Share News

ఒకే పేరుతో నామినేషన్లు

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:27 PM

వైసీపీ కుట్ర రాజకీయాలకు తెర తీసింది. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థికి ఓట్లు వేసేవారిని గందరగోళంలో పడే సేందుకు అస్త్రాలను సిద్ధం చేసింది.

ఒకే పేరుతో నామినేషన్లు

తాడేపల్లిగూడెం రూరల్‌, ఏప్రిల్‌ 25: వైసీపీ కుట్ర రాజకీయాలకు తెర తీసింది. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థికి ఓట్లు వేసేవారిని గందరగోళంలో పడే సేందుకు అస్త్రాలను సిద్ధం చేసింది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్‌లు సమర్పించారు. అభ్యర్థుల పేర్లు ఉన్నవారితో నామినేషన్లు వేయిస్తోందని ఇది అధికార పార్టీ వైసీపీ కుట్రలో భాగమేనని పలువురు విమ ర్శిస్తున్నారు. గురువారం భారీగా తాడేపల్లిగూడెంలో 16 నామినేషన్‌లు సమ ర్పించారు. జనసేన అభ్యర్థిగా పోటీలో ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్‌ పేరును పోలిన అభ్యర్థి నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున బొలిశెట్టి శ్రీనివాస్‌ నామినేషన్‌ వేశారు. అదేవిధంగా జనసేన పార్టీ పేరును పోలిన ఉంగుటూరు జాతీయ జనసేన పార్టీ తరపున అభ్యర్థిగా బూసనబోయిన ఆంజనేయులు నామినేషన్‌ దాఖలు చేశారు.

నరసాపురంలో ముగ్గురు నాయకర్‌లు

నరసాపురం : నరసాపురం అసెంబ్లీ స్ధానానికి మొత్తం 14 మంది అభ్యర్ధులు 25 సెట్ల నామినేషన్లు వేశారు. వీరిలో నాయకర్‌ల పేర్లపై ముగ్గరు అభ్యర్ధులు ఉన్నారు. జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్‌తో పాటు జాతీయ జనసేన పార్టీ అభ్యర్ధిగా పాలెపు సత్యలింగ నాయకర్‌, నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా కొల్లి సత్య నాయకర్‌లు ఉన్నారు. వీరిలో పాలెపు సత్యనాయకర్‌ స్వస్థలం కాకినాడ పట్టణం కాగా, కొల్లి సత్యనాయకర్‌ స్వస్థలం నరసాపురం పట్టణంలోని 3వ వార్డుకి చెందిన వాడుగా నామినేషన్‌ పత్రంలో చూపించారు. బ్యాలెట్‌లో ముగ్గురు నాయకర్‌ పేర్లు ఉంటే ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవశాశం ఉంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వీరి పార్టీలు, గుర్తులు వేరైనా పేర్లు కారణంగా కన్ప్యూజ్‌ అయ్యే అవకాశం ఉంది. కావాలనే ఏవరైనా వీరితో నామినేషన్లు వేయించారా ? అని పలువరు చర్చించుకుంటున్నారు.

ముగ్గురు ధర్మరాజులు,ఇద్దరు వాసుబాబులు

ఉంగుటూరు : ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వేసిన నామి నేషన్లలో రెండు విచిత్రాలు చోటు చేసుకున్నాయి. జనసేన అభ్యర్థి పత్సమట్ల ధర్మరాజు తన నాలుగు సెట్ల నామినేషన్లను దరఖాస్తు చేయగా మరో వ్యక్తి పెదపూడి ధర్మరాజు జాతీయ జనసేన పార్టీ తరఫున దరఖాస్తు చేశారు. నవరంగ్‌ కాంగ్రెస్‌ తరఫున పొట్ల ధర్మరాజు కూడా దరఖాస్తు చేశారు. వైసీపీ అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు తన మూడో నెట్‌ నామినేషన్‌ను దరఖాస్తు చేయగా అదేపేరు ఉన్న కైకరం గ్రామానికి చెందిన పుప్పాల శ్రీనివాసరావు కూడా దరఖాస్తు చేయడం విశేషం.

నిడదవోలు బరిలో నలుగురు ‘ప్రసాద్‌’లు

పెరవలి : నిడదవోలు అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ల ఘట్టం గురువారంతో ముగిసింది. అయితే నామినేషన్‌ల పరిశీలన ఉపసంరణ అనంతరం ఎంత మంది పోటీలో ఉంటారనేది వేచి చూడాలి. అయితే ఈ నాలుగు రోజులుగా నామినేషన్‌లు వేసినవారిలో ప్రసాద్‌ పేరు గల వారు నలుగురు ఉండటం విశేషం. వీరిలో ప్రధానంగా జనసేన తరుపున కందుల లక్ష్మి దుర్గేష్‌ ప్రసాద్‌ నామినేషన్‌ వేయగా పిరమిడ్‌ పార్టీ తరుపున ముక్కామల అన్నవరప్రసాద్‌ నామినేషన్‌ వేశారు. ఇండియన్‌ పార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ తరుపున కస్తూరి సత్య ప్రసాద్‌ నామినేషన్‌ వేశారు. ఇండిపెండెంట్‌గా అరిగెల సత్య వరప్రసాద్‌ నామినేసన్‌ వేశారు. మొత్తం నామినేషన్‌లు వే సిన వారిలో ప్రసాద్‌ పేరుతో ఉన్నవారు నలుగురు ఉన్నారు.

Updated Date - Apr 25 , 2024 | 11:27 PM