Share News

నచ్చకపోతే ‘నోటా’ నొక్కొచ్చు

ABN , Publish Date - Apr 24 , 2024 | 02:20 AM

ఓటుకు మన దేశ గతిని మార్చే శక్తి ఉంది. వ్యవస్థ మార్పునకు నాంది పలుకుతుంది.

నచ్చకపోతే ‘నోటా’ నొక్కొచ్చు

-2014 ఎన్నికల్లో 21,991, -2019 ఎన్నికల్లో 55231 ఓట్లు

-2014లో చోడవరం నియోజకవర్గంలో గెలుపు, ఓటమిల మధ్య వ్యత్యాసం 909...నోటాకే 931 ఓట్లు

రోలుగుంట, ఏప్రిల్‌ 16:

ఓటుకు మన దేశ గతిని మార్చే శక్తి ఉంది. వ్యవస్థ మార్పునకు నాంది పలుకుతుంది. ఒకప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరూ నచ్చకపోయినా ఎవరో ఒకరికి ఓటు వేసి వేయాల్సి వచ్చింది. లేదా ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉండాల్సి వచ్చేది. ఇది గతం. ఇప్పుడు అలా కాదు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2014 సార్వత్రిక ఎన్నికల్లో మొదటిసారి కేంద్ర ఎన్నికల సంఘం ‘నోటా’ (నన్‌ ఆప్‌ ద అబౌ)ను ఓటర్లకు అందుబాటులోకి తెచ్చింది. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే ‘నోటా’కు ఓటు వేసుకోవచ్చు. ఓటింగ్‌ యంత్రంపై అభ్యర్థులు, వారి పేర్లు, గుర్తులతో పాటు వరుస సంఖ్యలో చివర్లో ‘నోటా’ పేరిట ఓ గుర్తు ఉంటుంది. ఈ నోటా వల్ల కొన్ని పర్యాయాలు అభ్యర్థుల జాతకాలు తారుమారు అయిపోతున్నాయి. ఓటు వేయకుండా ఇంట్లో కూర్చోవడం సరైన నిర్ణయం కాదు. ఓటు హక్కు తప్పనిసరిగ్గా వినియోగించుకోవాలి. పోలైన ఓట్లలో 20 శాతం, అంతకంటే ఎక్కువ ఓట్లు నోటాకు పోలైతే అభ్యర్థులను ఎన్నికల సంఘం పోటీకి అనర్హులుగా ప్రకటిస్తుంది. ఆ ఎన్నికలను నిలిపివేస్తుంది. తిరిగి ఎన్నికలు నిర్వహించేందుకు తేదీలను ప్రకటిస్తే నూతన అభ్యర్థులు (ముందు అనర్హులుగా ప్రకటించినవారు కాకుండా) బరిలో నిలవాల్సి ఉంటుంది.

ఉమ్మడి విశాఖ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో 2019 ఎన్నికల్లో నోటాకు 55,231 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఎవరూ నచ్చనప్పుడు ఓటరు తన అభిప్రాయం తెలపడానికి వీలుగా ఎన్నికల సంఘం ‘నోటా’ను ప్రవేశపెట్టింది. ప్రతి ఎన్నికల్లో నోటాకు వేసినవారు పెరుగుతూనే ఉన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో ప్రధానపార్టీ అభ్యర్థులకు వచ్చే ఓట్లు కంటే నోటాకే అధికంగా పడుతున్నాయి. అభ్యర్థులు నచ్చక ఓటు వేస్తున్నారో లేక తెలియక నోటాకు నొక్కుతున్నారో గానీ నోటాకు భారీగానే నమోదవుతున్నాయి.

