Share News

తుస్‌...

ABN , Publish Date - Apr 28 , 2024 | 02:12 AM

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శనివారం తన మేనిఫెస్టో విడుదల చేశారు.

తుస్‌...

  • తేలిపోయిన వైసీపీ మేనిఫెస్టో

  • అన్ని వర్గాల పెదవివిరుపు

  • వృద్ధుల పింఛన్‌ రూ.500 పెంచుతామన్న జగన్‌

  • అది కూడా 2028 జనవరి నుంచి రూ.250

  • 2029 జనవరి నుంచి మరో రూ.250...

  • ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచే రూ.4,000 ఇస్తామని ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు హామీ

  • మూడు నెలలకు 1,000 చొప్పున ఎరియర్స్‌తో జూలైలో రూ.7,000 ఇంటి వద్దే అందజేస్తామని ప్రకటన

  • అలాగే విశాఖ నుంచి స్టార్టప్‌లను వెళ్లగొట్టి...

  • ఇప్పుడు హబ్‌గా చేస్తామంటూ వైసీపీ అధినేత మాయమాటలు

  • ఈ ఐదేళ్లలో ఇచ్చింది...వచ్చే ఐదేళ్లలో ఇచ్చిందీ కలిపి దొంగ లెక్కలు

  • గెలిస్తే విశాఖే పరిపాలనా రాజధాని అంటూ మళ్లీ ఊరింపు మాటలు

విశాఖపట్నం, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి):

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి శనివారం తన మేనిఫెస్టో విడుదల చేశారు. అందులో అనేకం అవాస్తవాలే. గతంలో ఇచ్చిన హామీలనే అమలు చేయని ఆయన...వచ్చే ఐదేళ్లలో వాటిని కొనసాగిస్తూ మరింత లబ్ధి చేకూరుస్తానని మాయమాటలు చెప్పారు.

ముఖ్యంగా వృద్ధులకు నెల నెలా ఇచ్చే పింఛన్‌ విషయంలో ఆయన చేసిన ప్రకటనను చూసి లబ్ధిదారులంతా నవ్వుకుంటున్నారు. ప్రస్తుతం పింఛన్‌ నెలకు రూ.3 వేలు ఇస్తున్నారు. తాను మళ్లీ అధికారంలోకి వస్తే దానిని రూ.3,500 చేస్తానని జగన్‌ ప్రకటించారు. అయితే ఆ రూ.500 పెంచి జూలై నుంచి ఇస్తానని చెప్పలేదు. 2028 జనవరి నుంచి అంటే...నాలుగేళ్ల తరువాత రూ.250, 2029 జనవరి నుంచి మిగిలిన రూ.250 పెంచి ఇస్తామని వెల్లడించారు. కానీ ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇదే వృద్ధాప్య పింఛన్లను తాము అధికారంలోకి వస్తే నెలకు రూ.4 వేలు చొప్పున ఇస్తామని ఇంతకు ముందే హామీ ఇచ్చారు. అది కూడా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచే అమలు చేస్తామన్నారు. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించి వేయి రూపాయలు చొప్పున మొత్తం రూ.3 వేలు, జూలై నెల రూ.4 వేల పింఛన్‌ కలిపి మొత్తం రూ.7 వేలు జూలైలో వృద్ధులకు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. వెంటనే అందే ప్రతిఫలంవైపే అంతా మొగ్గు చూపుతుండగా జగన్‌ మాత్రం మళ్లీ ఎన్నికలలో కూడా లబ్ధి పొందడానికి అన్నట్టు మాట్లాడడాన్ని పెన్షన్‌దారులు విమర్శిస్తున్నారు.

