Share News

గీత దాటొద్దు.. మూత తీయొద్దు..!

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:37 AM

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మద్యం అమ్మకాలపై కట్టడి మొదలైంది. ఎవరి ఆదేశాల మేరకు చేస్తున్నారో వెల్లడించకుండానే కోటా పూర్తయిందంటూ మద్యం దుకాణాలను నిర్దిష్ఠ సమయం కంటే కొన్ని గంటలకు ముందే మూస్తున్నారు. ఇంతకుముందు ఎడాపెడా మద్యం అమ్మకాలు సాగేవి.

 గీత దాటొద్దు.. మూత తీయొద్దు..!

గతేడాది లక్ష్యాలతో పోల్చి ఏరోజుకారోజు కోటాకే పరిమితం

కొద్ది గంటల్లోనే మూత పడుతున్న మద్యం దుకాణాలు

రాత్రి పొద్దుపోయేంత వరకు బారుల వద్ద కిటకిట

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ మద్యం అమ్మకాలపై కట్టడి మొదలైంది. ఎవరి ఆదేశాల మేరకు చేస్తున్నారో వెల్లడించకుండానే కోటా పూర్తయిందంటూ మద్యం దుకాణాలను నిర్దిష్ఠ సమయం కంటే కొన్ని గంటలకు ముందే మూస్తున్నారు. ఇంతకుముందు ఎడాపెడా మద్యం అమ్మకాలు సాగేవి. రాత్రి పొద్దుపోయే వరకు దుకాణాలు అన్ని మందుబాబులతో కిటకిటలాడేవి. ఇప్పటికే నాణ్యత లేని మద్యం విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉండగా గడిచిన మూడు రోజులుగా లిక్కర్‌ దుకాణాలపై ఎక్సైజ్‌ అధికారులు నిఘా ఉంచారు.

(ఏలూరు, ఆంధ్రజ్యోతి, ప్రతినిధి)

జిల్లాలో మద్యం అమ్మకాలకు కళ్ళెం పడింది. ఇంతకుముందు ఎడా పెడా సాగిన అమ్మకాలు జోరు తగ్గింది. ఇదేదో జనం చైతన్యవంతం అయ్యారని కాదు. రోజూవారీ కోటా ఎప్పుడు పూర్తయితే అక్కడితో మద్యం దుకాణాలు ఆ రోజుకు మూతపడుతున్నాయి. గడిచిన మూడు రోజులుగా ఇదంతా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 152కి పైగా మద్యం దుకాణాలు మరో 19 వాకింగ్స్‌ స్టోర్స్‌, 16 బార్‌లు ఉన్నాయి. రోజూ కోట్లాది విలువైన మద్యం విక్రయాలు సాగుతాయి. లక్షన్నర మందికి పైగా మద్య సేవనంలో తరించిపోతారని అంచనా. ఉదయం 11 నుంచి సాయంత్రం 9 వరకు మద్యం దుకాణాల్లో అమ్మకాలు సాగేవి. ఇప్పటికే గడిచిన ఐదేళ్లల్లో నిర్దేశించిన బ్రాండ్‌లకు బదులు రకరకాల బ్రాండ్‌లు వచ్చి పడ్డాయి. జనానికి ఇష్టమున్నా లేకపోయినా ఈ బ్రాండ్‌లతోనే సరి చూసుకుంటూ వచ్చారు. ఉదాహరణకు మాన్‌హన్‌హౌస్‌ లాంటి బ్రాండ్‌లపై ఎక్కువగా మద్యం ప్రియులు ఇష్టపడేవారు. ఇప్పుడు ఆ బ్రాండ్‌కు బదులుగా రక రకాల బ్రాండ్‌లు వచ్చిపడ్డాయి. వాక్‌ ఇన్‌ స్టోర్‌లలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. కొన్ని బ్రాండ్‌లనే అమ్మకాలకు పరిమితం చేశారు. అత్యధిక ఖరీదైన బ్రాండ్‌ల అమ్మకాలకు వీలు కల్పించారు. ఈ బ్రాండ్‌ల కొనుగోలులో అందరూ నగదు చెల్లించాల్సిందే. అక్కడా ఫోన్‌ పేలు అమలులో ఉంచినా ఆ తర్వాత దానిని కాదు పొమ్మన్నారు. ఒక రకంగా చెప్పాలంటే మద్యం విక్రయాలు ప్రభుత్వ కనుసన్నలోనే సాగింది. సర్కారు పెద్దలు ఈ బ్రాండ్‌లు సిగ్నల్‌ ఇస్తే ఆ బ్రాండ్‌లే క్షేత్ర స్థాయి వరకు అమ్మకానికి వచ్చేవి. ఈ పరిస్థితిపై మందుబాబులు కక్కలేక మింగలేక సర్కారుపై అసంతృప్తి వ్యక్తం చేసేవారు. రాను రాను మద్యం విక్రయాలు భారీగా పెరిగాయి. జిల్లాలో కోట్ల రూపాయల మద్యం విక్రయాలు రోజువారీ సాగాయి. తాజాగా ఎన్నికల వేళ నాటు పూర్తిగా తాగేందుకు అలవాటు ఉన్న ప్రాంతాల్లో అయితే సరే సరి. మిగితా ప్రాంతాల్లో లిక్కర్‌ కోసం జనం ఆరాటపడుతున్నారు. ఎన్నికల ప్రచార వేళ అభ్యర్థులు తమ వెంట జేజేలు కొడుతూ వెనుకుండేవారి కోసం కాస్తంత గొంతు తడిపేందుకు అవకాశం ఇస్తున్నా ఇక్కడ మద్యం దుకాణాలు మూసి ఉండడం అందరిలోనూ ఆగ్రహం కలిగిస్తోంది.

