Share News

ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి...

ABN , Publish Date - Apr 24 , 2024 | 02:08 AM

తాను ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, డబ్బు సంపాదించేందుకునేందుకు కాదని విశాఖపట్నం లోక్‌సభ స్థానానికి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎం.శ్రీభరత్‌ అన్నారు.

ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి...

సింగపూర్‌ తరహాలో విశాఖ అభివృద్ధి చెందాలి

అదే నా ఆశయం

ఉక్కు పరిరక్షణ ‘కూటమి’తోనే సాధ్యం

పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం నెలకొల్పుతాం

ప్రముఖ ఐటీ కంపెనీలను నగరానికి తీసుకువస్తాం

పోర్టు కాలుష్యం సమస్య పరిష్కారానికి కృషిచేస్తా

గంజాయి, మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపుతాం

అంతర్జాతీయ పర్యాటకులు వచ్చేలా ప్రాజెక్టులు తీసుకువస్తా

ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి

నగరంలో 75 శాతం దాటాలి

‘ఆంధ్రజ్యోతి’తో కూటమి ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్‌

విశాఖపట్నం, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి)

తాను ప్రజలకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, డబ్బు సంపాదించేందుకునేందుకు కాదని విశాఖపట్నం లోక్‌సభ స్థానానికి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎం.శ్రీభరత్‌ అన్నారు. ప్రపంచానికి రోల్‌మోడల్‌గా ఉన్న సింగపూర్‌ మాదిరిగా విశాఖ నగరం అభివృద్ధి జరగాలన్నదే తన ఆశయమన్నారు. విశాఖ మాదిరిగా ఒకప్పుడు సింగపూర్‌ కూడా మత్స్యకార పల్లె అని, అయితే ‘లీకూన్‌’ నాయకత్వంలో ఆ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, అదే తరహాలో విశాఖను ఆర్థిక నగరంగా, పర్యాటకపరంగా అభివృద్ధి చేయడం, ఉపాధికి కేరాఫ్‌గా మార్చడం కష్టమేమీ కాదన్నారు. ప్రశాంతతకు మారుపేరుగా గుర్తింపుపొందిన విశాఖలో ఇప్పుడు అదుపుతప్పిన శాంతి భద్రతలను తాను గాడిలో పెట్టేందుకు కృషిచేస్తానని పేర్కొన్నారు. ఎన్నికల్లో రెండోసారి బరిలోకి దిగబోతున్న శ్రీభరత్‌...విశాఖ అభివృద్ధి, నగరంలో శాంతిభద్రతల సమస్య, పరిశ్రమలు, ఐటీ అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాల కల్పన, తదితర అంశాలపై తన ఆలోచనలను మంగళవారం ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...

సింగపూర్‌ తరహాలో విశాఖ అభివృద్ధే లక్ష్యం

మనం, మన ప్రాంతం అభివృద్ధి కోసం పెద్ద స్థాయిలో లక్ష్యాలు పెట్టుకుని వాటి సాధనకు కృషిచేయాలి. పెద్ద కలలు కని వాటి సాధనకు యత్నించాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అనేవారు. అదే మాదిరిగా భారీ లక్ష్యాలను నిర్ణయించుకుని వాటిని సాధించిన దీరోదాత్తుడు లీకూన్‌. ఆయన సారథ్యంలో సింగపూర్‌ అభివృద్ధి చెందింది. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని విశాఖను అభివృద్ధి చేయాలన్నదే నా ఆలోచన, ఆశయం. సింగపూర్‌లా విశాఖలో ఉపాధి అవకాశాలు కల్పించడం, పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన వసతుల కల్పన, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలన్నదే నా ఆశయం. ఇంకా సింగపూర్‌ మాదిరిగా ఆర్థిక నగరంగా మార్చినప్పుడే ప్రపంచంలో విశాఖ పేరు మార్మోమోగుతుంది.