2019 సార్వత్రిక ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గంలో నోటాకు 4,263 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ ప్రధాన పార్టీలైన బీజేపీ అభ్యర్థి కోరాడ అప్పారావుకు 2,468, కాంగ్రెస్‌ అభ్యర్థి తెడ్డు రామదాసుకు 1,880 కంటే నోటాకే అధికంగా పడ్డాయి. అలాగే విశాఖ తూర్పులో నోటాకు 1,741 ఓట్లు పడగా...కాంగ్రెస్‌ అభ్యర్థి వజ్జిపర్తి శ్రీనివాసరావుకు 1,663 ఓట్లు వచ్చాయి. అలాగే చోడవరం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి గూనురు వెంకట్రావుకు 1,188, బీజేపీ అభ్యర్థి మొల్లి వెంకటరమణకు 625 ఓట్లు పడితే నోటాకు 5,036 వచ్చాయి. అలాగే మాడుగుల నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి బొడ్డు శ్రీనివాస్‌కు 1657, బీజీపి అభ్యర్థి సుబ్బలక్ష్మికి 796, జనసేన అభ్యర్థి గవిరెడ్డి సన్యాసినాయుడుకు 3,745 ఓట్లు రాగా, నోటాకు 4,672 వచ్చాయి. అలాగే అరకులోయలో గతం కంటే నోటాకు అధికంగా నమోదయ్యాయి. బీజేపీ, కాంగ్రెస్‌, ఇతర అభ్యర్థుల కంటే నోటాకే 10,177 ఓట్లు పోలయ్యాయి. పాడేరులో బీజీపీ అభ్యర్థి లోకుల్‌ గాంధీకి 4,631, కాంగ్రెస్‌ అభ్యర్థి వంతల సుబ్బారావుకు 4,910, జనసేన అభ్యర్థి పసుపులేటి బాలరాజుకు 6,038 ఓట్లు రాగా, నోటాకు 7,808 ఓట్లు పడ్డాయి. అలాగే పెందుర్తి, పాయరావుపేట నియోజకవర్గాల్లో బీజేపీ, కాంగ్రెస్‌, ఇతర ఇండిపెండెంట్ల కంటే నోటాకే అధికంగా ఓట్లు పడ్డాయి.

2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల వారీగా ‘నోటా’కు వచ్చిన ఓట్లు...

నియోజకవర్గం నోటాకు వేసిన ఓట్లు

2014లో 2019లో

భీమిలి 2,468 4,263

విశాఖ తీర్పు 1,042 1,741

విశాఖ దక్షిణ 1,032 1,208

విశాఖ ఉత్తర 1,440 1,401

విశాక పశ్చిమ 1,119 1,561

గాజువాక 1,103 1,764

చోడవరం 931 5,036

వి.మాడుగుల 946 4,672

అరుకులోయ 4,933 10,177

పాడేరు 2,828 7,808

అనకాపల్లి 774 2,558

పెందుర్తి 1,150 3,737

ఎలమంచిలి 631 2,963

పాయకరావుపేట 900 5,189

నర్సీపట్నం 694 1,143

మొత్తం 21,991 55,231

నోటా టెన్షన్‌

నోటాను ఈవీఎంలలో చేర్చడంతో అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలైంది. బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకుంటే నోటాకు ఓటు వేయవచ్చు. గతంలో జరిగిన ఎన్నికల్లో నోటాకు భారీగానే పడుతుండడంతో అభ్యర్థుల్లో టెన్షన్‌ మొదలైంది. వృద్ధులు, నిరక్షరాస్యులు నోటా కూడా ఓ అభ్యర్థి గుర్తు అనుకుని ఓటు వేసే ప్రమాదం లేకపోలేదనే చర్చ జరుగుతుంది.

రీ ఎలక్షనే...

నోటా గురించి చాలా మంది సామాన్య ప్రజల్లో కొన్ని అపోహాలు కూడా లేకపోలేదు. ఏ అభ్యర్థినీ కాదని నోటాకు ఓటు వేసినప్పుడు, అభ్యర్థులందరి కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చినా కూడా నోటాతో సంబంధం లేకుండా ఓట్లు ఏ అభ్యర్థికి ఎక్కువ వస్తే వారు గెలిచినట్టు అనుకుంటూ ఉంటారు. ఇది పొరపాటు. ఒక నియోజకవర్గంలో అభ్యర్థులందరి కంటే నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే ఆ నియెజకవర్గంలో ఏ అభ్యర్థీ గెలిచినట్టు కాదు. తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సిందే. ఈ రీ ఎలక్షన్‌లో ఇంతకు ముందు పోటీ చేసిన ఏ అభ్యర్థికీ పోటీ చేయడానికి అర్హత ఉండదు. తాజాగా నిర్వహించిన ఎన్నికల్లో ఏ అభ్యర్థికి 50 శాతానికి మించి ఓట్లు వస్తాయో ఆ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటిస్తారు.

Updated Date - Apr 24 , 2024 | 02:20 AM