Share News

నిండా ముంచిన వైసీపీ

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:12 AM

వైసీపీ నాయకుల మాటలు విని పూడిమడక మత్స్యకారులు నిలువునా మునిగారు. నాడు వైసీపీ నాయకుల మాటలు విని పరిహారం తీసుకోని మత్స్యకారులు ఇప్పుడు బాధపడుతున్నారు. ఐదేళ్లుగా భారీ స్థాయిలో ఆందోళనలు చేసినా పట్టించుకొనే నాథుడు కరువయ్యాడు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు పునాది రాయి కూడా పడలేదు.

నిండా ముంచిన వైసీపీ
అచ్యుతాపురంలో ఏర్పాటు చేసిన ఈటీపీ

గత ఎన్నికల సమయంలో ఆ పార్టీ నాయకుల మాటలు విని మోసపోయిన మత్స్యకారులు

- ఫార్మా వ్యర్థ జలాలను సముద్రంలో విడిచి పెట్టడమే గతంలో వ్యతిరేకత

- గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి కుటుంబానికి పరిహారం ఇవ్వాలని నిర్ణయం

- తాము అధికారంలోకి వస్తే భారీగా పరిహారం ఇస్తామని హామీ ఇచ్చిన వైసీపీ నేతలు

- వీరి మాటలు నమ్మి 1200 మంది పరిహారం తీసుకోని వైనం

- ఐదేళ్లుగా ఆ ఊసే ఎత్తని నేతలు

- ఆందోళనలు చేస్తున్నా పట్టించుకునే వారు కరువు

- బాధితులు గగ్గోలు

- ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చి పునాది రాయి కూడా వేయని పరిస్థితి

అచ్యుతాపురం, ఏప్రిల్‌ 25: వైసీపీ నాయకుల మాటలు విని పూడిమడక మత్స్యకారులు నిలువునా మునిగారు. నాడు వైసీపీ నాయకుల మాటలు విని పరిహారం తీసుకోని మత్స్యకారులు ఇప్పుడు బాధపడుతున్నారు. ఐదేళ్లుగా భారీ స్థాయిలో ఆందోళనలు చేసినా పట్టించుకొనే నాథుడు కరువయ్యాడు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మిస్తామని హామీ ఇచ్చినా ఇప్పటి వరకు పునాది రాయి కూడా పడలేదు.

అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల పరిధిలో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేయడంతో భారీ స్థాయిలో పరిశ్రమలు వచ్చాయి. ఇందులో ఫార్మా కర్మాగారాలే అధికంగా ఉన్నాయి. ఈ కర్మాగారాల ద్వారా విడుదలైన వ్యర్థాలను శుద్ధి చేసిన అనంతరం పూడిమడక సముద్ర తీరంలో కలపడానికి అధికారులు పూడిమడకకు సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఎఫ్ల్యూయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఈటీపీ)ను ఆరేళ్ల క్రితం ప్రారంభించారు. వ్యర్థ జలాలను శుద్ధి చేసి సముద్రంలో కలపడానికి పైపులైన్‌ ఏర్పాటు చేశారు. అయితే వ్యర్థాలను ఎంత శుద్ధి చేసినా ఆ జలాలు సముద్రంలో కలిస్తే మత్స్య సంపద నశిస్తుందని పూడిమడక మత్స్యకారులు అప్పట్లో భారీ స్థాయిలో ఆందోళన చేశారు. దీంతో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పలుమార్లు అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్‌, మత్స్యకారులతో పలుమార్లు సమావేశమై ఒక ఒప్పందానికి వచ్చారు. పూడిమడకలో రేషన్‌ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.1.25 లక్షలు పరిహారం ఇవ్వడానికి, అంతేకాకుండా కుటుంబంలో మేజర్లయిన వారికి కూడా రూ.1.25 లక్షలు పరిహారం ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. ఈ మేరకు అప్పట్లో సరే ్వ జరిపి పంచాయతీ పరిధిలో 4,230 మందికి పరిహారం చెల్లించాలని నిర్ధారించారు. అంతేకాక ఎటువంటి అవకతవకలు జరగకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేయాలని నిర్ణయించారు. ఇందుకు బ్యాంక్‌ అకౌంట్లు కూడా లబ్ధిదారుని పేరున తీసుకోవాలని అప్పట్లో అధికారులు ఆదేశించారు. ఈ ప్రక్రియ జరగడానికి కొంత సమయం పట్టింది. అధికారులు ముందుగా ప్రకటించిన ప్రకారం లబ్ధిదారుల బ్యాంక్‌ అకౌంట్లకు నగదు జమ చేయడం ప్రారంభించారు. ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చింది. తాము గెలిస్తే మత్స్యకార కుటుంబంతో పాటు మేజర్లకు కూడా రూ.5 లక్షల పరిహారం ఇస్తామని వైసీపీ నాయకులు ప్రకటించారు. అలాగే కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని పూడిమడక ఎన్నికల ప్రచార సభలో వైసీపీ నేతలు విజయసాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వేంకటేశ్వరరావు స్వయంగా ప్రకటించారు. అలాగే అప్పట్లో స్థానిక ఎమ్మెల్యే కన్నబాబురాజు కూడా తన ప్రచారంలో భాగంగా మత్స్యకారుల ప్యాకేజీలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని, తాను గెలిస్తే టీడీపీ నాయకులు తిన్నదాన్ని కక్కిస్తానని, మిగిలిన వారికి న్యాయం చేస్తానని చెప్పారు. వీరి మాటలు నమ్మిన సుమారు 1200 మంది మత్స్యకారులు పరిహారం తీసుకోలేదు.

