Share News

కోడ్‌ ఉన్నా ఏయూలో అచీవర్స్‌డే!

ABN , Publish Date - Apr 24 , 2024 | 02:05 AM

అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరించడం, ఆ పార్టీకి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కోడ్‌ ఉన్నా ఏయూలో అచీవర్స్‌డే!

26న నిర్వహణకు ముమ్మర ఏర్పాట్లు

వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకేనని విమర్శలు

ప్రభుత్వానికి సానుకూలంగా మాట్లాడేలా విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ట్రైనింగ్‌?

అధికారుల తీరుపై నగర వాసుల విస్మయం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి):

అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరించడం, ఆ పార్టీకి లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా, నిబంధనలకు వ్యతిరేకమని ఎంతమంది గగ్గోలు పెట్టినా అధికార పార్టీ సేవలో తరిస్తూనే ఉన్నారు. తాజాగా మరో కార్యక్రమానికి రంగం సిద్ధం చేశారు. ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నప్పటికీ అచీవర్స్‌ డే పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి, జగన్‌ సర్కారు ఏలుబడిలో నిరుద్యోగులకు ఎంతో మేలు జరిగిందని ప్రచారం చేసేందుకు యత్నిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఏయూ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి చెందిన పలువురు విద్యార్థులు క్యాంపస్‌ సెలక్షన్స్‌లో ఉద్యోగాలు సాధించారు. వీరిని తల్లిదండ్రులు సమక్షంలో సత్కరించేందుకు వర్సిటీ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈనెల 26న అచీవర్స్‌ డే పేరుతో పెద్దఎత్తున కార్యక్రమం నిర్వహించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిపి సుమారు 1,400 మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమం నిర్వహణ పట్ల పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండగా ఇలాంటి కార్యక్రమం నిర్వహించడంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనిపై ఏయూ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ కె.శ్రీనివాసరావును వివరణ కోరగా..కార్యక్రమం నిర్వహణకు జిల్లా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అనుమతి ఇచ్చారని బదులిచ్చారు. విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించడంతోపాటు తల్లిదండ్రులను సత్కరిస్తామని వివరించారు.

వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకే...

వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకే ఏయూ అధికారులు ఇంత పెద్దఎత్తున కార్యక్రమం చేపట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైసీపీ పాలనలో ఉద్యోగాలు లేవనే నిరుద్యోగులు ఆగ్రహంగా ఉన్నారు. ఇటువంటి తరుణంలో ఏయూ అధికారులు నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందవచ్చునని వైసీపీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు, కొందరు విద్యార్థుల తల్లిదండ్రులతో ప్రభుత్వ సహకారం, ప్రోత్సాహంపై ఈ కార్యక్రమంలో మాట్లాడించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారంటున్నారు.

Updated Date - Apr 24 , 2024 | 07:33 AM