Share News

ఉపాధికి దూరం చేశారు.. పొట్టకొట్టారు

ABN , Publish Date - Apr 27 , 2024 | 11:14 PM

ఉపాధి కల్పనలో భవన నిర్మాణ రంగం ఎంతో కీలకం. అయితే వైసీపీ అధికారంలోకి రాగానే ఈ రంగం కుదేలైంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక కొత్త పాలసీ విధానం నిర్మాణాలపై తీవ్ర ప్రభావం చూపింది.

ఉపాధికి దూరం చేశారు..  పొట్టకొట్టారు

మందగించిన నిర్మాణాలు.. పనుల్లేక విలవిల్లాడిన భవన నిర్మాణ కార్మికులు

దూర ప్రాంతాలకు వలసలు

సంక్షేమ బోర్డు నిధుల దారి మళ్లించిన వైసీపీ

ఆందోళనలు చేపట్టినా స్పందించని సర్కారు

(పార్వతీపురం- ఆంధ్రజ్యోతి/భామిని)

ఉపాధి కల్పనలో భవన నిర్మాణ రంగం ఎంతో కీలకం. అయితే వైసీపీ అధికారంలోకి రాగానే ఈ రంగం కుదేలైంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక కొత్త పాలసీ విధానం నిర్మాణాలపై తీవ్ర ప్రభావం చూపింది. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఇసుక ధర అనేక రెట్లు పెరిగిపోయింది. కొన్నిచోట్ల సామాన్య, మఽధ్యతరగతి వర్గాలకు ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో నిర్మాణాలు మందగించాయి. భవన నిర్మాణ కార్మికులు, అనుబంధ కూలీలు ఉపాధికి దూరమయ్యారు. ఇదే సమయంలో ఎంతో మంది కార్మికులు జిల్లా నుంచి వలసబాట పట్టారు. ఏదేమైనా టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల పాటు కళకళలాడిన నిర్మాణ రంగం.. వైసీపీ అధికారంలోకి రాగానే కుప్పకూలింది.

ఇదీ పరిస్థితి..

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక ఉచితం. ఈ విధానం నిర్మాణ రంగానికి ఎంతో ఊతమిచ్చింది. అప్పట్లో లోడింగ్‌, రవాణా, ఖర్చులతో ఇసుక ట్రాక్టర్‌ రూ.2వేలకు లభించేంది. 20 టన్నుల ఇసుక లారీ రూ.10వేలు ఉండేది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక సీన్‌ మారింది. ఈ ధర అనేక రెట్లు పెరిగింది. ప్రస్తుతం ట్రాక్టర్‌ ఇసుక ధర రూ.4వేల పైమాటే. వాస్తవంగా 2019, సెప్టెంబరులో వైసీపీ సర్కారు ఇసుక పాలసీ కొత్త విధానం తెచ్చింది. దీనివల్ల ఇసుక ధర తగ్గలేదు. అక్రమ తవ్వకాలు, రవాణా ఆగలేదు. మరోవైపు కరోనా మహమ్మారి భవన నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ఇసుక కొత్త పాలసీని తీసుకురావడంలో వైసీపీ ప్రభుత్వం కాలయాపన చేయగా..ఆ పార్టీ నేతలకు అదే కలిసొచ్చింది. అప్పటికే కొనసాగుతున్న నిర్మాణాలకు ఇసుక కరువవగా.. దానిని కొందరు వైసీపీ నేతలు సొమ్ము చేసుకున్నారు. మొత్తంగా వారికి కొత్త ఇసుక విధానం బంగారంగా మారింది. నిర్మాణాలు చేపట్టేవారికి మాత్రం జేబులు గుల్ల చేసింది. వైసీపీ సర్కారు తీరుతో స్థానికంగా ఉపాధి దొరక్క ఎంతోమంది వలసబాట పట్టారు. ఇళ్లకు తాళాలు వేసుకుని కుటుంబాలతో సహా పొరుగు రాష్ర్టాలు, మహా నగరాలకు తరలివెళ్లారు.

ఉమ్మడి జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు 1,34,931 మంది ఉన్నారు. వారిలో తాపీమేస్ర్తి, కూలీలతో పాటు రాడ్‌ బెండింగ్‌, సెంట్రింగ్‌, ఎలక్ర్టీషియన్‌, ప్లంబర్‌, టైల్స్‌ మేస్ర్తి ,పెయింటర్‌ తదితరులు ఉన్నారు. అయితే వైసీపీ వచ్చాక వారికి ఉపాధి కరువైంది. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలైన ఉచిత ఇసుక విధానంపై తీవ్ర విమర్శలు చేసిన జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పాలసీ విధానం తీసుకొచ్చి తొలి ఆరు నెలల పాటు ఎక్కడా ఇసుక దొరక్కుండా చేశారు. మరోవైపు కరోనా మహమ్మారి భవన నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ సమయంలోనూ వైసీపీ సర్కారు భవన నిర్మాణ కార్మికులను ఆదుకోలేదు.