రాజధానిపై మళ్లీ ఊరింపు మాటలు

విశాఖపట్నమే పరిపాలనా రాజధాని...ఇదిగో వస్తున్నా.. అదిగో వస్తున్నా అంటూ మూడేళ్ల నుంచి ఊరింపు మాటలు చెప్పి ఆచరణలో చూపలేకపోయిన జగన్మోహన్‌రెడ్డి ఈసారి గెలిస్తే విశాఖ నుంచే పరిపాలన సాగిస్తానని మేనిఫెస్టోలో ప్రకటించారు. మూడు రాజధానుల అంశం కోర్టు పరిధిలో ఉంది. అది తేలకుండా విశాఖ నుంచి రాజధాని పేరుతో పరిపాలన చేసే అవకాశం లేనే లేదు. క్యాంపు కార్యాలయం పేరుతో ఏదైనా చేయాలే తప్ప రాజధాని అంటే వీలు కాదు. అయినా సరే విశాఖతో పాటు ఉత్తరాంధ్ర ప్రజలను నమ్మించడానికి మోసం చేయడానికి మరో ప్రయత్నం చేశారు.

స్టార్టప్స్‌ హబ్‌ అంటూ ప్రగల్భాలు

విశాఖపట్నాన్ని స్టార్టప్‌ హబ్‌గా చేస్తామని జగన్మోహన్‌ రెడ్డి ప్రకటించారు. అయితే ఆయన అసలు విషయం ఏమిటంటే...2014-19 మధ్య టీడీపీ హయాంలోనే విశాఖను స్టార్టప్‌ హబ్‌గా తీర్చిదిద్దారు. రుషికొండలో స్టార్టప్‌ విలేజ్‌ ఏర్పాటుచేసి, అనేక మందికి అవకాశాలు కల్పించారు. వైసీపీ అఽధికారంలోకి వచ్చాక అక్కడి స్టార్టప్‌లను ఖాళీ చేయించి బయటకు గెంటేసింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఏడాది క్రితం నుంచి దిద్డుబాటు చర్యలు చేపట్టి మళ్లీ కొత్త స్టార్టప్‌లకు ఆశ్రయం ఇచ్చింది. కానీ వారికి ఎటువంటి సహకారం అందడం లేదు. ఈ ప్రభుత్వ మాటలను నమ్మే పరిస్థితి లేదని ఇంజనీరింగ్‌ విద్యార్థులు బల్లగుద్ది చెబుతున్నారు. ఇక్కడ అవకాశాలు లభించకే ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నామని వాపోతున్నారు.

భోగాపురం విమానాశ్రయం పూర్తి మరో ఏడాదిన్నర గడువు

భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్నప్పుడే శంకుస్థాపన చేశారు. వైసీపీ అధికారంలోకి రాగానే సహకారం అందించి ఉంటే ఈపాటికి అక్కడి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిచేవి. కానీ అలా జరగలేదు. జగన్‌ ఏడాది క్రితం మరోసారి దానికి శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇప్పుడేమో అక్కడ వాయువేగంతో పనులు జరుగుతున్నాయని, మరో 18 నెలల్లో పూర్తిచేస్తామని చెబుతున్నారు. ఆ గడువులోగా పూర్తవుతుందా?...అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రపంచస్థాయి క్రికెట్‌ స్టేడియం ఎన్నిసార్లు చెబుతారో...?

విశాఖపట్నంలో ఇప్పటికే ఒక ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం ఉంది. మరొకటి నిర్మించాలనే ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. భోగాపురం సమీపాన రూ.300 కోట్లతో మరో కొత్త స్టేడియం నిర్మిస్తామని వైసీపీ నేతలే ప్రకటించారు. ఇప్పుడు దానిని ‘ప్రపంచ స్థాయి స్టేడియం’ అంటూ కలరింగ్‌ ఇచ్చి మేనిఫెస్టోలో చేర్చారు.

భీమిలి ఫిషింగ్‌ హార్బర్‌ అడ్రస్‌ ఏదీ?

భీమిలిలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మిస్తామని వైసీపీ నాయకులు అఽధికారంలోకి వచ్చాక ప్రకటించారు. ఇప్పటివరకూ దానికి సంబంధించి ఎటువంటి పనులు చేపట్టలేదు. ఇప్పుడు మళ్లీ కొత్తగా పనులు చేపట్టిన ఫిషింగ్‌ హార్బర్లను పూర్తిచేస్తామని ప్రకటించారు. అసలు పనులు చేపట్టని భీమిలి హార్బర్‌ సముద్రంలో కలిసిపోయినట్టేనా?...అని మత్స్యకారులు ప్రశ్నిస్తున్నారు.

