Share News

ఓటు... నడిపిస్తున్న నోటు!

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:39 PM

‘అన్నిసార్లూ ఓటు రూ.500కే దొరకదు. ఒక్కోసారి పరిస్థితులను బట్టి ఓటుకు రూ.1000 ఇవ్వాలి. అవసరమైతే రూ.5000 కూడా ఇవ్వాలి. అధికారం కావాలంటే ఎన్ని వందల కోట్లయినా ఖర్చు పెట్టాలి...’ ఇవీ ఓ సినిమాలో కథానాయకుడు అన్న మాటలు. సినిమా డైలాగులను పక్కన పెడితే... అంతగా ఖర్చు చేయకపోయినా భారీగా డబ్బు లేనిదే ఎన్నికలు లేవన్నది వాస్తవం... డబ్బుకు లోకం దాసోహం అన్నారు. ఎన్నికల వేళ కోట్లు ఖర్చు చేసేందుకు నేతలు సిద్ధంగా ఉన్నారు.

ఓటు... నడిపిస్తున్న నోటు!

- ఎన్నికల్లో డబ్బే కీలకం

- సమయం తక్కువ.. ఖర్చు ఎక్కువ

(రాజాం రూరల్‌ )

‘అన్నిసార్లూ ఓటు రూ.500కే దొరకదు. ఒక్కోసారి పరిస్థితులను బట్టి ఓటుకు రూ.1000 ఇవ్వాలి. అవసరమైతే రూ.5000 కూడా ఇవ్వాలి. అధికారం కావాలంటే ఎన్ని వందల కోట్లయినా ఖర్చు పెట్టాలి...’ ఇవీ ఓ సినిమాలో కథానాయకుడు అన్న మాటలు. సినిమా డైలాగులను పక్కన పెడితే... అంతగా ఖర్చు చేయకపోయినా భారీగా డబ్బు లేనిదే ఎన్నికలు లేవన్నది వాస్తవం... డబ్బుకు లోకం దాసోహం అన్నారు. ఎన్నికల వేళ కోట్లు ఖర్చు చేసేందుకు నేతలు సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల సంఘం జిల్లాకు ముగ్గురు ఐఆర్‌ఎస్‌ అధికారులను వ్యయ పరిశీలకులుగా నియమించింది. వీరిలో ఒకరు పార్లమెంట్‌కు, ఇద్దరు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఖర్చులను లెక్కిస్తున్నారు. వీరే కాకుండా జిల్లా ఎన్నిక అధికారి, కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశాలతో అధికార యంత్రాంగ నిఘాతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది.

జిల్లాలో పరిస్థితి

జిల్లాలోని ఏడు నియోజకవర్గాలలో అధికార వైసీపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు ప్రచారాన్ని ఉధృతం చేశారు. కాంగ్రెస్‌ తదితర పార్టీలు సైతం తమదైన రీతిన ప్రచారం ప్రారంభించాయి. అధికారం దక్కించుకోవాలని తెలుగుదేశం కూటమి అభ్యర్థులు... రెండోసారి విజయం సాధించి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని వైసీపీ అభ్యర్థులు ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగాయి. ఈ ఎన్నికలో ఎంత ఖర్చు చేయగలరో తెలుసుకుని కొన్ని పార్టీలు టికెట్లు ఇస్తున్న నేపఽథ్యంలో ఈసారి డబ్బు ఏరులై పారడం కచ్చితమని తేలుతోంది. మరి అభ్యర్థుల ఖర్చు ఎలా ఉండాలో.. ఎంత ఉంటోందో ఓసారి చూద్దామా?

అధికారికంగా...

ఎమ్మెల్యేగా పోటీలో ఉన్న అభ్యర్థి రూ.40 లక్షలు, ఎంపీగా బరిలో దిగిన అభ్యర్థి రూ.95 లక్షలకు మించి ఖర్చు చేయకూడదని ఎన్నికల సంఘం నిబంధన. ఈ ఖర్చులు రికార్డులకే పరిమితం. వాస్తవంగా జరుగుతున్న ఖర్చు ఎంతనేది జగమెరిగిన సత్యం. పాదయాత్రలు, బహిరంగ సభలు, రోజువారీ కార్యకర్తలు, నాయకుల ఖర్చులు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ప్రచారం ఖర్చులు... వాహనాల పెట్రోల్‌... ఇలా అన్నీ కలిపి అంచనాలు దాటుతాయి. ఇక నామినేషన్‌ వేసిన ఒక్క రోజు చేసిన ఖర్చు అతని స్థాయిని తెలియజేస్తుంది. ఇదే గెలుపోటములపై ప్రజల్లో ఓ అంచనా వేసేందుకు కీలకంగా మారుతుందనడంలో సందేహం లేదు.

ఎంపీ నియోజకవర్గాలలో..

విజయనగరం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో జిల్లాలోని ఆరు నియోజనవర్గాలతో పాటు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం కూడా కలిిసి ఉంది. ఎంపీ అభ్యర్థి తన పరిధిలో గల అసెంబ్లీ పరిధిలోని ఖర్చులను కూడా కొంతమేర భరించాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందనడం అతిశయోక్తి కాదు.

జిల్లాలో రూ.500 కోట్లు పైమాటే..

ఏడు నియోజకవర్గాలలో రెండు ప్రధాన పార్టీల నుంచి 14 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. వీరే సుమారు రూ.300 కోట్లు వరకు ఖర్చు చేస్తారన్నది ఓ అంచనా. ఇతర పార్టీల అభ్యర్థులను పరిశీలిస్తే మరో రూ.పదికోట్లు ఖర్చు చేసే అవకాశాలు లేకపోలేదు. ఎన్నికల ప్రకటన వెలువడిన నాటి నుంచి రెండు ప్రధాన పార్టీల ఖర్చు ఇప్పటికే సుమారు రూ.100 కోట్లు దాటిందనడం సందేహం లేదు. అధికార పార్టీ అభ్యర్థులు నియోజకవర్గంలో కనీసం రూ.50 కోట్లు ... ఆపై ఖర్చు చేసేందుకు కూడా వెనుకంజ వేయడం లేదన్నది వాస్తవం.

Updated Date - Apr 25 , 2024 | 11:39 PM