Share News

పేదోడి పొట్టకొట్టిన వైసీపీ

ABN , Publish Date - Apr 26 , 2024 | 12:16 AM

నిరుపేదల కడుపు నింపేందుకు టీడీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్లపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కక్ష గట్టింది. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని మూసివేయించింది. రూ.5కు అన్నం పెట్టిన క్యాంటీన్లను నిర్దాక్షిణ్యంగా మూసివేయించడం దారుణమంటూ వైసీపీ ప్రభుత్వంపై పేదలు, కూలీలు ఆగ్రహంతో ఉన్నారు.

పేదోడి పొట్టకొట్టిన వైసీపీ
నర్సీపట్నం అన్న క్యాంటీన్‌

జీవీఎంసీ పరిధిలో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్లు 25

ఉదయం టిఫిన్‌ రూ.5

మధ్యాహ్నం భోజనం రూ.5

మధ్యాహ్నం భోజనం రూ.5

ప్రతీరోజూ అల్పాహారం చేసినవారి సంఖ్య 10 వేలు

ప్రతీరోజూ మధ్యాహ్నం భోజనం చేసినవారి సంఖ్య 15వేల మంది

ప్రతీరోజూ రాత్రి భోజనం చేసేవారి సంఖ్య 10వేలు

------

- తెలుగుదేశం హయాంలో

పట్టణ ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు ప్రారంభం

- జీవీఎంసీ పరిధిలో 25 చోట్ల ఏర్పాటు

- రూ.5కే అల్పాహారం..

మధ్యాహ్నం/రాత్రి భోజనం రూ.5కే

- నాణ్యమైన ఆహారం అందించడంతో క్యాంటీన్లకు విశేష ఆదరణ

- వైసీపీ అధికారంలోకి రాగానే క్యాంటీన్ల మూసివేత

- పేదలు, కూలీల్లో ఆగ్రహం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నిరుపేదల కడుపు నింపేందుకు టీడీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్లపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కక్ష గట్టింది. అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని మూసివేయించింది. రూ.5కు అన్నం పెట్టిన క్యాంటీన్లను నిర్దాక్షిణ్యంగా మూసివేయించడం దారుణమంటూ వైసీపీ ప్రభుత్వంపై పేదలు, కూలీలు ఆగ్రహంతో ఉన్నారు.

పట్టణ ప్రాంతాల్లోని నిరుపేదలు, భవన నిర్మాణ కూలీలు, తదితరులకు కేవలం రూ.5కు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం 2018 జూన్‌ 11న రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లను ప్రారంభించింది. అన్న క్యాంటీన్‌లకు ఆహారాన్ని సరఫరా చేసే బాధ్యతను అక్షయపాత్ర స్వచ్ఛంద సంస్థకు అప్పగించింది. అన్న క్యాంటీన్‌లో ప్రతిరోజూ ఉదయం ఏదో ఒక అల్పాహారాన్ని రూ.ఐదుకే అందజేసేవారు. అలాగే మధ్యాహ్నం, రాత్రి పూట కూడా నాణ్యమైన భోజనాన్ని రూ.5కే పెట్టేవారు. అనతికాలంలోనే అన్న క్యాంటీన్లకు విశేషమైన ఆదరణ రావడంతో దశల వారీగా జీవీఎంసీ పరిధిలో 25 చోట్ల అన్న క్యాంటీన్లను ఏర్పాటుచేశారు. వీటన్నింటికీ పక్కా భవనాలు కట్టించి భోజనం చేసేవారికి సౌకర్యంగా ఉండేందుకు కుర్చీలు, టేబుళ్లు వంటి సదుపాయాలు కల్పించారు. భవన నిర్మాణ కూలీలు, రిక్షావాలాలు, ఆటోడ్రైవర్లు, నిరుపేదలు, ఉద్యోగ శిక్షణ కోసం నగరంలో ఉండే పేద విద్యార్థులు క్యాంటీన్లలో ఆకలి తీర్చుకునేవారు. విశాఖ పరిధిలో ప్రతిరోజూ సగటున పది వేల మంది అల్పాహారం, 15 వేల మంది మధ్యాహ్నం భోజనం, పది వేల మంది రాత్రి భోజనం చేసేవారు. కూలీలు, చిరుద్యోగులు, అల్పాదాయ వర్గాలకు తక్కువ ధరకే నాణ్యమైన ఆహారం సమకూరడంతో ఖర్చులు తగ్గి ఆర్థికంగా కొంత వెసులుబాటు కలిగేది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో అన్న క్యాంటీన్లను మూసివేయించింది. అన్నక్యాంటీన్ల పేరు మార్చాలని మొదట్లో వైసీపీ నేతలు భావించినా, వాటిపై టీడీపీ ముద్ర తొలగిపోదనే ఉద్దేశంతో శాశ్వతంగా మూసివేయించారనే విమర్శలు వెల్లువెత్తాయి. అన్న క్యాంటీన్లకు ప్రత్యామ్నాయంగా అంతకంటే మెరుగ్గా ఉండేలా ‘ఆహా క్యాంటీన్ల’ను ఏర్పాటుచేస్తామని వైసీపీ నేతలు ప్రకటించినా, ఐదేళ్లయినా కార్యరూపం దాల్చలేదు. అయితే తమకు నామమాత్రపు ధరకు నాణ్యమైన ఆహారాన్ని అందించిన అన్న క్యాంటీన్లను రద్దు చేసి తమ కడుపు కొట్టారంటూ వైసీపీ ప్రభుత్వాన్ని నిరుపేదలు ఇప్పటికీ తూర్పారబడుతుంటారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే మూత

