Share News

చోడవరం... ఆది నుంచీ టీడీపీ ఆధిక్యం

ABN , Publish Date - Apr 24 , 2024 | 02:11 AM

చారిత్రకంగా ప్రాధాన్యం...రాజకీయంగా చైతన్యం...ఇదీ అనకాపల్లి జిల్లాలోని చోడవరం నియోజకవర్గం ప్రత్యేకత.

చోడవరం... ఆది నుంచీ టీడీపీ ఆధిక్యం

నోట్‌ః పొలిటికల్‌ పేజీ

ఫొటోరైటప్స్‌ః 18సీడీఎం1,2, చోడవరం ఊరు

పార్టీ ఆవిర్భావం తరువాత ఇప్పటివరకూ తొమ్మిదిసార్లు ఎన్నికలు

ఆరుసార్లు తెలుగుదేశం విజయం

మూడుసార్లు కేఎస్‌ఎన్‌రాజు వర్సెస్‌ కరణం ధర్మశ్రీ

నాలుగోసారి పోటీ పడుతున్న ఆ ఇద్దరు

చోడవరం, మార్చి 18:

చారిత్రకంగా ప్రాధాన్యం...రాజకీయంగా చైతన్యం...ఇదీ అనకాపల్లి జిల్లాలోని చోడవరం నియోజకవర్గం ప్రత్యేకత. ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గట్టి పట్టున్న నియోజకవర్గాల్లో చోడవరం ముందువరుసలో ఉంటుంది. 1983లో తెలుగుదేశం ఆవిర్భావం తరువాత ఈ నియోజకవర్గంలో తొమ్మిదిసార్లు ఎన్నికలు జరగగా, ఆరుసార్లు ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 1983, 1985, 1994 ఎన్నికల్లో గూనూరు ఎర్రునాయుడు, 2004లో గంటా శ్రీనివాసరావు, 2009, 2014లలో కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. 1989, 1999లలో కాంగ్రెస్‌ తరపున పోటీ చేసిన బలిరెడ్డి సత్యారావు గెలిచారు. ఆయన 1989లో కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో మధ్య తరహా నీటిపారుదల శాఖా మంత్రిగా పనిచేశారు. గడచిన (2019) ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కరణం ధర్మశ్రీ...టీడీపీ అభ్యర్థి కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజుపై విజయం సాధించారు.

ఇదీ చరిత్ర

చోడవరం ప్రాంతాన్ని పూర్వకాలంలో చోడమల్లాపురంగా పిలిచేవారు. ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు ఉపేంద్ర తన తల్లిదండ్రుల పేర్లు కలిసి వచ్చేలా చోడమల్లాపురం అని నామకరణం చేశారు. కాలక్రమంలో చోడమల్లాపురం కాస్తా చోడవరంగా మారిపోయింది. 1947లో చోడవరం నియోజకవర్గం ఏర్పడిన తొలినాళ్లలో ఉత్తరాపల్లి నియోజకవర్గంలో ఉన్న కె.కోటపాడు, కోడూరు, కడిగొట్ల, లక్ష్మీపురం, బుచ్చెయ్యపేట ఫిర్కాలు ఉండేవి. 1978లో నియోజకవర్గాల పునర్విభజనలో కలిగొట్ల ఫిర్కా ఉత్తరాపల్లి నియోజకవర్గంలో చేరిపోగా, కోడూరు, కోటపాడు మాడుగుల ఫిర్కాలో చేరిపోయాయి. తరువాత కాలంలో కె.కోటపాడు ఉత్తరాపల్లి నుంచి మాడుగుల నియోజకవర్గంలో చేరింది. ఇక గొంప నియోజకవర్గంలో ఉన్న రోలుగుంట, రావికమతం ఫిర్కాలు కొత్తగా చోడవరం నియోజకవర్గంలో చేరాయి. చోడవరం నియోజకవర్గ చరిత్ర చూస్తే 1951 నుంచి 2019 వరకూ జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా తెలుగుదేశం పార్టీ ఆరుసార్లు విజేతగా నిలిచింది. టీడీపీకి చెందిన గూనూరు ఎర్రునాయుడు (మిలట్రీనాయుడు) మూడుసార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవగా, మాజీమంత్రి బలిరెడ్డి సత్యారావు, వేచలపు పాలవెల్లి, కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు రెండేసిసార్లు విజయం సాధించారు. మిగిలిన వారంతా ఒక్క దఫాకే పరిమితమయ్యారు.