పదేళ్ల లబ్ధికి లెక్కలు

వైసీపీ అమలు చేస్తున్న ప్రతి పథకంలో 2019-2024 కాలంలో పొందిన లబ్ధి, వచ్చే ఐదేళ్లలో చేయబోయే సాయం కలిపి..మొత్తం పదేళ్లకు తాను ఎంత ఇవ్వబోతున్నదీ జగన్మోమోహన్‌రెడ్డి లెక్కలు వేసి వివరించారు. ఉదాహరణకు మత్స్యకారులకు భరోసా కింద ఏడాదికి రూ.10 వేలు చొప్పున గత నాలుగేళ్లలో రూ.40 వేలు ఇచ్చారు. ఈ ఏడాది ఇంకా ఇవ్వలేదు. రాబోయే ఐదేళ్లలో మరో రూ.50 వేలు ఇస్తామని, తద్వారా ఒక్కొక్కరికి రూ.లక్ష రూపాయలు అవుతుందని, లబ్ధి రెట్టింపు అవుతుందంటూ జగన్మోహన్‌రెడ్డి మాయమాటలు చెప్పారు. చేయూత, అమ్మఒడి అన్ని పథకాలకు ఇలాగే పదేళ్ల లెక్కలు వేసి రెట్టింపు చూపించారు.

స్టార్టప్స్‌ హబ్‌ అంటూ ప్రగల్భాలు

విశాఖపట్నాన్ని స్టార్టప్‌ హబ్‌గా చేస్తామని జగన్మోహన్‌ రెడ్డి ప్రకటించారు. అయితే ఆయన అసలు విషయం ఏమిటంటే...2014-19 మధ్య టీడీపీ హయాంలోనే విశాఖను స్టార్టప్‌ హబ్‌గా తీర్చిదిద్దారు. రుషికొండలో స్టార్టప్‌ విలేజ్‌ ఏర్పాటుచేసి, అనేక మందికి అవకాశాలు కల్పించారు. వైసీపీ అఽధికారంలోకి వచ్చాక అక్కడి స్టార్టప్‌లను ఖాళీ చేయించి బయటకు గెంటేసింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో ఏడాది క్రితం నుంచి దిద్డుబాటు చర్యలు చేపట్టి మళ్లీ కొత్త స్టార్టప్‌లకు ఆశ్రయం ఇచ్చింది. కానీ వారికి ఎటువంటి సహకారం అందడం లేదు. ఈ ప్రభుత్వ మాటలను నమ్మే పరిస్థితి లేదని ఇంజనీరింగ్‌ విద్యార్థులు బల్లగుద్ది చెబుతున్నారు. ఇక్కడ అవకాశాలు లభించకే ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నామని వాపోతున్నారు.

ఆటోవాలాల అసంతృప్తి

‘వాహనమిత్ర’ లబ్ధిదారులను తగ్గించి, ప్రమాద బీమా అంటూ ఆశ చూపుతారా?

విశాఖపట్నం, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి):

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం విడుదల చేసిన మేనిఫెస్టోలో ఆటో/మాక్సీకాబ్‌, టాక్సీ, టిప్పర్‌/లారీ డ్రైవర్లకు రూ.పది లక్షలు ప్రమాద బీమా అమలు చేస్తామని ప్రకటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాహనమిత్ర పేరుతో రూ.పది వేలు చొప్పున ఇచ్చిన సీఎం జగన్‌ ఏటేటా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించుకుంటూ వచ్చారని, ఇప్పుడు కొత్తగా ప్రమాద బీమా పేరుతో తమ ఓట్లకు గాలం వేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆటో/టాక్సీ డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. వాహనమిత్రలో భాగంగా జిల్లాలో 2020-21లో 38,001 మందికి వాహనమిత్ర అందజేయగా 2022-23 నాటికి అర్హుల సంఖ్య 20,711కి తగ్గించేయడం ఆటోవాలాలపై ప్రభుత్వానికి ఉన్న ప్రేమను తెలియజేస్తోందన్నారు. రకరకాల షరతులు, కారణాలతో ‘వాహనమిత్ర’ పథకానికి అర్హులను తగ్గించుకుంటూ వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రమాద బీమాను మేనిఫెస్టోలో చేర్చడం వల్ల కొత్తగా తమకు ఒనగూరేదేమీ లేదని ఆటో/టాక్సీవాలాలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.

