Share News

జగన్‌ రోడ్‌షో వెలవెల

ABN , Publish Date - Apr 24 , 2024 | 02:16 AM

ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత ‘మేమంతా సిద్ధం’ పేరుతో జిల్లాలో నిర్వహిస్తున్న బస్సు యాత్రకు మంగళవారం కూడా ప్రజల నుంచి స్పందన కరువైంది.

జగన్‌ రోడ్‌షో వెలవెల

విశాఖలో మలిరోజు పర్యటనలోనూ అదే సీన్‌

బస్సు యాత్రకు కనిపించని స్పందన

పీఎంపాలెం క్రికెట్‌ స్టేడియం వద్ద కొద్దిమంది జనం

వారంతా ఆటోల్లో తీసుకువచ్చినవారే

ఆ తర్వాత జనం లేకపోవడంతో బస్సులోకి వె ళ్లి కూర్చున్న జగన్‌

రోడ్డుపక్కన ఉన్న ఇద్దరు, ముగ్గురికీ నమస్కారం చేసుకుంటూ ముందుకు...

విశాఖపట్నం, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి):

ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత ‘మేమంతా సిద్ధం’ పేరుతో జిల్లాలో నిర్వహిస్తున్న బస్సు యాత్రకు మంగళవారం కూడా ప్రజల నుంచి స్పందన కరువైంది. నగర పరిధిలో ఆదివారం రోడ్‌షో నిర్వహించిన ఆయన...సోమవారం యాత్రకు విరామం ప్రకటించారు. 21వ రోజు యాత్రలో భాగంగా మంగళవారం ఉదయం 10.30 గంటలకు ఎండాడలోని ఎంవీవీ సిటీ వెనుక బస చేసిన ప్రాంతం నుంచి బస్సు యాత్రను జగన్‌ ప్రారంభించారు. అప్పటికే ఆరు, ఏడు, ఎనిమిది వార్డుల నుంచి ఆటోల్లో తరలించిన జనాలను నాయకులు పీఎం పాలెం క్రికెట్‌ స్టేడియం వద్ద జాతీయ రహదారి పక్కన నిలబెట్టి ఉంచారు. ఉదయం ఎనిమిది గంటలకే వారందరినీ అక్కడకు తీసుకువచ్చారు. తొమ్మిది నుంచి ఎండ తీవ్రంగా ఉండడంతో వారంతా విలవిల్లాడిపోయారు. సీఎం జగన్‌ బస్సుపై నిలబడి వారందరికీ అభివాదం/నమస్కారం చేసుకుంటూ ముందుకుసాగారు. అయితే స్టేడియం దాటేసరికి ఒక్కరు కూడా రోడ్డు మీద లేకపోవడంతో జగన్‌ బస్సుపై నుంచి దిగి లోపల కూర్చున్నారు. అక్కడి నుంచి రోడ్డుపక్కన నిలబడి చూస్తున్న వారికి నమస్కారం చేసుకుంటూ వెళ్లిపోయారు. మధురవాడ, కొమ్మాది, పరదేశిపాలెం, బోయిపాలెం జంక్షన్ల వద్ద కొద్ది సంఖ్యలో మాత్రమే జనం కనిపించడంతో వారికి బస్సులో నుంచే జగన్‌ నమస్కారం చేశారు. ఆనందపురం జంక్షన్‌లో కూడా పెద్దగా జనం లేరు. పూలమార్కెట్‌ వద్ద కొంతమంది ఉండడంతో సీఎం జగన్‌ మళ్లీ బస్సుపైకి వారికి నమస్కారం చేసుకుంటూ ముందుకువెళ్లి తర్వాత బస్సులోకి వెళ్లి కూర్చుండిపోయారు. అనంతరం అక్కడకు కొద్దిదూరంలో ఉన్న చెన్నా కన్వెన్షన్‌ సెంటర్‌కు వెళ్లి వైసీపీ సోషల్‌ మీడియా విభాగం వలంటీర్లతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం భోజనం విరామం తర్వాత విజయన గరం బయలుదేరి వెళ్లారు.

Updated Date - Apr 24 , 2024 | 02:17 AM