విశాఖ ఉక్కును కాపాడుకుంటాం

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రస్తుతం ఎదుర్కొంటున్న గడ్డు సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తాం. ఇలాగే 2002లో విశాఖ ఉక్కు కర్మాగారం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొని బీఐఎఫ్‌ఆర్‌కు వెళ్లినప్పుడు నాడు సీఎం చంద్రబాబునాయుడు చొరవతో ఎంపీలు ఎంవీవీఎస్‌ మూర్తి, కింజరాపు ఎర్రన్నాయుడు తదితరులు అప్పటి ప్రధాని వాజపేయి వద్దకు వెళ్లి సమస్య పరిష్కారానికి కృషిచేశారు. ఆ తరువాత కర్మాగారం శరవేగంగా ఏడు మిలియన్‌ టన్నుల ఉత్పత్తి స్థాయికి చేరుకుని దేశానికే తలమానికంగా మారింది. ఇప్పుడు కూడా కర్మాగారం ప్రభుత్వ రంగంలోనే ఉండాలంటే సెయిల్‌లో విలీనం చేయాలి. అప్పుడే సొంత గనులు దక్కుతాయి. ఈ ప్రక్రియ కూటమి ప్రభుత్వానికి సాధ్యమవుతుంది. మూడేళ్లుగా ఉక్కు కార్మికులు ఆందోళన చేస్తున్నా కార్మిక సంఘాలు, విపక్ష పార్టీల నేతలను ఢిల్లీకి తీసుకువెళ్లి ప్రధానిని కలిసి సమస్య పరిష్కారానికి చొరవ చూపడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారు.

భారీ పరిశ్రమలు ఏర్పాటుకు యత్నిస్తాం

ఉత్తరాంధ్రకు గేట్‌వేగా ఉండే విశాఖలో చాలాకాలం క్రితం భారీ పరిశ్రమలు వచ్చాయి. తరువాత ఎక్కువమందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించే పరిశ్రమలు రాకపోవడం వాస్తవమే. దీనిపై ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలు అనువుగా ఉంటాయో ఆలోచించి ప్రణాళికలు వేసి అమలుచేయాలి. ఇప్పటికే ఉన్న భారీ పరిశ్రమల విస్తరణ, అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు కృషిచేస్తాను. ముఖ్యంగా ఫార్మా, మత్స్య సంపద ఎగుమతి విషయంలో దృష్టిసారిస్తే వ్యాపార అవకాశాలు పెరిగి ఉపాధి దొరికి నగరం అభివృద్ధి చెందుతుంది.

ఐటీ కంపెనీల రాకకు కృషి

విశాఖకు ఇప్పటివరకు ఐటీలో చిన్న కంపెనీలు, బీపీవో సర్వీసులు అందించే సంస్థలే వచ్చాయి. పెద్ద కంపెనీలు హైదరాబాద్‌కు పరిమితమయ్యాయి. పెద్ద కంపెనీలను తీసుకురావడంలో గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. చంద్రబాబునాయుడు హయాంలో విశాఖకు ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌ కంపెనీ వచ్చింది. కొద్దిరోజుల్లో కంపెనీ ఏర్పాటవుతుందనగా ప్రభుత్వం మారడంతో ఆ కంపెనీ వెనక్కి వెళ్లిపోయింది. అలాగే అదానీ డేటా సెంటర్‌కు చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం...అన్ని రకాలుగా అడ్డుకుంది. అదే డేటా సెంటర్‌కు ఏడాది క్రితం మళ్లీ జగన్మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇంకా స్టార్టప్‌లు, ఐటీలో రీసెర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌, ఇతరత్రా రంగాలకు ముడిపడి ఉన్న కంపెనీలు రావాలంటే వాటిలో పనిచేసేందుకు నిపుణులు లభ్యత ముఖ్యం. అటువంటి నిపుణులు స్థానికంగా రావాలంటే ఇక్కడ ప్రముఖ విద్యా సంస్థలతో ఐటీ కంపెనీలు ఒప్పందాలు చేసుకుని విద్యార్థులను తీర్చిదిద్దాలి. ఉత్తరాంధ్రలో వేలాది మంది యువత ఉపాధితోపాటు శిక్షణకు ఇతర ప్రాంతాలకు వెళుతున్నారు. అటువంటి యువతను విశాఖలో శిక్షణ ఇచ్చి ఇక్కడే ఉపాధి కల్పిస్తే పెద్ద కంపెనీలు వస్తాయి. ఇందుకు ప్రభుత్వాలు కృషిచేయాలి. అటువంటి కృషి చంద్రబాబునాయుడు మాత్రమే చేయగలరు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రముఖ కంపెనీలను విశాఖకు రప్పించేందుకు ప్రయత్నం చేస్తాం.

పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం పునరుద్ధరణ

గత ఐదేళ్లలో విశాఖతోపాటు రాష్ట్రంలో పరిశ్రమల నిర్వహణ, విస్తరణ, ఏర్పాటుకు అనువైన వాతావరణం పూర్తిగా పోయింది. చివరకు పరిశ్రమల విస్తరణ చేద్దామన్నా అనేక ఇబ్బందులు సృష్టించారు. ఒక విధంగా చెప్పాలంటే పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం చెడగొట్టారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనేకమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉత్సాహంతో ఉన్నా...ఇక్కడ వాతావరణంతో వారంతా మౌనంగా ఉండడం లేదా ఇతర రాష్ట్రాలకు తరలిపోవడం జరిగింది. మంచి ప్రభుత్వం వస్తే ఇక్కడకు వచ్చేందుకు అనేకమంది వ్యాపారులు సిద్ధంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే యుద్ధప్రాతిపదికగా శాంతిభద్రతల సమస్యను పరిష్కరించి సమర్థులైన అధికారులకు బాధ్యతలు అప్పగించే ప్రయత్నం చేస్తాం.

నగర కాలుష్యాన్ని అరికట్టాల్సిందే

విశాఖ నగరంలో లక్షల జనాభా నివసిస్తున్నారు. ప్రజల ఆరోగ్యంగా ఉండాలంటే నగరం పరిశుభ్రంగా ఉండాలి. అయితే విశాఖ పోర్టు నుంచి వచ్చే కాలుష్యం నగర ప్రజల్ని ఉక్కిరిబిక్కిరిచేస్తుంది. ముఖ్యంగా పోర్టులో దిగుమతి అయ్యే బొగ్గు వల్లే కాలుష్యం వస్తోంది. పోర్టు యాజమాన్యం నివారణ చర్యలు తీసుకున్నా ఫలితం ఉండడం లేదు. కాలుష్యం పోవాలంటే బొగ్గు దిగుమతి నిలిపివేసి మరో పోర్టుకు తరలించాలి. పోర్టులో కేవలం కార్గో రవాణాకు మాత్రమే అనుమతించాలి. దీనిపై కేంద్రస్థాయిలో నిర్ణయం తీసుకునేలా కృషిచేస్తాను. బొగ్గు దిగుమతి నిలిపివేస్తే తప్ప వన్‌టౌన్‌ ప్రాంతాన్ని రక్షించడం కష్టం. ఈ విషయంలో ప్రజలు, పౌర సంఘాల సూచనలు తీసుకుని సమస్య పరిష్కరిస్తాను.

పర్యాటకంగా అనేక విభాగాల అభివృద్ధి

పర్యాటకం అనగా గుర్తుకొచ్చే నగరం విశాఖ. అయితే విశాఖలో బీచ్‌ టూరిజం విస్తరణకు కొన్ని పరిమితులు ఉన్నాయి. ఇక్కడ కెరటాలు ఉధృతి ఎక్కువగా ఉండడం, లోతు సమస్యలుగా ఉన్నాయి. అందువల్ల బీచ్‌లో క్రీడలు వంటి వాటిని ప్రోత్సహించాలి. ఏజెన్సీలో పర్యాటకం కోసం మౌలిక వసతులు కల్పించాలి. విశాఖ ప్రాంతంలో బౌద్ధమత పర్యాటక ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించవచ్చు. అంతర్జాతీయ పర్యాటకులను విశాఖకు రప్పించేలా ప్రాజెక్టులు తీసుకువస్తే పెద్దఎత్తున ఉపాధి దొరుకుతుంది. అందుకు కృషివస్తా.

