Share News

చంద్రబాబు మాట.. మారిన ఓటరు బాట

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:31 PM

ఎస్‌.కోట నియోజకవర్గ పరిధిలో నిర్మించాల్సిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని వేరే చోటకు వైసీపీ ప్రభుత్వం తరలించింది. దీన్ని స్థానిక శాసన సభ్యుడు అడ్డుకోలేదు. పార్లమెంటు స్థానాల వారీగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం చెప్పింది.

చంద్రబాబు మాట.. మారిన ఓటరు బాట

చంద్రబాబు మాట.. మారిన ఓటరు బాట

చర్చనీయాంశంగా టీడీపీ అధినేత ప్రసంగం

గిరిజన విశ్వవిద్యాలయం తరలింపు, జిల్లాలోనే ఎస్‌.కోటను ఉంచేయడంపై చర్చ

శృంగవరపుకోట, ఏప్రిల్‌ 25:

‘ఎస్‌.కోట నియోజకవర్గ పరిధిలో నిర్మించాల్సిన గిరిజన విశ్వవిద్యాలయాన్ని వేరే చోటకు వైసీపీ ప్రభుత్వం తరలించింది. దీన్ని స్థానిక శాసన సభ్యుడు అడ్డుకోలేదు. పార్లమెంటు స్థానాల వారీగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం చెప్పింది. విశాఖ పార్లమెంట్‌ పరిధిలో వున్న శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విజయనగరం జిల్లాలోనే ఉంచేశారు. విశాఖ జిల్లాలో కలపాలని ఇక్కడి ప్రజలు గట్టిగా అడిగినా పట్టించుకోలేదు. స్థానిక ఎమ్మెల్యే నోరెత్తలేదు. ఈ ప్రాంత ప్రజలకు జిల్లా విజయనగరమే అయినా వాణిజ్య, వ్యాపార అవసరాలకు విశాఖ జిల్లాపై ఆధారపడతారు. టీడీపీ అధికారంలోకి రాగానే విశాఖ జిల్లాలో కలిపేస్తాం. అభివృద్ధి చెందిన జిల్లాను తలదన్నెలా శృంగవరపుకోటను అభివృద్ది చేస్తాం. వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్‌.కోటను జిల్లాలో వుంచి ఈ ప్రాంత ప్రజలకు అన్యాయం చేశారు.’

- ఎస్‌.కోట ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాటలివి

చంద్రబాబు వ్యాఖ్యలు శృంగవరపుకోట నియోజకవర్గ ఓటర్లను ఆలోచనలో పడేశాయి. ఏ ఇద్దరు ఓ చోట కలిసినా చంద్రబాబు ప్రసంగాన్ని ప్రస్తావిస్తున్నారు. గిరిజన విశ్వ విద్యాలయం తరలింపు, ఎస్‌.కోటను విశాఖ జిల్లాలో కలపకపోవడం ఈప్రాంత ప్రజలకు నష్టమేనన్న భావన ప్రతి ఒక్కరి నుంచి వ్యక్తమవుతోంది. రాష్ట్ర విభజనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విభజిత ఆంధ్రప్రదేశ్‌కు గిరిజన విశ్వ విద్యాలయాన్ని మంజూరు చేసింది. దీన్ని అప్పటి ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారాచంద్రబాబు నాయుడు జిల్లాకు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు అనువైన స్థలం సేకరించాలని అప్పటి కలెక్టర్‌, జిల్లాకు చెందిన శాసన సభ్యులకు సూచించారు. ఈమేరకు కొత్తవలస మండలం , రెల్లి గ్రామ పరిధిలో ఖాళీగా వున్న ప్రభుత్వ భూమిని అప్పటి ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి చూపించారు. ఈ భూమిని పలుమార్లు పరిశీలించిన అధికారులు గిరిజన విశ్వవిద్యాలయానికి అనువుగా ఉందని నిర్ధారించారు. విశాఖ మహానగరానికి ఆనుకుని వుండడం, ఎయిర్‌పోర్టుకు దగ్గరగా వుండడం, రోడ్డు మార్గం కలిగి వుండడం, అరకు పర్యాటక ప్రాంతం దగ్గరగా వుండడం తోపాటు ఉమ్మడి విశాఖ జిల్లా, విజయనగరం జిల్లాలోని గిరిజన ప్రాంతాలకు ఇక్కడైతే బాగుంటుందని భావించారు. ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల విశ్వవిద్యాలయ నిర్మాణానికి స్థల పరిశీలన చేసినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కొత్తవలస మండలం రెల్లి స్థలంపైనే మెగ్గు చూపారు. గిరిజన విశ్వ విద్యాలయం నిర్మాణానికి స్థల సేకరణ బాధ్యతను అప్పటి ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. గిరిజన రైతుల సహకారంతో ఆమె సుమారు 500 ఎకరాలకు పైబడి స్థలాన్ని అందించారు. భూమి పూజ చేసిన ప్రభుత్వం ప్రహరీ కూడా నిర్మించింది. భవన నిర్మాణాలకు పూనుకున్న సమయంలో ప్రభుత్వం మారింది. వైసీపీ అధికారం చేపట్టాక మొత్తం తారుమారైంది. టీడీపీకు పేరొస్తుందన్న భావనతో ఈ ప్రభుత్వం దత్తిరాజేరు, మెంటాడ మండలా సరిహద్దులకు తరలించారు. ఈ ఐదేళ్లలో భూసేకరణతోనే సరిపెట్టారు.

ఇదిలా ఉండగా జిల్లాల పునర్విభజనలో శృంగవరపుకోటను విశాఖ జిల్లాలో కలిపేస్తారని అంతా ఆశించారు. పార్లమెంటు స్థానాలను బట్టి జిల్లాలను ఏర్పాటు చేస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం ప్రకటించడం, ఈ నియోజకవర్గం విశాఖ పార్లమెంట్‌ పరిధిలో వుండడంతో విశాఖ జిల్లాలో చేరడం ఖాయమనుకున్నారు. కానీ కొత్తజిల్లాల ఏర్పాటులో అంతా తలకిందులైంది. దీన్ని జిల్లాలోనే ఉంచేశారు. స్థానికులు విశాఖ జిల్లాలో కలిపేయాలని డిమాండ్‌ చేసినా వినిపించుకోలేదు.

సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పుడు ఈ రెండు ఆంశాలు అధికార వైసీపీకి ఊపిరి ఆడకుండా చేస్తున్నాయి. సుదీర్ఘకాలం పాటు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా అనుభవం వున్న టీడీపీ అధినేత నారాచంద్రబాబు ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో ఈ అంశాలు లేవనేత్తడంతో స్థానికంగా చర్చకు దారితీసింది. వైసీపీతో ఈ ప్రాంతానికి జరిగిన నష్టాన్ని గుర్తుచేసుకుంటున్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:31 PM