నాలుగోసారి ఇద్దరి మ్య పోటీ

2009, 2014, 2019 ఎన్నికల్లో కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, కరణం ధర్మశ్రీ మధ్య ప్రధాన పోటీ జరిగింది. 2009 ఎన్నికల్లో కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయగా, ధర్మశ్రీ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగి రాజు చేతిలో ఓటమిపాలయ్యారు. ఇక 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు బరిలో నిలవగా, ధర్మశ్రీ వైసీపీ అభ్యర్థిగా పోటీపడి రెండోసారి రాజు చేతిలో ఓటమిపాలయ్యారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన ధర్మశ్రీ...టీడీపీ అభ్యర్థిగా నిల్చున్న కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజుపై విజయం సాధించారు. వచ్చే నెల జరగనున్న ఎన్నికల్లో సైతం వీరిద్దరే ప్రధాన పార్టీల అభ్యర్థులుగా పోటీపడుతుండడం విశేషంగా చెప్పుకోవాలి. దాదాపు దశాబ్దన్నరగా ఈ ఇద్దరు నేతల చుట్టూనే చోడవరం రాజకీయం నడుస్తోంది.

గత (2019) ఎన్నికల్లో అభ్యర్థులకు వచ్చిన ఓట్లు:

మొత్తం ఓట్లు: 2,10,313

పోలైనవి: 1,77,219

కరణం ధర్మశ్రీ (వైసీపీ): 93,456

కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు (టీడీపీ): 66,210

పీవీఎస్‌ఎన్‌ రాజు (జనసేన): 5,246

గూనూరు వెంకటరావు (కాంగ్రెస్‌): 1,182

గణపతిరాజు వెంకట అప్పలరాజు (ఇండి): 928

మొల్లి వెంకటరమణ (బీజేపీ): 598

పడవల చక్రవర్తి (ఇండియా ప్రజాబంధు పార్టీ) 315

వంకాయల రామచంద్రరావు (ఇండి): 291

గొలుకొండ శ్రీనివాసరావు (జనజాగృతి): 248

నోటా: 5,033

చోడవరం నియోజకవర్గ ప్రొఫైల్‌:

మండలాలు: 4 (చోడవరం, బుచ్చెయ్యపేట, రావికమతం, రోలుగుంట)

పంచాయతీలు: 110

మొత్తం ఓటర్లు: 2,15,396

పురుషులు: 1,04,589

మహిళలు: 1,10,800

ఇతరులు: 7

ఇప్పటి వరకు గెలిచిన ఎమ్మెల్యేలు

సంవత్సరం విజేత పార్టీ మెజార్టీ ప్రత్యర్థి

1947-1952 భూపతిరాజు జాతీయ కాంగ్రెస్‌ పార్టీ --- ---

1952-1955 కందర్ప రామేశం కృషికార్‌లోక్‌ పార్టీ 9,329 భూపతిరాజు సన్యాసిరాజు (కాంగ్రెస్‌)

1955-1962 రెడ్డి జగన్నాథం ఇండిపెండెంట్‌ 2,785 బి.జి.నాయుడు (కృషికార్‌ లోక్‌పార్టీ)

1962-1967 ఇలపకుర్తి సత్యనారాయణ కాంగ్రెస్‌ 3,440 బి.జి.నాయుడు (ఇండిపెండెంట్‌)

1967-1972 వేచలపు పాలవెల్లి స్వతంత్రపార్టీ 15,300 ఇలపకుర్తి సత్యనారాయణ (కాంగ్రెస్‌)

1972-1978 వేచలపు పాలవెల్లి కాంగ్రెస్‌ 7,224 బి.సూర్యనారాయణ (ఇండిపెండెంట్‌)

1978-1983 ఈమని సీతారామశాస్త్రి జనతాపార్టీ 12,066 వేచలపు పాలవెల్లి (కాంగ్రెస్‌)

1983-1985 గూనూరు ఎర్రునాయుడు టీడీపీ 9,282 జి.కన్నంనాయుడు (కాంగ్రెస్‌)

1985-1989 గూనూరు ఎర్రునాయుడు టీడీపీ 17,742 జి.కన్నంనాయుడు (కాంగ్రెస్‌)

1989-1994 బలిరెడ్డి సత్యారావు కాంగ్రెస్‌ 9,733 గూనూరు ఎర్రునాయుడు (టీడీపీ)

1994-1999 గూనూరు ఎర్రునాయుడు టీడీపీ 19,076 బలిరెడ్డి సత్యారావు (కాంగ్రెస్‌)

1999-2004 బలిరెడ్డి సత్యారావు కాంగ్రెస్‌ 5,518 గూనూరు ఎర్రునాయుడు (టీడీపీ)

2004-2009 గంటా శ్రీనివాసరావు టీడీపీ 9,616 బలిరెడ్డి సత్యారావు (కాంగ్రెస్‌)

2009-2014 కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు టీడీపీ 1,385 కరణం ధర్మశ్రీ (కాంగ్రెస్‌)

2014-2019 కె.ఎస్‌.ఎన్‌.ఎస్‌.రాజు టీడీపీ 612 కరణం ధర్మశ్రీ (వైసీపీ)

2019-2024 కరణం ధర్మశ్రీ వైసీపీ 27,246 కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు (టీడీపీ)

Updated Date - Apr 24 , 2024 | 02:11 AM