Share News

ఓటింగ్‌ శాతం పెరగాలి

ABN , Publish Date - Apr 26 , 2024 | 11:50 PM

జిల్లాలో ఓటింగ్‌ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, ఓటర్ల స్లిప్పులను పూర్తి వివరాలతో శతశాతం పంపిణీ చేయడం ద్వారా పోలింగ్‌ శాతం పెరుగుతుందని ఎన్నికల పరిశీలకులు హనీష్‌ చాబ్రా, తలాత్‌ పర్వేజ్‌ చెప్పారు.

ఓటింగ్‌ శాతం పెరగాలి
మాట్లాడుతున్న ఎన్నికల జిల్లా పరిశీలకులు

ఓటింగ్‌ శాతం పెరగాలి

ఓటర్ల స్లిప్పులను శతశాతం పంపిణీ చేయండి

ఎన్నికల పరిశీలకులు హనీష్‌ చాబ్రా, తలాత్‌ పర్వేజ్‌

కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 26: జిల్లాలో ఓటింగ్‌ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, ఓటర్ల స్లిప్పులను పూర్తి వివరాలతో శతశాతం పంపిణీ చేయడం ద్వారా పోలింగ్‌ శాతం పెరుగుతుందని ఎన్నికల పరిశీలకులు హనీష్‌ చాబ్రా, తలాత్‌ పర్వేజ్‌ చెప్పారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఎన్నికల నిర్వహణకు జిల్లాలో చేస్తున్న ఏర్పాట్లపై కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎస్పీ దీపికాపాటిల్‌ వివరించారు. ఓటర్లు, నియోజకవర్గాలు, ఎన్నికల సిబ్బంది సమీకరణ, వారికి ఇచ్చిన శిక్షణ గురించి తెలియజేశారు. ఈవీఎంల ర్యాండమైజేషన్‌ కూడా పూర్తయ్యిందన్నారు. అనంతరం ఎన్నికల పరిశీలకులు మాట్లాడుతూ ఎన్నికల సమయం తక్కువగా ఉందని, ఏర్పాట్లు ముమ్మరం చేయాలన్నారు. మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతలకు సిబ్బంది చేరుకొనేందుకు అనువైన వాహనాలను సమకూర్చాలన్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఇక ప్రచార కార్యక్రమాలు పెరుగుతాయని, కోడ్‌ ఉల్లంఘనలపై దృష్టి సారించాలని సూచించారు. కోడ్‌ ఉల్లంఘనలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లోకి కెమెరాలు, సెల్‌ ఫోన్లను అనుమతించవద్దని చెప్పారు. హోమ్‌ ఓటింగ్‌లో ఓటరు రహస్యంగా ఓటువేసే అవకాశాన్ని కల్పించాలని, కంపార్ట్‌మెంట్‌లో ఓటు వేస్తున్నప్పుడు వీడియో రికార్డింగ్‌ చేయకూడదని చెప్పారు. పోలీసు పరిశీలకుడు సచింద్ర పటేల్‌ మాట్లాడుతూ, శాంతియుత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జేసీ కార్తీక్‌, ట్రైనీ కలెక్టర్‌ త్రివినాగ్‌, డీఆర్‌వో అనిత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 26 , 2024 | 11:50 PM