Share News

పురం..ఎవరికో వరం

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:34 PM

పార్వతీపురం నియోజకవర్గానికి ఈసారి ఓ ప్రత్యేకత ఉంది. ఒకప్పుడు విజయనగరం జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం కొత్తగా పార్వతీపురం మన్యం జిల్లాగా అవతరించింది. కొత్త జిల్లాలో తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో అందరి చూపూ ఈ నియోజవర్గంపైనే ఉంది. ఇక్కడి ఓటరు తీర్పు ఎలా ఉంటుందో...ఎవరిని ఎన్నుకుంటారోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

పురం..ఎవరికో వరం
పార్వతీపురం నియోజకవర్గం మ్యాప్‌

- కొత్త జిల్లాలో తొలి ఎన్నికలు

- టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే ఈసారి మొగ్గు

పార్వతీపురం నియోజకవర్గానికి ఈసారి ఓ ప్రత్యేకత ఉంది. ఒకప్పుడు విజయనగరం జిల్లాలో ఉన్న ఈ ప్రాంతం కొత్తగా పార్వతీపురం మన్యం జిల్లాగా అవతరించింది. కొత్త జిల్లాలో తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో అందరి చూపూ ఈ నియోజవర్గంపైనే ఉంది. ఇక్కడి ఓటరు తీర్పు ఎలా ఉంటుందో...ఎవరిని ఎన్నుకుంటారోనని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

(పార్వతీపురం, ఆంధ్రజ్యోతి)

పార్వతీపురం మన్యం జిల్లా ఆవిర్భవించిన తరువాత తొలిసారిగా ఎన్నికలు వస్తున్నాయి. పార్వతీపురం నియోజకవర్గం 2019 సార్వత్రిక ఎన్నికల వరకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉండేది. జల్లాల విభజన తర్వాత పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంగా ఆవిర్భవించింది. 2009లో పునర్వి భజనకు ముందు మక్కువ, గరుగుబిల్లి, కొమరాడ, పార్వతీపురం మండ లాలతో పాటు పార్వతీపురం పట్టణం ఈ నియోజకవర్గంలో ఉండేవి. అప్పటి వరకు పార్వతీపురం నియోజకవర్గం జనరల్‌ కేటగిరిలో ఉండేది. 2009లో పునర్విభజన తరువాత మక్కువ, గరుగుబిల్లి, కొమరాడ మండలాలను తప్పించి కొత్తగా సీతానగరం, బలిజిపేట మండలాలను చేరుస్తూ పార్వతీ పురం పట్టణంతో పాటు పార్వతీపురం మండలాన్ని కలుపుకొని నియోజ కవర్గం ఏర్పడింది. పునర్విభజన అనంతరం ఈ నియోజకవర్గం షెడ్యూల్‌ కులాలకు కేటాయిం చారు. అప్పటి నుంచి ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు శాసన సభ్యులుగా ఉంటున్నారు. 2009లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి సవరపు జయమణి, 2014లో టీడీపీ తరఫున బొబ్బిలి చిరంజీవులు, 2019లో వైసీపీ నుంచి అలజంగి జోగారావు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ప్రస్తుత ప్రజల నాడి చూస్తే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థికే విజయావకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

నియోజకవర్గంలో ఓటర్లు...

పార్వతీపురం నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,89,565 మంది. ఇందులో పురుషులు 93,395 మంది, మహిళలు 96,159, థర్డ్‌ జెండర్‌ 11 మంది ఉన్నారు.

నియోజకవర్గ ప్రత్యేకత..

పార్వతీపురం నియోజకవర్గంలో కిలోమీటరులోపు రెండు రైల్వేస్టేషన్లు ఉన్నాయి. పార్వతీపురం టౌన్‌ రైల్వేస్టేషన్‌తో పాటు బెలగాం రైల్వేస్టేషన్‌ ఉన్నాయి.

ఒకప్పుడు డివిజన్‌ కేంద్రం...

