Share News

బాదుడే...బాదుడు

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:25 PM

ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట ఇది వైసీపీ ప్రభుత్వం తీరు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే ఎటువంటి ఆస్తి పన్నులు పెంచం. మా అభ్యర్థులను గెలిపిం చండి అని వాగ్దానాలు చేశారు.

బాదుడే...బాదుడు

ఏటా 15 శాతం ఆస్తి పన్నుల పెంపు

ప్రజలపై పెనుభారం మోపిన జగన్‌ ప్రభుత్వం

గత ఎన్నికల వేళ పన్నులు పెంచమంటూ వైసీపీ నాయకుల హామీలు

గెలిచాక ఇష్టారాజ్యంగా వసూళ్లు

ఏలూరు టూ టౌన్‌, ఏప్రిల్‌ 25 : ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట ఇది వైసీపీ ప్రభుత్వం తీరు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మేము అధికారంలోకి వస్తే ఎటువంటి ఆస్తి పన్నులు పెంచం. మా అభ్యర్థులను గెలిపిం చండి అని వాగ్దానాలు చేశారు. తీరా ఓట్లు వేయించుకుని గెలి చిన తర్వాత ఆస్తిపన్నులు, చెత్తపన్నులు, నీటి పన్నులు విపరీ తంగా పెంచేశారు. అదేమని అడిగితే ప్రభుత్వం పన్నులు పెంచింది.. మీరు కట్టాల్సిందే మేము ఏమి చేయలేమని ప్రజా ప్రతినిధులు తప్పించుకుంటున్నారు.

జీవోలతో భారం

2021 సంవత్సరంలో 196, 197, 198 జీవోలను వైసీపీ ప్రభు త్వం తీసుకొచ్చింది. దీని ప్రకారం ఆస్తి పన్నులు ఆస్తి విలువ ఆధారంగా పెంచినట్టు జీవోలోని సారారశం. నివాస గృహాలపై ఆస్తి విలువలో 0.12 శాతం, వాణిజ్య భవనాలకు 0.30 శాతం, ఖాళీ స్థలాలకు 0.50 శాతం పన్నులు విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో అద్దె ఇల్లు ప్రతిపాదికగా ఆస్తి పన్ను వసూలు చేసేవారు. ఇప్పుడు ఆస్తి విలువ ఆధారంగా పన్నులు పెంచారు. అంతేకాకుండా ఏటా 15 శాతం పెంచే విధంగా జీవోలో ఉంది. మూడేళ్ల నుంచి ఈ జీవోల ప్రకారం ఏడాదికి 15 శాతం పెంచుతూ వస్తున్నారు. ఈ కొత్త విధానంతో 100 నుంచి 300 శాతం వరకు పన్నులు పెరిగాయి. దీంతో ఆస్తి పన్ను తడిసి మోపెడై ప్రజలకు పెనుభారంగా మారింది.

విలీన గ్రామాల్లో మూడు రెట్లు..

విలీన గ్రామాల్లో ఆస్తి పన్నులు విపరీతంగా పెంచేశారు. గతంలో పంచాయతీల్లో తక్కువగా ఆస్తి పన్ను ఉండేది. ఇప్పుడు వాటిని నగర పాలక సంస్థ ఆస్తి పన్నుల జీవోల ప్రకారం పెంచారు. దాంతో గతంలో పన్ను కంటే మూడు రెట్లు పెరిగింది. విలీన గ్రామ పంచాయతీలో వెంకటేశ్వరరావు అనే వ్యక్తి 2021– 22 ఆర్థిక సంవత్సరానికి రూ.2,486 ఆస్తి పన్ను చెల్లించాడు. అదే వ్యక్తి ఈ ఏడాది 2023–24 ఆర్థిక సంవత్సరానికి రూ.4,008 పన్ను కట్టాల్సి వచ్చింది. రెండేళ్ల వ్యవధిలో రూ.1,522 పెంచేశారు. ఇలా ప్రతీ ఏడాది 15 శాతం పెంచుకుంటూ పోతు న్నారు. 2021 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి కొత్త పన్నుల విధానం అమలులోకి వచ్చింది. ఆ ఏడాది కరోనా సమయం కావడంతో ఆ ఏడాది 15 శాతం పెంచకుండా వదిలివేసి ఆ మరుసటి ఏడాది పెరిగిన 15 శాతం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇంకో 15 శాతంతో మొత్తం 30 శాతం అదనంగా వసూలు చేశారు. విలీన గ్రామాలైన తంగెళ్ళమూడి, సత్రంపాడు, శనివారపుపేట, పోణంగి, వెంకటాపురం, చొదిమెళ్ళ, కొమడవోలు గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి కానరావడం లేదు. పైగా ఆస్తి పన్నులు అధి కంగా పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని మోపారు. నగ రంలో గ్రామాలు విలీనమైతే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ప్రజలు ఆశించారు. దానికి విరుద్దంగా పెన్నుల పెంపులో అభివృద్ధి చూసి ప్రజలు బెంబెలెత్తుతున్నారు. పన్నులైతే విపరీ తంగా పెరిగాయి. కానీ విలీన గ్రామాల్లో రోడ్డు, డ్రెయినేజీలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ప్రజలను మోసం చేస్తున్నారు..

ఎన్నికలకు ముందు ఆస్తి పన్ను పెంచేది లేదని వాగ్దానాలు ఇచ్చి ఎన్నికల తర్వాత ఆస్తి పన్నులు పెంచి వైసీపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది. పన్నులు పెంచడం, తగ్గిచడం పాలకవర్గ నిర్ణయించాలి. ప్రభుత్వం ఏకపక్షంగా పాలక మండలిలను సంప్రదించ కుండా పన్నులు పెంచడం సరికాదు. ప్రజలపై పెనుభారం మోపే 196, 197 జీవోలను రద్దు చేయాలి. పన్నులు పెంచడం 93, 94 రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి విరుద్ధం.

– జి.కోటేశ్వరరావు, 6వ డివిజన్‌, మొండిల కాలనీ

ఆస్తి విలువ ఆధారంగా పెంచడం సరికాదు..

ఆస్తి విలువ ఆధారంగా పన్నులు పెంచడం వల్ల ఏటా పన్నులు పెరుగుతూనే ఉంటా యి. ఏటా ఆస్తి విలువ పెరుగుతుంది. దానికనుగుణంగానే ఆస్తి పన్నులు విపరీతంగా పెరుగుతాయి. ఇప్పటికే పన్నులు కట్టలేని పరిస్థితి. భవిష్యత్తులో మరింత ఆర్థికభారం ప్రజలపై పడుతుంది. ఏటా 15 శాతం పన్నులు పెంచే విధానాన్ని రద్దు చేయాలి. పాతపద్ధతిలో అద్దె విలువ ఆధారంగా ఆస్తి పన్నులను నిర్ణయించాలి.

– సాల్మన్‌రాజు, లక్ష్మీనగర్‌

Updated Date - Apr 25 , 2024 | 11:25 PM