నర్సీపట్నం: వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే అన్న క్యాంటీన్లు మూత పడ్డాయి. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రి ఎదురుగా ఉన్న అన్న క్యాంటీన్‌ భవనం ప్రస్తుతం నిరుపయోగంగా ఉంది. భవనంలో చెత్తాచెదారం పేరుకుపోయింది. చాలా సామగ్రి అపహరణకు గురైంది. గతంలో ఇక్కడ ప్రతీ రోజు అల్పాహారం 350 మందికి, మధ్యాహ్నం భోజనం 350, రాత్రి భోజనం 250 మందికి వడ్డించేవారు. అన్న క్యాంటీన్‌ ప్రారంభం నాటి నుంచి వైసీపీ ప్రభుత్వం మూసేసే వరకు సెలవు రోజులు పోను అల్పాహారం 54,969 మందికి, మధ్యాహ్నం భోజనం 59,575 మందికి, రాత్రి భోజనం 34,520 మందికి వడ్డించారు.

అనకాపల్లిలో..

అనకాపల్లి టౌన్‌: టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018 జూలై 11వ తేదీన అనకాపల్లి పట్టణంలోని ఎన్టీఆర్‌ వైద్యాలయం ఆవరణ, రైల్వేస్టేషన్‌ ప్రధాన మార్గం వద్ద అన్న క్యాంటీన్‌లను ప్రారంభించారు. ఉదయం అల్ఫాహారం, మధ్యాహ్నం, రాత్రి ఐదేసి రూపాయల చొప్పున ఆహారం అందుబాటులో ఉండేది. ఇక్కడ ఉదయం 300 నుంచి 350 మంది, మధ్యాహ్నం 500 నుంచి 600 మంది, రాత్రి వేళ 300 నుంచి 400 మంది భోజనాలు చేసేవారు. అలాగే రైల్వేస్టేషన్‌ వద్ద అన్న క్యాంటీన్‌లో రిక్షా కార్మికులు, దూర ప్రాంతాలకు కూలీ పనులకు వెళ్లే వ్యవసాయ కూలీలు భోజనాలు చేసేవారు. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2019 ఆగస్టులో అన్న క్యాంటీన్లు మూసివేశారు.

------

అన్న క్యాంటీన్లు మూసివేయడం సరికాదు (ఫొటో- 24ఎకెపిటౌన్‌-7)

అన్న క్యాంటీన్లు మూసివేయడం వల్ల చాలామంది పేదలు, రిక్షా కార్మికులు, కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఐదు రూపాయలకే రుచికరమైన భోజనం అప్పట్లో అందుబాటులో ఉండేది. క్యాంటీన్లు మూసివేసిన తరువాత వివిధ పనులపై పట్టణానికి వచ్చే వారు, కార్మికవర్గం, హోటల్‌లో భోజనం చేయాలంటే రూ.70 నుంచి 80లు ఖర్చు చేయాల్సి వస్తుంది. రిక్షా కార్మికులు, చిల్లర వర్తకులకు భోజనం భారంగా మారింది. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరగడంతో కడుపు నింపుకోవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

- ఎం. వీరభద్రరావు, బాలాజీరావుపేట, అనకాపల్లి

Updated Date - Apr 26 , 2024 | 12:16 AM