రెండేళ్ల క్రితం వరకు పార్వతీపురం పట్టణం డివిజన్‌ కేంద్రంగా ఉండేది. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత జిల్లా కేంద్రంగా ఏర్పడింది. కొత్తగా జిల్లా ఆవిర్భవించిన తర్వాత బొబ్బిలి పట్టణంతో పాటు రామభ ద్రాపురం, తెర్లాం, బొబ్బిలి మండలాలు విజయనగరం జిల్లాలోకి వెళ్లగా... శ్రీకాకుళం జిల్లా నుంచి పాలకొండ నగర పంచాయతీతో పాటు పాలకొండ, సీతంపేట, భామిని మండలాలు కొత్తగా చేరాయి.

1952లో మొదటి ఎన్నికలు

పార్వతీపురం నియోజకవర్గానికి మొట్టమొదటి ఎన్నికలు 1952లో నిర్వహించారు. మొట్టమొదటి ఎమ్మెల్యేగా వీడివీరభద్రదేవ్‌ బహుదూర్‌ జాతీయ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎన్నికయ్యారు. ఆయన 1952 నుంచి 1962 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మరిచర్ల వెంకటరామినాయుడు.. చీకటి పరశురామనాయుడుపై గెలుపొందారు. 1967లో వెంకటరామినాయుడు కాంగ్రెస్‌ తరఫున ఎన్నికయ్యారు. 1972లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన చీకటి పరశురామనాయుడు.. ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసిన మరిచర్ల వెంకటరామినాయుడిపై గెలిచారు. 1978లో జనతా పార్టీ నుంచి పోటీ చేసిన చీకటి పరశురామనాయుడు.. కాంగ్రెస్‌ (ఐ) పార్టీ తరఫున పోటీ చేసిన వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడుపై ఎన్నికయ్యారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి దొడ్డి పరశురాముపై ఇంటిపెండెంట్‌గా పోటీ చేసిన మరిచర్ల వెంకటరామినాయుడు గెలుపొందారు. అక్కడి నుంచి నియోజకవర్గంలో దశాబ్దాల పాటు టీడీపీ ప్రభంజనం కొనసాగింది. 1985లో మరిచర్ల వెంకటరామినాయుడు (టీడీపీ)... పరశురాము (కాంగ్రెస్‌)పై పోటీ చేసి గెలుపొందారు. అనంతరం 1989లో ఎర్ర కృష్ణమూర్తి తెలుగుదేశం తరఫున పోటీ చేసి... కాంగ్రెస్‌ అభ్యర్థి శివున్నాయుడుపై విజయం సాధించారు. 1994లో కూడా కృష్ణమూర్తి (టీడీపీ).. కాంగ్రెస్‌ అభ్యర్థి శివున్నాయుడుపై గెలిచారు. 1997లో కృష్ణమూర్తి మృతి చెందడంతో ఉప ఎన్నిక జరిగింది. ఆ ఉప ఎన్నికల్లో కృష్ణమూర్తి భార్య అన్నపూర్ణమ్మ పోటీ చేసి గెలుపొందారు. 1999లో టీడీపీ అభ్యర్థి డాక్టర్‌ ప్రతిమాదేవిపై మరిచర్ల శివున్నాయుడు(కాంగ్రెస్‌) గెలుపొందారు. 2004లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి శత్రుచర్ల విజయరామరాజు.. టీడీపీ అభ్యర్థి ద్వారపురెడ్డి జగదీష్‌పై గెలిచారు. 2009లో టీడీపీ అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులు(టీడీపీ)పై సవరపు జయమణి (కాంగ్రెస్‌) గెలుపొందారు. 2014లో టీడీపీ అభ్యర్థి బొబ్బిలి చిరంజీవులు... వైసీపీ అభ్యర్థి ప్రసన్నకుమార్‌పై విజయం సాధించారు. 2019లో టీడీపీ తరఫున పోటీ చేసిన బొబ్బిలి చిరంజీవులుపై వైసీపీ అభ్యర్థి అలజంగి జోగారావు గెలుపొందారు. ప్రస్తుతం వైసీపీ నుంచి ఆయన మరోసారి పోటీ చేస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా బోనెల విజయచంద్ర బరిలో ఉన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:34 PM