Share News

ప్రయాణికుల పాట్లు

ABN , Publish Date - Apr 20 , 2024 | 02:02 AM

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్టుగా...అటు గుంటూరు నుంచి ఇటు శ్రీకాకుళం జిల్లా వరకూ ఎక్కడ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సభ నిర్వహించినా విశాఖపట్నం నుంచి బస్సులు తరలిస్తుండడం రివాజుగా మారింది.

ప్రయాణికుల పాట్లు

ఉమ్మడి జిల్లా నుంచి కాకినాడ సీఎం సభకు 230 బస్సులు

ముందస్తు సమాచారం నిల్‌

స్టాపుల్లో గంటలకొద్దీ ప్రయాణికుల నిరీక్షణ

అధికారుల తీరుపై మండిపాటు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి):

ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్టుగా...అటు గుంటూరు నుంచి ఇటు శ్రీకాకుళం జిల్లా వరకూ ఎక్కడ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సభ నిర్వహించినా విశాఖపట్నం నుంచి బస్సులు తరలిస్తుండడం రివాజుగా మారింది. ఈ పర్యాయం కాకినాడ జిల్లాలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల సభకు ఉమ్మడి జిల్లా నుంచి ఏకంగా 230 బస్సులు పంపారు. ఇందులో అత్యధికం నగరంలోని డిపోలకు చెందిన సిటీ బస్సులు ఉన్నాయి. ఇందుకు సంబంధించి ప్రజా రవాణా శాఖ ముందుగా ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో నగరంలో సిటీ బస్సులపై ఆధారపడే వారంతా శుక్రవారం నానా అగచాట్లు పడ్డారు.

ప్రధానంగా శివారు ప్రాంతాల నుంచి నగరానికి, నగరం నుంచి శివారు ప్రాంతాలకు సిటీ బస్సులపై వెళ్లే వారంతా బస్టాప్‌లలో గంటలకొద్దీ నిరీక్షించాల్సి వచ్చింది. ద్వారకా కాంప్లెక్స్‌ వెలుపల గల బస్టాప్‌లు, జాతీయ రహదారిపై గల పలు బస్టాప్‌లలో ప్రయాణికులు బస్సుల కోసం చూసి చూసి చివరకు ఆటోలకు ప్రయాణించారు. నెలవారీ పాస్‌లు తీసుకుని ఆటోలపై ప్రయాణించాల్సి వస్తోందని దువ్వాడకు చెందిన ఆడారి శ్రీనివాస్‌ మండిపడ్డారు. ఎండ తీవ్రతకు గంటకుపైగా బస్టాప్‌లో వేచి ఉండడంతో ఆరోగ్యపరంగా ఇబ్బందులు వస్తాయని ఆందోళన వ్యక్తంచేశారు. కాగా పెందుర్తి నుంచి ప్రతిరోజు ద్వారకానగర్‌లో బ్యాంకు కోచింగ్‌కు వస్తున్న జగన్‌సాయి అనే విద్యార్థి బస్సులు లేకపోవడంతో క్లాస్‌కు రెండు గంటల ఆలస్యం అయినట్టు చెప్పాడు. అది కూడా ఆటోలో రావడంతో ఒక్కరోజుకే రూ. 100 అయ్యిందన్నాడు. బస్సులు లేకపోవడంతో రూ.100 ఖర్చు పెట్టుకుని ఆటోలో రావాల్సి వచ్చిందని మధురవాడ నుంచి ప్రతిరోజు గేట్‌ కోచింగ్‌కు నగరానికి వచ్చే వరుణ్‌కుమార్‌ అనే యువకుడు వాపోయాడు. ఇప్పటికే పాస్‌ తీసుకున్న తనకు ఆటో చార్జీ అదనపు భారమన్నాడు. కాగా సీఎం సభకు కాకినాడ వెళ్లిన బస్సులు ఆదివారం తిరిగి వస్తాయని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు. అంటే శనివారం కూడా నగరంలో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు.

Updated Date - Apr 20 , 2024 | 02:02 AM