Share News

ఒకటే వార్డు... రెండు నియోజకవర్గాల్లో ఓట్లు

ABN , Publish Date - Apr 27 , 2024 | 01:49 AM

ఒకే వార్డు పరిధిలోని ఓటర్లు రెండు నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహించే అభ్యర్థులను ఎన్నుకోనున్నారు.

ఒకటే వార్డు... రెండు నియోజకవర్గాల్లో ఓట్లు

జీవీఎంసీ 98వ వార్డు ప్రత్యేకత

ఒకే వార్డు పరిధిలోని ఓటర్లు రెండు నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహించే అభ్యర్థులను ఎన్నుకోనున్నారు. ఈ ఘనత జీవీఎంసీ 98వ వార్డు వాసులకు దక్కింది. ఇక్కడి ఓటర్లలో కొంతమంది భీమిలి శాసనసభ అభ్యర్థి, విశాఖపట్నం లోక్‌సభ అభ్యర్థికి ఓట్లు వేయాల్సి ఉండగా, మరికొంతమంది ఓటర్లు పెందుర్తి శాసనసభ అభ్యర్థికి, అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థికి ఓట్లు వేయాల్సి ఉంటుంది. గతంలో జీవీఎంసీ 72వ వార్డుగా ఉండే సింహాచలం, దానికి ఆనుకుని ఉన్న గ్రామాలు పూర్తిగా పెందుర్తి నియోజకవర్గంలో ఉండేవి. అయితే వార్డుల విభజన నేపథ్యంలో ఇది 98వ వార్డుగా రూపాంతరం చెందింది. ఈ నేపథ్యంలో సింహాచలం గోశాల కూడలి నుంచి అడివివరం, లండగరువు, సింహగిరి గిరిజన గ్రామాలన్నీ భీమిలి నియోజకవర్గంలో విలీనమయ్యాయి. సాయినగర్‌, ప్రహ్లాదపురంలోని మోదీస్ట్రీట్‌, అప్పన్నపాలెం, సాయిమాధవనగర్‌ తదితర ప్రాంతాలు పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో 98వ వార్డుకు ఇద్దరు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ప్రాతినిథ్యం వహిస్తున్నట్టయింది. తాజా గణాంకాల ప్రకారం భీమునిపట్నం నియోజకవర్గంలో ఉన్న 98వ వార్డులో 16 పోలింగ్‌ బూత్‌లుండగా, 14,696 మంది భీమిలి ఎమ్మెల్యే, విశాఖ ఎంపీ అభ్యర్థులకు ఓట్లు వేస్తారు. అదే విధంగా ఐదో పోలింగ్‌ బూత్‌లలో సుమారు 7,290 మంది ఓటర్లు పెందుర్తి ఎమ్మెల్యే, అనకాపల్లి ఎంపీకి తమ ఓట్లు వేయాల్సి ఉంది. దాంతో వివిధ పార్టీలకు చెందిన నేతలు వార్డులోని కొంత భాగంలో భీమిలి శాసనసభ, విశాఖ ఎంపీ అభ్యర్థుల తరఫున, మరికొంతభాగంలో పెందుర్తి శాసనసభ, అనకాపల్లి ఎంపీ అభ్యర్థుల తరఫున రెండు విధాలుగా ప్రచారం చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

- సింహాచలం

Updated Date - Apr 27 , 2024 | 01:49 AM