సంక్షేమ బోర్డు నిధుల దారి మళ్లింపు

గత టీడీపీ ప్రభుత్వం భవన కార్మికుల సంక్షేమానికి కేటాయించిన రూ.1200కోట్లను వైసీపీ సర్కారు రద్దు చేసింది. జీవో నెంబర్‌ 12, 14 అమలు చేసి సంక్షేమ పథకాలను కార్మికులకు అందకుండా చేసింది. కార్మికుల బోర్డు నిధులను సైతం వైసీపీ సర్కారు దారి మళ్లించింది. దీంతో... మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు పరిహారం కూడా అందడం లేదు.

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో..

వాస్తవంగా టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ బోర్డు నిధుల నుంచి కార్మికుల ఆపద సమయాల్లో ఎంతో కొంత చెల్లించే వారు. కార్మికుల కుటుంబాల్లో ఆడపిల్లల రెండు కాన్పులకు రూ.30 వేల చొప్పన ఆర్థికసాయం చేసేవారు. ఆడపిల్లల వివాహాలకు రూ.20 వేలు ఇచ్చేవారు. కార్మికుడు ప్రమాదశాత్తూ గాయపడితే చికిత్స అందిస్తూ రూ.4,500 అందించేవారు. సహజ మరణమైతే ఆ కుటుంబానికి కార్మిక సంఘం నిధులతో రూ.80 వేలు అందించే వారు. ప్రమాదవశాత్తూ మరణిస్తే.. రూ.5 లక్షలు ఆర్థికసాయంగా ఇచ్చేవారు. చంద్రన్న కిట్‌ల పేరిట మేస్ర్తీలకు తాపీ, గజం, సుత్తి, శానాం, గుండిదారం, లైన్‌తాడు తదుపరి సామగ్రి పంపిణీ చేసేవారు. అయితే వైసీపీ సర్కారు వాటికి మంగళం పాడేసింది. పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే ఆ నిధులను తన సొంతానికి వాడుకుంది. దీనిపై అప్పట్లో జిల్లాలో భవన నిర్మాణ కార్మికులు, సంఘ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టినా సర్కారు స్పందించలేదు.

నింగినంటిన మెటీరియల్‌ ధరలు

వైసీపీ సర్కారు పాలనలో గృహ నిర్మాణ మెటీరియల్‌ ధరలన్నీ నింగినంటాయి. ఇసుక, ఇటుక, సిమెంట్‌, పిక్కరాయి ఐరన్‌ తదితర వాటి ధరలు అమాంతం పెరిగాయి. గతంలో 2 వేల ఇటుక ధర రూ.4 వేల వరకు ఉండేది. అయితే వైసీపీ పాలనలో అదే ఇటుకకు రూ. 8 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లించాల్సి వస్తోంది. ఇటుక బట్టీలకు సంబంధించి దగ్గరలో ఉన్న మట్టి తెచ్చుకునేందుకు గతంలో ఎటువంటి సొమ్ము చెల్లించనవసరం ఉండేది కాదు. కానీ వైసీపీ వచ్చాక నగదు చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఇటుక ధర రెట్టింపయ్యింది. సిమెంట్‌ విషయానికొస్తే.. గత టీడీపీ ప్రభుత్వంలో బస్తా ధర రూ.250 నుంచి రూ.300 వరకు ఉండేది. వైసీపీ వచ్చాక అదే సిమెంట్‌ బస్తాను రూ.350 నుంచి రూ.380 వరకు విక్రయిస్తున్నారు. గతంలో స్లాబ్‌ కంకర ట్రాక్టర్‌ ధర రూ.3 వేలు ఉండగా.. ఇప్పుడు దాని ధర రూ.5వేలకు చేరింది. ఇలా మెటీరియల్‌ ధరలన్నీ పెరిగిపోవడంతో సామాన్య, మధ్య తరగతి వర్గీయులు నిర్మాణాలు చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. కొంతమంది తమ నిర్మాణాలను వాయిదా వేసుకోవడంతో భవననిర్మాణ కార్మికులు పనులకు దూరమయ్యారు.

జిల్లాలో రీచ్‌లు ఇలా..

