Share News

హామీలు గుప్పించి...నట్టేట ముంచి!

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:14 AM

ఎంతో మంది రైతులు.. కార్మికులకు ఉపాధినిచ్చిన భీమసింగి చెక్కర పరిశ్రమను వైసీపీ నాయకులు ఆధునికీకరణ పేరుతో మూసివేయించారు. దీంతో ఎంతో ఆశపడ్డ రైతులు ఉసూరుమంటున్నారు.

హామీలు గుప్పించి...నట్టేట ముంచి!
19కోట1ఆర్‌: భీమసింగి చక్కెర కర్మాగారం (ఫైల్‌)

- మూతపడిన భీమసింగి చక్కెర పరిశ్రమ

- వైసీపీ నాయకుల మాటలకు మోసపోయిన రైతులు

- రోడ్డున పడిన కార్మికులు, ఉద్యోగులు

- ఆదాయం కోల్పోయిన అన్నదాత

ఎంతో మంది రైతులు.. కార్మికులకు ఉపాధినిచ్చిన భీమసింగి చెక్కర పరిశ్రమను వైసీపీ నాయకులు ఆధునికీకరణ పేరుతో మూసివేయించారు. దీంతో ఎంతో ఆశపడ్డ రైతులు ఉసూరుమంటున్నారు. మళ్లీ అధికారాన్నిస్తే దీన్ని లాభదాయకమైన పరిశ్రమగా మార్చేస్తామంటూ జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు చెప్పడంపై రైతులు మండిపడుతున్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ పరిశ్రమ మూతపడడంతో వేలాది మంది ఉపాధిని కోల్పోయారు.

(జామి)

ఉత్తరాంధ్రకే తలమానికంగా నిలిచిన విజయరామ గజపతి కోఆపరేటివ్‌ సుగర్స్‌ లిమిటెడ్‌ (భీమసింగి సుగర్స్‌) నేడు ఆనవాలు లేకుండా పోయింది. మండలంలోని కుమరాం గ్రామంలో కొన్ని దశాబ్దల కిందట గజపతిరాజుల వంశానికి చెందిన పీఎల్‌ఎన్‌ రాజు ఈ చెక్కర పరిశ్రమను స్థాపించారు. తరువాత కాలంలో స్వాతంత్య్ర సమరయోధుడు గొర్రిపాటి బుచ్చి అప్పారావు, లగుడు సింహాద్రి వంటి పెద్దలు దీనిని ఈ ప్రాంత రైతుల సాయంతో సహకార రంగంలోకి మార్పు చేయించారు.

లక్ష టన్నుల క్రషింగ్‌..

1967లో స్థాపితమైన ఈ ఫ్యాక్టరీ 1977 నుంచి క్రషింగ్‌ మొదలుపెట్టింది. ప్రారంభంలో విశాఖ, విజయనగరం జిల్లాలో 18 మండలాలకు చెందిన 3,500 మంది రైతులు ఈ కర్మాగారంలో 16,682 షేర్‌హోల్డర్స్‌ ఉన్నారు. 1250 టన్నుల కెపాసిటీతో క్రషింగ్‌ ప్రారంభమైంది. ఒకానొక దశలో లక్ష టన్నుల క్రషింగ్‌ జరిగిందటే ఈ ప్రాంత రైతులకు ఈ పరిశ్రమ ఎంత ఆధారమో చెప్పవచ్చును. ఎంతో మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పరిశ్రమ ఉపాధి కల్పించింది. ఈ రెండు జిల్లాలకు చెందిన 543 గ్రామాల నుంచి చెరకు కర్మాగారానికి వచ్చేది. ఇక్కడ తయారైన పంచదారకు ఎంతో గిరాకీ ఉండేది. కాలక్రమంలో ఈ కర్మాగారం పరిస్థితి దయనీయంగా మారింది. ప్రస్తుతం విజయనగరం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి చెరకు వస్తుంటే 60వేల నుంచి 80వేల టన్నులు క్రషింగ్‌ జరుగుతుంది.

మాట తప్పను.. మడమ తిప్పనని..