హామీ గాలికి..

వైసీపీ నాయకుల మాటలు నమ్మి పూడిమడక మత్స్యకారులు గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఓట్లు వేశారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన కన్నబాబురాజు మత్స్యకారులకు ఇచ్చిన హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్యాకేజీ కోసం మత్స్యకారులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఈ సమస్య పరిష్కారం కాలేదు.

పునాది రాయి కూడా పడని ఫిషింగ్‌ హార్బర్‌

ఉమ్మడి విశాఖ జిల్లాలో అతి పెద్ద మత్స్యకార్ల గ్రామమైన పూడిమడకలో భారీ స్థాయిలో చేపల ఎగుమతులు జరుగుతాయి. అయితే ఇక్కడ మత్స్యకారులు తమ పడవలు నిలుపుకోవడానికి చోటు లేదని అప్పటి ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్‌బాబు ద్వారా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి స్పందించిన చంద్రబాబునాయుడు పూడిమడకను పర్యాటక కేంద్రంగా ఆభివృద్ధి చేయడంతో పాటు ఫిషింగ్‌ హార్బర్‌ను కూడా ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. వెంటనే వివిధ సంస్థల ద్వారా సర్వేలు చేయించి పూడిమడకలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించడానికి అనువుగా ఉందని నివేదికలు రావడంతో రూ.350 కోట్లు మంజూరు చేశారు. పనులు ప్రారంభించే సమయానికి ఎన్నికలు రావడంతో ఫిషింగ్‌ హార్బర్‌ ప్రతిపాదన మూలన పడింది. తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీనిని వర్చువల్‌ పద్ధతిలో మూడుసార్లు శంకుస్థాపన చేసింది. అయితే ఇప్పటి వరకు పునాది రాయి కూడా పడలేదు. అలాగే తాము అధికారంలోకి వస్తే సెజ్‌ కర్మాగారాల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇస్తామని అప్పట్లో జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. స్థానికుల మాటెలా ఉన్నా కనీసం నిర్వాసితులకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించలేదు. గత ఎన్నికల సమయంలో వైసీపీ మాటలు విని నిండా మునిగామని పూడిమడక మత్స్యకారులతో పాటు నిర్వాసిత రైతులు కూడా ఆవేదన చెందుతున్నారు.

Updated Date - Apr 26 , 2024 | 12:12 AM