Share News

ఓటు పడాలంటే పడవ దాటాల్సిందే !

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:21 AM

ఎన్నికల అధికారులు గోదావరిలో పడవ దాటి లంకగ్రామాలకు వెళ్లవలసిందే. దీంతో ఎన్నికల అధికారులు వీరి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు.

ఓటు పడాలంటే పడవ దాటాల్సిందే !
లంకగ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాల పరిశీలనకు పడవపై వెళుతున్న ఎస్‌పీ డాక్టర్‌ అజిత

ఆచంట, ఏప్రిల్‌ 27: ఎన్నికలు ఎపుడు జరిగినా కొంతమంది ఎన్నికల సిబ్బంది మాత్రం గోదావరిలో పడవ ప్రయాణం చేసి ఎన్నికల విధులు నిర్వర్తించవలసిందే. ఆచంట మండలంలో పెదమల్లం, అయోధ్యలంక రెండు లంక గ్రామాలున్నాయి. పెదమల్లంలో పోలింగ్‌ కేంద్రం 85 . ఈ గ్రామంలో ఒకటే పోలింగ్‌ కేంద్రం. అయోధ్యలంకలో మూడు పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. అయోద్యలంక పీఎస్‌ నెం.185, మర్రిమూల పీఎస్‌ నెం. 186, పుచ్చల్లంక పీఎస్‌ నెం.187 ఉన్నాయి. ఈ నాలుగు పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి 3,592 ఓట్లు ఉన్నాయి. అయితే ఎన్నికల అధికారులు ఈ రెండు గ్రామాలకు గోదావరిలో పడవ దాటి లంకగ్రామాలకు వెళ్లవలసిందే. దీంతో ఎన్నికల అధికారులు వీరి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. మండలంలోని కోడేరు పల్లిపాలెం లంకకు సంబంధించి ఓటర్లు మాత్రం గోదావరిలో పడవ దాటి కోడేరులో ఉన్న పోలింగ్‌ బూత్‌లో ఓట్లు వేసేందుకు వస్తారు. ఇక్కడ సుమారు 200 మంది ఓటర్లు ఉంటారు. ప్రతీ ఎన్నికల్లో అధికారులు ఓటర్లును తీసుకు రావడానికి పడవలను ఏర్పాటు చేస్తారు. మండలంలో మూడు లంక గ్రామాలకు సంబంధించి రెండు లంకగ్రామాలకు అధికారులే వెళతారు. ఒక లంక గ్రామానికి సంబంధించి ఓటర్లు మాత్రం ఓటు వేయడానికి రావాల్సిందే.

అయోధ్యలంకలో పోలింగ్‌ కేంద్రాల పరిశీలన

జిల్లా ఎస్‌పీ డాక్టర్‌ అజిత ఆచంట మండలం అయోధ్యలంకలో పోలింగ్‌ కేంద్రాలను శనివారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు.ఎస్‌పీ కరుగోరుమిల్లి నుంచి గోదావరిపై పడవ ప్రయాణం చేసి అయోధ్యలంక వెళ్లారు. మర్రిమూలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను, అయోధ్యలంకలోని అంగన్‌వాడీకేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు తీసుకోవాల్సిన భద్రతా పరమైన చర్యలు గురించి పోలీసు అధికారులకు ఎస్పీ పలు సూచనలు చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పగడ్బంధీగా ఏర్పాట్లు చేయాలన్నారు. స్థానికులతో మాట్లాడి శాంతి యుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి పోలీసులకు సహకరించాలన్నారు. పెనుగొండ సీఐ రజనీ కుమార్‌, ఎస్‌.ఎం రాజ్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - Apr 28 , 2024 | 12:21 AM