Share News

ఉద్యమాల గడ్డ కురుపాం

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:16 AM

కురుపాం నియోజకవర్గం 2009లో పునర్విభజనలో భాగంగా ఏర్పడింది. అంతకుముందు నాగూరు నియోజకవర్గంగా ఉండేది. ఎక్కువ సంవత్సరాలు శత్రుచర్ల వంశస్థులే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. 1972లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్ర చూడామణిదేవ్‌ వైరిచర్ల ఇండిపెండెంట్‌గా పోటీ చేసి తన సమీప ప్రత్యర్ధి శత్రుచర్ల ప్రతాపరుద్రరాజుపై 717 ఓట్ల తేడాతో గెలుపొందారు.

ఉద్యమాల గడ్డ కురుపాం
కురుపాం నియోజకవర్గం మ్యాప్‌

- దేశంలో అక్షరానికి ఆలయం ఉన్నది ఈ నియోజకవర్గంలోనే

- రెండో తిరుపతిగా పేరుగాంచిన తోటపల్లి దేవస్థానం ఇక్కడే

(జియ్యమ్మవలస)

కురుపాం నియోజకవర్గం 2009లో పునర్విభజనలో భాగంగా ఏర్పడింది. అంతకుముందు నాగూరు నియోజకవర్గంగా ఉండేది. ఎక్కువ సంవత్సరాలు శత్రుచర్ల వంశస్థులే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. 1972లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చంద్ర చూడామణిదేవ్‌ వైరిచర్ల ఇండిపెండెంట్‌గా పోటీ చేసి తన సమీప ప్రత్యర్ధి శత్రుచర్ల ప్రతాపరుద్రరాజుపై 717 ఓట్ల తేడాతో గెలుపొందారు. తొలిసారి 1978లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన శత్రుచర్ల విజయరామరాజు... ఆ తరువాత 1983, 1985, 1999లలోనూ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన తమ్ముడు శత్రుచర్ల చంద్రశేఖరరాజు 1989లో ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత ఆయన మేనల్లుడు వీటీ జనార్దన్‌ థాట్రాజ్‌ 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014, 2019లలో ఎమ్మెల్యేగా గెలుపొందిన పాముల పుష్పశ్రీవాణి... చంద్రశేఖరరాజు కోడలే. కురుపాం నియోజకవర్గాన్ని 37 సంవత్సరాల పాటు ఏలిన ఘనత శత్రుచర్ల కుటుంబానిదే. నాగూరు నియోజకవర్గంలో ఇక్కడి ఓటర్లు నాలుగుసార్లు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. కురుపాం నియోజకవర్గం ఆవిర్భావం తరువాత రెండుసార్లు వైసీపీ, ఓసారి టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో శత్రుచర్ల విజయరామరాజు మంత్రిగా పనిచేయగా... వైసీపీ ప్రభుత్వంలో పాముల పుష్పశ్రీవాణి మంత్రిగా బాఽధ్యతలు నిర్వర్తించారు.

పోరాటాల గెడ్డ

కురుపాం నియోజకవర్గం పోరాటాలకు పురిటి గెడ్డ. 1967లో మొండెంఖల్‌ వద్ద సభలో శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. ఆ పోరాట యోధులు వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం మాస్టారు ఈ ప్రాంతం వారే. వారి విగ్రహాలు కురుపాం మండలం గుమ్మ గ్రామం వద్ద భారీ స్థూపంతో ఏర్పాటు చేశారు. ఏటా గిరిజనులు అత్యధిక సంఖ్యలో హాజరై వారి వర్ధంతి రోజున ఘనంగా నివాళులర్పిస్తారు. అటవీ హక్కులన్నీ గిరిజనులకే చెందాలని వీరు పోరాటాన్ని కొనసాగించారు. ఆ పోరాటంలో 380 మంది కమ్యూనిస్టు కార్యకర్తలు పోలీసుల తూటాలకు బలయ్యారు. అంతేకాకుండా పార్వతీపురం కుట్ర కేసులో 450 మంది కమ్యూనిస్టు కార్యకర్తలు ఏడేళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఐదేళ్ల పాటు శిక్ష అనుభవించారు. విడుదలైన తరువాత కూడా వీరు కమ్యూనిస్టు కార్యకర్తలుగానే కొనసాగారంటే దానికి వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం పోరాట పటిమే కారణం.

