడ ఉంటున్నదీ, ఫోన్‌ నంబర్లు కూడా చెప్పడంతో కంగారుపడ్డాడు. అంతేకాకుండా పార్శిల్‌ మీద ఎఫ్‌ఐఆర్‌ నంబరు ఎంహెచ్‌ 1085/ 1223 బుక్‌ అయిందని, నార్కోటిక్‌ పోలీసులకు కాల్‌ బదలాయిస్తున్నామని చెప్పాడు. విచారణ నిమిత్తం ముంబైకి రావాల్సి ఉంటుందని స్పష్టం చేశాడు. అయితే తాను అంత దూరం రాలేనని బాధితుడు బదులివ్వడంతో ఉన్నతాధికారికి ఫోన్‌ కలుపుతున్నామని, ఆన్‌లైన్‌లో విచారణ చేస్తారని బదులిచ్చాడు. వెంటనే మరో వ్యక్తి లైన్‌లోకి వచ్చి ఓ స్కైప్‌ ఐడీ ఇచ్చి అందులో లాగిన్‌ కావాలని చెప్పాడు. మీరు ఎవరితోనూ మాట్లాడకూడదని, తాము చెప్పినట్టు నడుచుకోవాలని చెప్పడంతో బాధితుడు అలానే చేశారు.

మీ బ్యాంకు ఖాతా ద్వారా మనీల్యాండరింగ్‌ జరిగిందని, మీ అకౌంట్స్‌ నుంచి తీవ్రవాదులకు (తుపాకుల కొనుగోలు నిమిత్తం) డబ్బులు అందాయని చెబుతూనే, ప్రస్తుతం మీ అకౌంట్‌లో ఉన్న డబ్బును మాకు ట్రాన్స్‌ఫర్‌ చేస్తే, ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఖాతాను చెక్‌ చేసి, తిరిగి అకౌంట్‌లో జమ చేస్తామని నమ్మబలికారు. దీనికితోడు ఆర్బీఐకి సంబంధించిన లెటర్‌ని బాధితునికి ఆన్‌లైన్‌లో పంపించాడు. బాధితుడు వారు చెప్పినట్టే తన ఖాతాలోని రూ.1,30,30,639 నగదును వారి ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌ చేశారు. అయితే దీనిపై అనుమానం వచ్చి వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేయడంతో సైబర్‌ క్రైం జోన్‌-2 సీఐ జి.శ్రీనివాసరావు బృందం వివరాలు సేకరించి, పోగొట్టుకున్న నగదులో రూ.85,70,923 మొత్తాన్ని హోల్డ్‌ చేయగలిగారు.

Updated Date - Apr 24 , 2024 | 02:13 AM