ఈ ఫ్యాక్టరీని ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన పెద్దగా పట్టించుకోకపోయినా రైతులు, కార్మికులు మాత్రం తమ శ్రమతో నడిపించేవారు. ప్రభుత్వాలు ఉమ్ముతడిగా ఇచ్చే సొమ్మును పొదుపుగా వాడుతూ ఎప్పటికప్పుడు యంత్రాల నిర్వహణ భారాన్ని మోస్తూ...ముందుకు నడిపారు. 2019లో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు చెరకు రైతులు, కార్మికులు ఆయనను కలిసి పరిశ్రమ దీనస్థితిని వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్యాక్టరీని ఆధునీకరించి, పూర్వవైభవం తెస్తామని మాట ఇచ్చారు. ఈ జగన్‌ మాట ఇస్తే మడమ తిప్పడు అంటూ.. పెద్దపెద్ద మాటలు చెప్పారు. ఆయన వెనుక ఉన్న గజపతినగరం, ఎస్‌.కోట ఎమ్మెల్యేలు బొత్స అప్పలనర్సయ్య, కడుబండి శ్రీనివాస్‌ తమదిరైతు ప్రభుత్వం.. మీ వెంటే మేము ఉంటాం అంటూ భరోసా ఇచ్చేశారు. జిల్లాకు చెందిన మంత్రి బొత్స సత్యనారాయణ వీరికి వంతపాడారు. ఇది గుడ్డిగా నమ్మిన రైతులు, కార్మికులు తమకు మంచి రోజులు వస్తాయని బలంగా నమ్మారు.

అధికారంలోకి వచ్చి మూయించారు

2019లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక సీజన్‌ నడిచింది. సుమారు 60వేల టన్నుల క్రషింగ్‌ జరిగింది. క్రషింగ్‌ పూర్తయిన వెంటనే జిల్లా మంత్రి, ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీల ఆధ్వర్యంలో మహాజన సభ ఏర్పాటు చేసి.. రైతులు, కార్మికులు నెత్తిన ఒక్కసారి పెద్దపిడుగులాంటి వార్త పడేశారు. భీమసింగి సుగర్స్‌ కర్మాగారానికి మహర్దశ రాబోతుందని 2020-21 సంవత్సరాల్లో రెండు క్రషింగ్‌లు నిలిపివేసి ఆధునీకరిస్తున్నామని చెప్పారు. వామపక్ష నాయకులు, లోక్‌సత్తా నాయకులు దీనిని ఖండించారు. వచ్చే క్రషింగ్‌కు కొత్త యంత్రాలు బిగించి క్రషింగ్‌ చేయాలని... దీనిని ఆపోద్దని కోరారు. అయినా సరే మంత్రి మాత్రం మీకు ఫ్యాక్టరీ అభివృద్ధి ఇష్టం లేదా? మీరు అభివృద్ధిని అడ్డుకుంటారా? అంటూ మండిపడ్డారు. మాటలు చెప్పిన మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ తరువాత చేతులు ఎత్తేశారు. ఈ ఫ్యాక్టరీ ఆధునీకరణ మాట అటుంచి.. దీనిని పూర్తిగా మూలకు తోసేశారు.

పట్టని కార్మికుల వేదన..

ఈ ప్రభుత్వ హయాంలో ఇక ఫ్యాక్టరీ తెరవదన్న ఆభిప్రాయానికి రైతులు, కార్మికులు వచ్చేశారు. నాలుగేళ్లపాటు వారికి ఎదురుచూపులు మిగిలాయి. రైతులు చెరకు పంట వేయడం మానేశారు. కార్మికుల్లో చాలామందికి 18 నెలలుగా జీతాలు రాక పస్తులతో ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. ఇక రిటైరు అయిన వారికి ఇప్పటికీ పీఎఫ్‌, గ్రాట్యూటీ, ఇతర సెటిల్‌మెంట్స్‌ ఊసేలేదు. కొద్దిరోజుల క్రితం ఎన్నికల ప్రచారంలో మంత్రి బొత్సను ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఫ్యాక్టరీ భవితవ్యం గురించి ప్రశ్నిస్తే... ఇక ప్యాక్టరీ ఊసు మరచిపోవాలని.. మన పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిస్తే లాభదాయక పరిశ్రమగా మార్చనున్నట్టు తేల్చేశారు. దీంతో ఈ ప్రాంత రైతులు, కార్మికులు ఈ ప్రభుత్వం తమ ఉసురు పోసుకుందని, దీనికి తగిన మూల్యం తప్పదంటూ శాపనార్థాలు పెడుతున్నారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన భీమసింగి చక్కెర కర్మాగారం చరిత్రను కాలగర్భంలో కలిపేశారని మండిపడుతున్నారు. ఈ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న విశాఖ, విజయనగరం ఎంపీలు, శృంగవరపుకోట, గజపతినగరం ఎమ్మెల్యేలు తమది నిరంతరం రైతు ప్రభుత్వం అని మాటలు చెబుతూ రైతులను మభ్యపెట్టడం తప్ప.. రైతులకు చేసిందేమీ లేదని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

Updated Date - Apr 28 , 2024 | 12:14 AM