చంద్రబాబునే గెలిపించుకుంటాం

బి.సత్యవతి, గాజువాక

200 రూపాయలు ఉన్న పింఛన్‌ను రెండు వేలకు పెంచిన చంద్రబాబు నా పాలిట దేవుడు. జగన్‌ మూడు వేలు చేస్తానని మాకు మాయమాటలు చెప్పాడు. పదవి ఎక్కిన తరువాత ఐదు సంవత్సరాలకు మూడు వేలు చేశాడు. మా బాబు నాలుగు వేలు ఇస్తానని చెప్పాడు. జగన్‌ 3500 ఇస్తానంటున్నాడు. అది కూడా ఇప్పుడు కాదంటా....మా బాబు అయితే నాలుగు వేలు వెంటనే ఇస్తానన్నాడు. పింఛను పెంచి మాలాంటి వాళ్లకు తోడుగా ఉన్న చంద్రబాబును గెలిపించుకుంటాం.

రూ.4 వేలు అయితే సంతోషంగా బతుకుతాను

పి.గంగమ్మ, గాజువాక

నాకు నా అన్నవారు ఎవరూ లేరు. నాకు నాలుగు వేలు పింఛన్‌ ఇస్తే సంతోషంగా బతికేస్తాను. చంద్రబాబు దయ వల్ల నాకు అప్పుడు రెండు వేలు పింఛన్‌ వచ్చింది. జగన్‌ మూడు వేలు అని చెప్పి చివర్లో ఇచ్చాడు. చంద్రబాబు అయితే పింఛన్‌తో పాటు ప్రతి పండగకు మాకు తినడానికి సామగ్రి ఇస్తాడు. మా బాబు చల్లగా ఉండాలి. పింఛన్‌ వస్తేనే మాకు బతుకు...లేదంటే లేదు.

పెన్షన్‌దారులకు బాబు వస్తేనే మేలు

దుండు నరేశ్‌, గోపాలపట్నం

జగన్మోహన్‌రెడ్డి హామీలు నమ్మలేము. గతంలో పింఛన్‌ రూ.3 వేలు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ నెరవేర్చడానికి ఐదేళ్ల సమయం పట్టింది. ఏడాదికొకసారి రూ.250 పెంచుతామని అప్పట్లో చెప్పలేదు. ఇప్పుడు కూడా అదే హామీ ఇస్తున్నా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. చంద్రబాబు హామీ ఇచ్చారంటే చేసి తీరుతారు. గతంలో హామీ ఇచ్చిన చంద్రబాబు ఒకేసారి పది రెట్లు పింఛన్‌ను పెంచారు. చంద్రబాబు వస్తే పింఛనుదారులకు మేలు జరుగుతుంది.

జగన్‌ హామీలను ప్రజలు నమ్మరు

బేరా కృష్ణారావు, గోపాలపట్నం

నమ్మశక్యంకాని హామీలు ఇచ్చి గతంలో జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఫింఛను విషయంలో కూడా అదే చేశారు. రూ.3 వేలు చేస్తామని చెబితే అంతా ఎంతో ఆశగా ఓటేశాం. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత దశలవారీగా పింఛన్‌ పెంచారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే ఒకేసారి రూ.4 వేలు చేస్తామని చెబుతున్నారు. చంద్రబాబునాయుడుపై విశ్వాసం ఉంది. జగన్‌ హామీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరు.

Updated Date - Apr 28 , 2024 | 02:12 AM