షాపులు మూసి ... బారులు తెరచి....

గడిచిన మూడు రోజులుగా మద్యం దుకాణాల పైన విక్రయాలపై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఎవరి ఈ ఆంక్షలు విధించారని మద్యం

బాబులు ప్రశ్నించినా ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. రోజూ వారీ కోటా పూర్తి అయితే చాలు ఆ పైన నయా పైస మందు కూడా విక్రయించడానికి వీలు లేదని ఆదేశాలు వచ్చాయని షాపులలో ఉన్నవారు చెబుతున్నట్టు తెలిసింది. గతేడాది ఇదే రోజు ఎంత మొత్తంలో ప్రభుత్వ విధానంలో సరుకు విక్రయించారో అంతే మొత్తంలో మద్యం విక్రయాలు తప్ప అంతకుమించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా ఆంక్షలు విధించినట్టు చెబుతున్నారు.

అంతా బార్ల దారి..

రాత్రి 6,7 అయ్యే సరికి దాదాపు ప్రభుత్వ మద్యం దుకాణాలు అన్ని మూత పడుతున్నాయి. దీనికి కారణం తెలియక మందుబులంతా బార్ల వైపు ఎగబడుతున్నారు. ఇప్పటికే బార్‌లలో బయటి కంటే క్వార్టర్‌ ఒక్కింటికి రూ.60 అదనం. ఇప్పటికే తడిచి ముద్దయిన ధరతో పాటు బార్‌లలో అదనపు ధర చెల్లించాల్సి వస్తోందని కొందరు పేచికి దిగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న బార్‌లు అన్నింటి వద్ద రాత్రి పొద్దుపోయేంత వరకు మందుబాబులతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. బార్‌ల యజమానులు తమకు కూడా ఏరోజు ఆరోజు కోటా మేరకే అమ్మకాలు సాగించాలని ఆంక్షలు ఉన్నాయని భారీగా వచ్చిన జనం వల్ల తమకు వచ్చే లాభం ఏమి లేదని వారి వాదన. అయితే ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ అమ్మకాలు కట్టడి వేయడానికి ఆంక్షలు విధించారా.. ఎక్సైజ్‌ అధికారుల కనుసన్ననలోనే ఇదంతా సాగిందా.. లేక ఎన్నికల అధికారుల ఆంక్షలకు లోబడి ఈ చర్యలు తీసుకుంటున్నారా.. అనేది తేలడం లేదు. పై వారు చెప్పారంటూ ఆంక్షలను అక్షరాలు అమలు చేస్తున్నారంటే మందుబాబులు విలవిల్లాడుతున్నారు. పోలింగ్‌ ముగిసేంత వరకు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని భావిస్తున్నారు. మద్యం విక్రయాలు కట్టడి చేసేందుకే ఎన్నికల కమిషన్‌ ఆదేశాల్లో భాగంగానే ఇది అమలు అవుతున్నట్టు కొందరు చెబుతున్నారు.

Updated Date - Apr 27 , 2024 | 12:37 AM