జిల్లాలో అనుమతులు పొందినఇసుక రీచ్‌లు 30 వరకూ ఉన్నాయి. అయితే ఆయా రీచ్‌ల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా కొంతమంది ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేపట్టారు. అక్రమంగా ఇతర ప్రాంతాలకు రవాణా చేశారు. కొమరాడ మండలం కోనేరు రామభద్రపురం వద్ద రీచ్‌లో పరిధికి మించి తవ్వకాలు చేపట్టడంతో అధికారులు దాని అనుమతులు రద్దు చేశారు. కానీ ఉమ్మడి జిల్లాకు చెందిన ఒక వైసీపీ నేత పేరు చెప్పుకొని ఆ ప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేపట్టారు. కొమరాడ మండలంలో దుగ్గి, శిఖవరం, కోటిపాం, గంగరాయవలస ప్రాంతాల్లో మాత్రమే ఇసుక రీచ్‌లను అధికారంగా గుర్తించారు. అయితే అనధికారికంగా చాలాచోట్ల తవ్వకాలు జరిపారు. సమీప తోటల్లో ఇసుకను డంప్‌ చేసి రాత్రి వేళల్లో ఇతర ప్రాంతాలకు తరలించి కొంతమంది రెండు చేతులా సంపాదించారు. పార్వతీపురం నియోజకవర్గంలో సీతానగరం మండలం పానుకుపేట, పెదంకలం బూర్జ, పెదబోగలి, లక్ష్మీపురం, చినబోగిలి ప్రాంతాల్లోని సువర్ణముఖి నదిలో, గరుగుబిల్లి, పాచిపెంట, సాలూరు, మక్కువ, బలిజిపేట తదితర మండలాల్లోనూ అనధికారికంగా ఇసుక తవ్వకాలు చేపట్టారు. ఐదేళ్లుగా ఈ దందా జోరుగా సాగినా.. పట్టించుకునే వారే కరువయ్యారు. ఎవరైనా గృహ నిర్మాణాలకు ట్రాక్టర్లపై ఇసుక తెచ్చుకుంటే.. కేసు నమోదు చేశారు తప్ప అక్రమంగా తవ్వకాలు జరిపి ఇసుకను తరలించిన వారిపై జిల్లా అధికారి యంత్రాంగం పెద్దగా కేసులు నమోదు చేయలేదనే ఆరోపణలున్నాయి.

- భామిని మండలంలో వంశధార నదీతీరాన ఉన్న ఇసుకకు అనేక అడ్డంకులు సృష్టించడంతో భవన కార్మికులకు ఉపాధి లేక రోడ్డున పడ్డారు. గతంలో అనేక పర్యాయాలు వామపక్షాలతో కలిసి వారు ఆందోళనకు దిగినా ..వైసీపీ సర్కారు పట్టించుకోలేదు.

- కొత్త పాలసీ విధానంతో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన తొలినాళ్లలో ఇసుక దొరికేది కాదు. దీంతో ప్రజలు చాలా అవస్థలు పడాల్సి వచ్చేది. ముందుగా మీ సేవలో చలానాలు తీసుకున్నా.. ఇసుక లభించడం కష్టంగా ఉండేది. ఎందుకంటే అనధికార , అధికార రీచుల వద్ద వైసీపీ నాయకుల హవా కొనసాగేది. దీంతో ఇసుక తెచ్చుకోవాలంటే చలానాలతో పాటు రీచ్‌ల వద్ద మడుపులు చెల్లించుకోవాల్సిన పరిస్థితి మొదటి ఏడాదిలో ఉండేది. మొత్తంగా వైసీపీ సర్కారు నూతన ఇసుక విధానంతో భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టింది. వారికి ఉపాధిని దూరం చేసి వలసబాట పట్టేలా చేసింది. మరోవైపు నిర్మాణాలు చేపట్టేవారికి సైతం పెనుభారం మోపింది.

ఈ పరిస్థితి ఎప్పుడూ చూడలేదు

కొన్నేళ్లుగా నేను భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్నాను. కనీసం పది మంది తాపీమేస్ర్తిలు నా దగ్గర పనిచేసేవారు. అయితే ఇప్పుడున్న పరిస్థితి ముందెన్నడూ చూడలేదు. టీడీపీ హయాంలో ఇసుక అందుబాటులో ఉండేది. నిర్మాణాల మెటీరియల్‌ ధరలు కూడా తక్కువగానే ఉండేవి. దీంతో నిర్మాణాలు జోరుగా సాగేవి. మా ఉపాధికి ఇబ్బంది ఉండేది కాదు. అయితే వైసీపీ వచ్చాక ఇసుక కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి. గతంలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదు. ఇసుక, ఇతర నిర్మాణ సామగ్రి ధరలు అమాంతం పెరిగిపోవడంతో పనులు నిలిచిపోయాయి. మాకు ఉపాధి కరువైంది. ఎంతోమంది భవన నిర్మాణ కార్మికులు పనుల కోసం పొట్టచేతపట్టుకుని ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిపోయారు.

- తిరుపతిరావు, తాపీమేస్ర్తి, పార్వతీపురం

===========================

వలస బాటలోనే..

స్థానికంగా ఉపాధి లేకపోవడంతో అనేక మంది భవన నిర్మాణ కార్మికులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఇసుక అందుబాటులో లేకపోవడం వల్ల మాలాంటి భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేకుండాపోయింది. వలస బాట పట్టాల్సిన దుస్థితి ఏర్పడింది.

- వెంకటరమణ, భవన నిర్మాణ కార్మికుడు, పార్వతీపురం

============================

పథకాలకు మంగళం

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో భవన నిర్మాణ కార్మికులకు అందించిన సంక్షేమ పథకాలన్నింటినీ వైసీపీ సర్కారు మంగళం పాడేసింది. చివరకు సంక్షేమ బోర్డు నిధులను సైతం దారి మళ్లించింది. ఇసుక దొరక్కుండా చేసి మాకు ఉపాధి లేకుండా చేసింది.

- అప్పలస్వామి, భవన నిర్మాణ కార్మికుల సంఘం మండల అధ్యక్షుడు, భామిని

Updated Date - Apr 27 , 2024 | 11:14 PM