అక్షర బ్రహ్మ ఆలయం

దేశంలో మరెక్కడా అక్షరానికి ఆలయం లేదు. కానీ గుమ్మలక్ష్మీపురం మండలం కన్నయ్యగూడ వద్ద గిరిజనులు అక్షర బ్రహ్మ ఆలయం నిర్మించారు. ఆనాడు సవర భాషను నేర్చుకుని గిరిజనులకు చదువు చెప్పాలనుకునే మహనీయుడు గిడుగు రామ్మూర్తి. ఆయన స్ఫూర్తితో 1993లో గుమ్మలక్ష్మీపురం మండలం కన్నయ్యగూడలో పాఠశాలను నిర్మించారు. తెలుగు మాధ్యమాలలో ఉన్న పాఠ్య పుస్తకాలను సవర భాషలోకి తర్జుమా చేసి ఆయన స్ఫూర్తితో సవర భాష గిరిజనులు అమ్మ భాషను అక్షర బ్రహ్మగా భావించి ఆలయాన్ని నిర్మించుకుని అక్కడ నిత్యం కొలుస్తుండటం విశేషం.

చిన తిరుపతిగా తోటపల్లి

కురుపాం నియోజకవర్గంలో పర్యాటక ప్రదేశాలకు కొదువ లేదు. ఇందులో ప్రధానంగా చినతిరుపతిగా పేరొందిన తోటపల్లిలో శ్రీవేంకటేశ్వరస్వామి, కోదండరామస్వామి ఆలయాలు అత్యంత పవిత్రమైనవి. నిత్యం పెద్ద సంఖ్యలో ఇక్కడికి భక్తులు తరలి వస్తుంటారు.

్డ- గుమ్మక్ష్మీపురం మండలం తాడికొండ వద్ద జలపాతాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక్కడికి ఎక్కువగా పర్యాటకులు వస్తూ ఉంటారు.

- తోటపల్లి బ్యారేజీలో బోటు షికారు పర్యాటకులకు ఓ మధురానుభూతి. పక్షుల కిలకిలలు, స్వచ్ఛమైన... ఆహ్లాదకరమైన పరిసరాలు పర్యాటకులను కట్టి పడేస్తుంటాయి.

మండలాలు : కొమరాడ, కురుపాం, గరుగుబిల్లి, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస

రిజర్వుడు : ఎస్టీ

పోలింగ్‌ కేంద్రాలు : 268

ఓటర్లు : 1,92,636 (2024 జనవరి 22 ప్రకారం)

పురుషులు : 93,592

మహిళలు : 99,005

ఇతరులు : 39

నాగూరు నియోజకవర్గంలో...

================

సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్థి పార్టీ మెజార్టీ

==================

2004 కోలక లక్ష్మణమూర్తి సీపీఎం నిమ్మక జయరాజు టీడీపీ 8,701

1999 శత్రుచర్ల విజయరామరాజు కాంగ్రెస్‌ నిమ్మక జయరాజు టీడీపీ 6,917

1994 నిమ్మక జయరాజు టీడీపీ శత్రుచర్ల చంద్రశేఖరరాజు కాంగ్రెస్‌ 32,271

1989 శత్రుచర్ల చంద్రశేఖరరాజు కాంగ్రెస్‌ వైరిచర్ల ప్రదీప్‌కుమార్‌దేవ్‌ టీడీపీ 3,435

1985 శత్రుచర్ల విజయరామరాజు కాంగ్రెస్‌ వెంపటాపు భారతి టీడీపీ 3,914

1983 శత్రుచర్ల విజయరామరాజు కాంగ్రెస్‌ పువ్వల సోమందొర సోషలిస్టు 623

1978 శత్రుచర్ల విజయరామరాజు జనతా వైరిచర్ల చంద్రచూడామణిదేవ్‌ కాంగ్రెస్‌ 1,533

1972 వైరిచర్ల చంద్రచూడామణిదేవ్‌ ఇండిపెండెంట్‌ వైరిచర్ల ప్రతాపరుద్రరాజు కాంగ్రెస్‌ 717

=============================

కురుపాం నియోజకవర్గంగా మారిన తరువాత

====================================

సంవత్సరం విజేత పార్టీ సమీప ప్రత్యర్ధి పార్టీ మెజార్టీ

========================================

2009 వీటీ జనార్ధన్‌ థాట్రాజ్‌ టీడీపీ ఎన్‌.జయరాజు ప్రజారాజ్యం 15,053

2014 పాముల పుష్పశ్రీవాణి వైసీపీ వీటీ జనార్ధన్‌ థాట్రాజ్‌ టీడీపీ 19,083

2019 పాముల పుష్పశ్రీవాణి వైసీపీ వీటీ నరసింహప్రియ థాట్రాజ్‌ టీడీపీ 26,602

=========================

Updated Date - Apr 28 , 2024 | 12:16 AM