Share News

పాకల్లో చదువులు

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:13 AM

ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్‌ స్కూళ్ల స్థాయిలో హంగులు కల్పిస్తున్నామని, కోట్లాది రూపాయలతో సౌకర్యం కల్పిస్తున్నట్టు వైసీపీ ప్రభుత్వం ఊదరగొడుతోంది. అయితే మన్యంలోని పలు గ్రామాల్లో గల పాఠశాలలను పరిశీలిస్తే ప్రభుత్వ ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకు పూర్తి భిన్నంగా ఉంది. గూడెంకొత్తవీధి మండలంలోని సాగులు, లక్కవరం గ్రామాల్లో ఆదివాసీ విద్యార్థులు పాకలో విద్యాభ్యాసం చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

పాకల్లో చదువులు
సాగులు గ్రామంలో చర్చి పాకలో కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాల

- వర్షమొస్తే పాఠశాలలకు సెలవులు

- ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్‌ స్కూళ్ల స్థాయి హంగులు కల్పిస్తున్నామని వైసీపీ గొప్పలు

- మన్యంలో పరిస్థితులు ఘోరం

- మండలంలోని సాగులు గ్రామంలో చర్చి పాకలో ఓ స్కూలు..

- లక్కవరం గ్రామంలో పాకలో కొనసాగుతున్న సర్కారు బడి

- గ్రామస్థులు పలుమార్లు విన్నవించుకున్నా పట్టించుకోని పాలకులు

గూడెంకొత్తవీధి, ఏప్రిల్‌ 25: ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్‌ స్కూళ్ల స్థాయిలో హంగులు కల్పిస్తున్నామని, కోట్లాది రూపాయలతో సౌకర్యం కల్పిస్తున్నట్టు వైసీపీ ప్రభుత్వం ఊదరగొడుతోంది. అయితే మన్యంలోని పలు గ్రామాల్లో గల పాఠశాలలను పరిశీలిస్తే ప్రభుత్వ ప్రకటనలకు, వాస్తవ పరిస్థితులకు పూర్తి భిన్నంగా ఉంది. గూడెంకొత్తవీధి మండలంలోని సాగులు, లక్కవరం గ్రామాల్లో ఆదివాసీ విద్యార్థులు పాకలో విద్యాభ్యాసం చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

వైసీపీ ప్రజాప్రతినిధులు పలు సభల్లో నాడు- నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు కార్పొరేట్‌ స్థాయి సదుపాయాలు కల్పిస్తున్నామంటూ ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారు. అయితే గిరిజన ప్రాంతంలో వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే పూర్తి భిన్నంగా వుంది. ఆదివాసీ విద్యార్థినీ, విద్యార్థులు కనీస సౌకర్యాలకు దూరంగా పాకల్లో అక్షరాలు దిద్దుతూ నానా అవస్థలు పడుతున్నారు. శాశ్వత పాఠశాల భవనాలు నిర్మించాలని ఐదేళ్లగా వైసీపీ పాలకులు, అధికారుల చుట్టూ ఆదివాసీలు కాళ్లు అరిగేలా తిరుగుతూ అర్జీలు ఇచ్చినా ఫలితం కనిపించలేదు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో గిరిజన గ్రామాలకు వచ్చిన ఎమ్మెల్యే భాగ్యలక్ష్మికి పాకల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితిని స్థానిక ఆదివాసీలు వివరించారు. శాశ్వత పాఠశాల భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చినప్పటికి ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. దీంతో స్థానిక ఆదివాసీలు వైసీపీ నాయకులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పాకలో లక్కవరం పాఠశాల..

లక్కవరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పాకలో కొనసాగుతున్నది. గ్రామంలో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యాభ్యాసం చేసే విద్యార్థులు 31 మంది ఉన్నారు. గ్రామంలో పాఠశాలకు శాశ్వత భవనం లేకపోవడంతో స్థానిక గిరిజనులు శ్రమదానంతో ఒక పాకను నిర్మించారు. ప్రస్తుతం ఈ పాకలోనే విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. వర్షం కురిస్తే పాక కారిపోతున్నది. దీంతో విద్యార్థులను గ్రామంలోని ఇళ్ల వరండాకు తీసుకు వెళ్లి ఉపాధ్యాయుడు విద్యాబోధన చేస్తున్నారు. భారీ వర్షం కురిస్తే పాఠశాలకు సెలవు ఇవ్వాల్సిందే. వేసవి, చలికాలంలోనూ విద్యార్థుల అవస్థలు వర్ణనాతీతం.

చర్చిలో సాగులు పాఠశాల..

సాగులు మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఓ చర్చిలో కొనసాగుతున్నది. గ్రామంలో శాశ్వత పాఠశాల భవనాన్ని నిర్మించలేదు. దీంతో గ్రామంలో గిరిజనులు నిర్మించుకున్న చర్చి(పూరిపాక)లో ఉపాధ్యాయిని పాఠశాల నిర్వహిస్తున్నది. గ్రామంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు విద్యాభ్యాసం చేసే విద్యార్థులు 32 మంది ఉన్నారు. విద్యార్థులను చర్చి వద్దకు తీసుకు వెళ్లి ఉపాధ్యాయిని విద్యాబోధన చేస్తున్నది. స్థానిక గిరిజనులు ఏ రోజైన ప్రార్థనలు చేసుకోవాల్సి వస్తే విద్యార్థులను గ్రామంలోని ఇళ్ల వరండాలో కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తున్నారు. పాఠశాల నిర్వహిస్తున్న చర్చి కూడా పూరిపాక కావడం వల్ల వర్షాలొస్తే పూర్తిగా కారిపోతున్నది.

మరుగుదొడ్లు శూన్యం

సాగులు, లక్కవరం ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. దీంతో విద్యార్థులు ఆరుబయటకు వెళ్లి మల, మూత్ర విసర్జన చేయాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యార్థులకు రక్షిత మంచినీటి సదుపాయం సైతం అందుబాటులో లేదు. లక్కవరం, సాగులు పాఠశాలల విద్యార్థులు కనీస సదుపాయాలకు దూరంగా విద్యాభ్యాసం చేయాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారు.

ఐదేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితం

లక్కవరం, సాగులు పాఠశాలలకు నాడు- నేడు పథకం ద్వారా శాశ్వత భవనాలు నిర్మించాలని విద్యాశాఖ అధికారులు పలు మార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. అయినప్పటికి ఇప్పటి వరకు ఈ పాఠశాలలు నాడు- నేడు పథకానికి ఎంపిక కాలేదు. పక్కా భవనం లేని పాఠశాలలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై స్థానిక ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Apr 26 , 2024 | 12:13 AM