Share News

పొట్టకూటికి వచ్చి ప్రాణాలు కోల్పోయారు

ABN , Publish Date - Apr 24 , 2024 | 02:03 AM

బతుకుతెరువు కోసం నగరానికి వచ్చిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.

పొట్టకూటికి వచ్చి ప్రాణాలు కోల్పోయారు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

మహారాణిపేట, ఏప్రిల్‌ 23:

బతుకుతెరువు కోసం నగరానికి వచ్చిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. వేర్వేరు జిల్లాల నుంచి వచ్చిన వీరు చిన్నచిన్న పనులు చేసుకుంటూ పొట్టుపోసుకుంటున్నారు. వీరిలో ఒకరికి తల్లిదండ్రులు లేరు. మరొకరికి తల్లి ఉన్నా ఆమె దూరంగా ఉంటున్నారు. అర్ధరాత్రి వేళ ద్విచక్ర వాహనంపై వెళుతూ అంబులెన్స్‌ను ఢీ కొనడంతో ఇద్దరూ మృతిచెందారు. మంగళవారం తెల్లవారుజామున సుమారు 3.00 గంటల సమయంలో చిత్రాలయ థియేటర్‌ సమీపంలో సూర్యాబాగ్‌ వద్ద జరిగిన ఈ విషాద ఘటనపై పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాకు చెందిన రామకృష్ణ (19)కు తల్లిదండ్రులు లేరు. సమీప బంధువులు విశాఖలో ఉండడంతో ఇక్కడకు వచ్చి చిన్నిచిన్న పనులు చేసుకుంటూ ఆర్‌టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో నిద్రిస్తూ ఉంటాడు. బొబ్బిలి ప్రాంతానికి చెందిన చందు (20) కూడా పనుల కోసం నగరానికి వచ్చాడు. ఇద్దరూ స్నేహంగా ఉండేవారు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున వీరిద్దరూ తమకు తెలిసిన యువకుడి ద్విచక్ర వాహనాన్ని తీసుకుని పోలీసు బ్యారెక్స్‌ వైపు నుంచి జీవీఎంసీ జోన్‌- 4 కార్యాలయం వైపు వస్తున్నారు. ఈ క్రమంలో లీలామహల్‌ థియేటర్‌ వైపు నుంచి జగదాంబ జంక్షన్‌ వైపు వస్తున్న 108 అంబులెన్స్‌ను బలంగా ఢీ కొన్నారు. దీంతో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. వీరిని హుటాహుటిన కేజీహెచ్‌కు తరలించారు. అయినా, పరిస్థితి విషమించి ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఆసుపత్రిలో మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 24 , 2024 | 07:39 AM