Share News

నామినేషన్ల కోలాహలం

ABN , Publish Date - Apr 24 , 2024 | 02:18 AM

విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి ఆరో రోజైన మంగళవారం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి.

నామినేషన్ల కోలాహలం

ఆరో రోజు పార్లమెంటు స్థానానికి ముగ్గురు, అసెంబ్లీ సెగ్మెంట్లకు 18 మంది నామినేషన్‌

కొంతమంది రెండేసి సెట్లు దాఖలు

ఉత్తర నియోజకవర్గానికి కూటమి అభ్యర్థిగా పి.విష్ణుకుమార్‌రాజు నామినేషన్‌

నేడు పల్లా, గణబాబు నామినేషన్లు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నం పార్లమెంటు స్థానానికి ఆరో రోజైన మంగళవారం మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. నవతరం పార్టీ తరపున గండికోట రాజేశ్‌, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పులుసు సత్యనారాయణ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థినిగా మళ్ల శ్రావణి నామినేషన్లు వేశారు. అభ్యర్థుల నుంచి విశాఖ పార్లమెంటు నియోజకవర్గ ఆర్‌వో, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున నామినేషన్‌ పత్రాలను స్వీకరించారు. ప్రజాశాంతి పార్టీ నుంచి కిలారి ఆనంద్‌పాల్‌ (కేఏ పాల్‌) మంగళవారం మరో సెట్‌ పత్రాలను ఆర్‌వోకు అందజేశారు. నామినేషన్‌ పత్రాలను జిల్లా రెవెన్యూ అధికారి కె.మోహన్‌కుమార్‌ పరిశీలించారు.

ఏడు అసెంబ్లీ స్థానాలకు 18 మంది నామినేషన్లు

జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలకు మంగళవారం 18 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆరో రోజు 18 మంది అభ్యర్థులు 23 సెట్ల నామినేషన్‌ పత్రాలను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించారు. భీమిలి నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థులుగా చొప్పల్లి శరవణ్‌ గణేష్‌, బావిశెట్టి రమణబాబు నామినేషన్లు రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. విశాఖ తూర్పు అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థులుగా శివరామకృష్ణ అనగాని, డాక్టర్‌ మాతే సురేష్‌, దక్షిణ నియోజక వర్గానికి వైసీపీ అభ్యర్థిగా జె.బిపిన్‌కుమార్‌ ఒక సెట్‌, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి వాసుపల్లి సంతోష్‌కుమార్‌ రెండు సెట్ల నామినేషన్లు రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. ఉత్తర నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా పెనుమత్స విష్ణుకుమార్‌రాజు రెండు సెట్లు, పెనుమత్స శ్యామలా దీపిక రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇంకా ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి వీవీఎస్‌ కమలాకర్‌రావు ఒక సెట్‌, రామారావు లక్కరాజు రెండు సెట్లు, బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ తరపున పెద్దాడ కనకమహాలక్ష్మి ఒక సెట్‌ దాఖలు చేశారు. పశ్చిమ నియోజకవర్గానికి సమాజ్‌వాదీ పార్టీ నుంచి రవికుమార్‌ వెలగాడ, బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ నుంచి అతుకుంశెట్టి రామచంద్రరావు, స్వతంత్ర అభ్యర్థిగా మందపాటి శ్రీనివాసరాజు, గాజువాక నియోజక వర్గానికి సీపీఐ (ఎం) నుంచి మైలవరపు రాంబాబు, స్వతంత్ర అభ్యర్థిగా సీమకుర్తి శ్రీనివాసరావు అలియాస్‌ భగవాన్‌ శ్రీను, పెందుర్తికి ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి పిరిడి భగత్‌ రెండు సెట్లు నామినేషన్లు, స్వతంత్ర అభ్యర్థిగా పొన్నాడ అప్పలనాయుడు ఒక సెట్‌ నామినేషన్‌ సమర్పించారు.

కాగా, బుధవారం గాజువాకలో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు, పశ్చిమ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా పెతకంశెట్టి గణబాబు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

Updated Date - Apr 24 , 2024 | 02:18 AM