గంజాయి, మత్తు పదార్థాల అరికడతాం

గంజాయి, మత్తు పదార్థాల వినియోగం, ఇతర ప్రాంతాలకు రవాణా ఆందోళన కలిగిస్తోంది. లక్షల మంది యువత నిర్వీర్యం కావడం...అటు సమాజానికి ఇటు కుటుంబాలకు తీవ్ర ఆవేదన, ఆందోళన కలిగిస్తోంది. ఏజెన్సీ నుంచి గంజాయి రవాణా విషయంలో ప్రభుత్వ వైఫల్యం ఉంది. ప్రపంచంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు విశాఖలో ఉన్నట్టు తేలుతుంది. ఇది సిగ్గుచేటైనా అంశం. ఇంకా డ్రగ్స్‌ దిగుమతి కూడా ప్రభుత్వ వైఫల్యంగానే చెప్పాలి. విశాఖకు వేల టన్నుల మత్తు పదార్థాలు దిగుమతి అవుతున్నాయని కేంద్రానికి సమాచారం రావడంతో సీబీఐ రంగంలోకి దిగింది. ఇది కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే. కేసు దర్యాప్తునకు అధికారులు అడ్డుతగిలారని సీబీఐ కూడా పేర్కొంది. గంజాయి, మత్తు పదార్థాల సరఫరా, రవాణాపై ఉక్కుపాదం మోపాలి. అది ఈ ప్రభుత్వానికి సాధ్యంకాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని అరికడతాం. అందుకు కేంద్ర సాయం కోసం యత్నిస్తాను.

ఐదేళ్లలో రాజకీయంగా అనుభవం సంపాదించా

2019లో ఎంపీగా పోటీ చేసే సమయానికి రాజకీయంగా అనుభవం తక్కువ. అప్పట్లో త్రిముఖ పోటీ ఉండడంతో స్వల్ప తేడాతో ఓడిపోయా. గడచిన ఐదేళ్లలో ఒకపక్క ప్రజలకు అందుబాటులో ఉంటూ, మరోపక్క పార్టీ నాయకులు, కేడర్‌ను ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నాను. గ్రామాలు, నగరంలోని మురికివాడలలో ఉన్న సమస్యలను తెలుసుకున్నా. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు మరింతగా సేవ చేయాలనే లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. తాతలు ఎంవీవీఎస్‌ మూర్తి, కావూరి సాంబశివరావుల నుంచి రాజకీయాలకు సంబంధించి అనేక విషయాలు నేర్చుకున్నా. సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను తప్ప డబ్బు సంపాదించుకునేందుకు కాదు. యూనివర్సిటీ చైర్మన్‌గా ఉన్న నేను అక్కడే ఎక్కువ సమయం కేటాయిస్తే మరింత సంపాదించుకోవచ్చు. కానీ రాజకీయాల్లో ఉంటూ ప్రజలకు సేవ చేయడంలో ఎక్కువ ఆనందం, తృప్తి ఉంటాయి.

నగరంలో ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనాలి

ప్రజాస్వామ్యంలో ఓటు అనేది గొప్ప ఆయుధం. ప్రతి ఒక్కరూ విధిగా ఓటు వేయాలి. గ్రామీణ ప్రాంతంలో 70 శాతం దాటి ఓటింగ్‌ జరుగుతుంది. నగరంలో మాత్రం 2019లో 67 శాతానికి పరిమితమైంది. ఈసారి నగరంలో ప్రతి ఒక్కరూ ఓటువేసి 75 శాతం ఓటింగ్‌ జరిగేలా సహకరించాలి. విశాఖ పార్లమెంటు, ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో కూటమి అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రతిచోట ప్రజల నుంచి విశేషమైన మద్దతు లభిస్తోంది. వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో విశాఖ పార్లమెంటు పరిధిలో ఓటర్లంతా కూటమి అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలి. అప్పుడే అంతా కోరుకునే సుందర విశాఖ స్వప్నం కల సాకారం అవుతుంది.

Updated Date - Apr 24 , 2024 | 02:08 AM