Share News

పునాదుల్లోనే జగనన్న ఇళ్లు

ABN , Publish Date - Apr 24 , 2024 | 02:15 AM

మండలంలోని పైడివాడ అగ్రహారం గ్రామంలో రెండేళ్ల క్రితం సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించిన జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి.

పునాదుల్లోనే జగనన్న ఇళ్లు

సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి శంకుస్థాపన

ఏడాదిలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటన

ఇప్పటికీ 80 శాతం బేస్‌మెంట్‌ లెవెల్‌లోనే...

నత్తనడకన సాగుతున్న పనులు

కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోవడమే కారణం?

సబ్బవరం, ఏప్రిల్‌ 23:

మండలంలోని పైడివాడ అగ్రహారం గ్రామంలో రెండేళ్ల క్రితం సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రారంభించిన జగనన్న కాలనీలో ఇళ్ల నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏడాదిలో ఇళ్లు కట్టిస్తామన్న సీఎం హమీ నేటికీ నెరవేరలేదు. వేలల్లో మంజూరు చేయగా కనీసం ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తికాలేదు.

జగనన్న కాలనీల కోసం సబ్బవరం మండలం పైడివాడ, పైడివాడ అగ్రహారం, ఎరుకునాయడుపాలెం, నంగినారపాడు, అజనగిరి, గొల్లలపాలెం, అసకపల్లి, గాలిభీమవరం గ్రామాల్లో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములు సేకరించారు. వీఎంఆర్‌డీఏ అధికారులు ఎనిమిది గ్రామాల్లో 11 లేఅవుట్లు అభివృద్ధి చేసి 39,527 మంది లబ్ధిదారులకు సెంటు (48.4 గజాలు) చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించారు. పైడివాడ, పైడివాడ అగ్రహారం, ఎరుకునాయుడుపాలెం రెవెన్యూ పరిధిలోని 320.83 ఎకరాల్లో వీఎంఆర్‌డీఏ అధికారులు మెగా లేఅవుట్‌ ఏర్పాటు చేశారు. ఈ లేఅవుట్‌లో విశాఖపట్నం, గాజువాక, గోపాలపట్నం, మధురవాడ తదితర ప్రాంతాలకు చెందిన 9,717 మందికి సెంటు చొప్పున కేటాయించారు.

ఈ మేగా లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణానికి 2022 ఏప్రిల్‌ 28న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అట్టహాసంగా శంకుస్థాపన చేశారు. అదే వేదిక మీద లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. అనంతరం జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ ఏడాదిలోగా లబ్ధిదారులకు సకల సౌకర్యాలతో ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఈ లేఅవుట్‌లో ఇళ్ల నిర్మాణం పనులు రాక్రీట్‌ ఇన్‌ఫ్రా సంస్థ చేపట్టింది. అయితే రెండేళ్లుగా నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. సుమారు వెయ్యి ఇళ్లు స్లాబ్‌ దశను దాటి ప్లాస్టింగ్‌ పనులు జరుగుతుండగా, సుమారు వెయ్యి ఇళ్లు స్లాబ్‌ దశలో ఉన్నాయి. మిగిలిన ఏడు వేల ఇళ్లు ఇంకా పునాదుల్లోనే ఉన్నాయి. మండలంలోని మిగతా లేఅవుట్లలో కూడా నత్తనడకన ఇళ్ల నిర్మాణం పనులు సాగుతున్నాయి. బిల్లులు మంజూరు కాకపోవడం వల్లనే ఇళ్ల నిర్మాణం పనుల్లో జాప్యం జరుగుతుందని అక్కడ పని చేసే సిబ్బంది చెబుతున్నారు.

పరిహారం ప్లాట్లు అభివృద్ధి అంతంత మాత్రమే..

భూములు ఇచ్చిన రైతులకు పరిహారం కింద ఇచ్చే ప్లాట్లు సకల సౌకర్యాలతో కార్పొరేట్‌ స్థాయిలో అభివృద్ధి చేసి ఇస్తామని సీఎం అదే సభలో చెప్పారు. పరిహారం (ఆర్‌సీ) ప్లాట్లు రైతులకు అప్పగించిన తరువాతే ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు. కానీ ఇప్పటికీ పరిహారం ప్లాట్ల అభివృద్ధి పనులు సాగుతూ....నే ఉన్నాయి. అది కూడా రైతులు పలుమార్లు నిరసన వ్యక్తం చేసి, అనకాపల్లి కలెక్టర్‌కు వినతి పత్రాలు ఇచ్చారు. ఇటీవల పరిహారం ప్లాట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.

కాలనీపైకి వరద

ఇదిలావుండగా పైడివాడ అగ్రహారంలో జగనన్న కాలనీకి ఎగువనున్న కొండల పైనుంచి వచ్చే వరద నీరు పోయేందుకు మార్గం ఏర్పాటుచేయకుండా వీఎంఆర్‌డీఎ అధికారులు లేఅవుట్‌ వేసేశారు. దీంతో భారీవర్షాలు కురిసినప్పుడల్లా లేఅవుట్‌ ముంపునకు గురవుతోంది. ఈ నీరు రైతులకు పరిహారం కింద ఇచ్చిన ఆర్‌సీ ప్లాట్లను ముంచెత్తడంతో వారు గగ్గోలు పెట్టారు. కొంతమంది రైతులకు ఆర్‌సీ ప్లాట్లు గెడ్డలో ఇచ్చారు. ఇదే గెడ్డలోకి ఎగువన ఉన్న తుమ్మల చెరువు మిగులు నీరు కూడా వచ్చి ప్లాట్లను ముంచెత్తేది. దీనిపై రైతులంతా అనేకసార్లు నిరసనలు వ్యక్తం చేయడంపాటు అనకాపల్లి కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో తుమ్మల చెరువు నుంచి మిగులు నీరు పోయేందుకు సీసీ కాలువ నిర్మిస్తామని రైతులకు వీఎంఆర్‌డీఏ అధికారులు హామీ ఇచ్చారు. అలాగే కొండల పైనుంచి వరద నీరు లేఅవుట్‌లోకి రాకుండా ఆ వాలులో ట్రెంచ్‌లు ఏర్పాటుచేసి, ఆ నీటిని చెరువులకు మళ్లిస్తామని ఇరిగేషన్‌ శాఖ అధికారులు చెప్పారు.

Updated Date - Apr 24 , 2024 | 02:15 AM