Share News

వైఎస్‌ఆర్‌ జలయజ్ఞమేది?

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:28 AM

వైఎస్‌ఆర్‌ కలలు కన్న జలయజ్ఞం ఇక్కడ జరగలేదు. లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందించే చింతలపూడి ఎత్తిపోతలకు అతీగతీ లేదు. ఈ ఐదేళ్లలో కనీసం తట్టెడు మట్టి తీసిన పాపాన పోలేదు. జగన పాలనలో ఇలా అంతటా నిర్లక్ష్యమే జరిగింది’ అని పీసీసీ చీఫ్‌ షర్మిల విరుచుపడ్డారు

వైఎస్‌ఆర్‌ జలయజ్ఞమేది?
చింతలపూడి సభలో ప్రసంగిస్తున్న షర్మిల

చింతలపూడి, పోలవరంను పూర్తి కాకుండా చేశారుగా..

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఇవన్నీ పూర్తి చేస్తాం

ఎమ్మెల్యేలకు సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వరా...?

దెందులూరు ఎమ్మెల్యేదీ మట్టి దోపిడీ

చింతలపూడి, గోపన్నపాలెం సభల్లో షర్మిల

ఏలూరు/చింతలపూడి/దెందులూరు ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి):‘వైఎస్‌ఆర్‌ కలలు కన్న జలయజ్ఞం ఇక్కడ జరగలేదు. లక్షలాది ఎకరాలకు సాగు నీరు అందించే చింతలపూడి ఎత్తిపోతలకు అతీగతీ లేదు. ఈ ఐదేళ్లలో కనీసం తట్టెడు మట్టి తీసిన పాపాన పోలేదు. జగన పాలనలో ఇలా అంతటా నిర్లక్ష్యమే జరిగింది’ అని పీసీసీ చీఫ్‌ షర్మిల విరుచుపడ్డారు. సాగునీటి ప్రాజెక్ట్టులే కాదు రైతులను విస్మరించారని దుయ్యబట్టారు. న్యాయ బస్‌ యాత్రలో భాగంగా శుక్రవారం చింతలపూడి సెంటర్‌, దెందులూరు నియోజక పరిధిలోని గోపన్నపాలెంలో జరిగిన సమావేశాల్లో ఆమె జగన్‌ పాలనపై విరుచుపడ్డారు. ‘చింతలపూడి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ఎలీజాను ఉద్దేశించి.. కాంగ్రెస్‌లోకి ఎందుకు వస్తున్నారని అడిగా. ఆయనేమో ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఎందుకు ఉన్నానో తెలీదన్నారు. కనీసం రోడ్లు వేయిద్దామంటే నిధులు ఇవ్వలేదన్నారు. కనీసం జగన్‌ అపాయింట్‌మెంట్‌ అడిగితే ఒక్కసారి అవకాశం రాలేదన్నారు. ఇదీ జగన్‌ పాలన వ్యవహారమ’ంటూ షర్మిల తప్పుపట్టారు. అలసిపోయి ఇంకా వైసీపీలోనే ఉంటే చింతలపూడి పథకం పూర్తి కాదని భావించి కాంగ్రెస్‌లో చేరాడు. చింతలపూడి ప్రాజెక్టును పూర్తి చేయలేక జగన్‌ ఎప్పడో చేతులేత్తేశారని దుయ్యబట్టారు. గట్టిగా కొట్లాడే గొంతు ఇంతకాలం రాష్ట్రంలో లేదు. హోదా ఇస్తామని కాంగ్రెస్‌ ఇచ్చిన మాట పట్టుకుని మరీ ఇక్కడకు వచ్చా. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే హోదా పదేళ్లు ఇస్తా మని షర్మిల ప్రకటించారు. దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొఠారు అబ్బ య్య చౌదరిపైనా విరుచుకుపడ్డారు. పేకాట, కోడి పందేలు మూడు పువ్వులు, ఆరు కాయలుగా ఉంది. నియోజకవర్గంలో మట్టి మొత్తం దోచేశారు. కొల్లేరు సమస్యను పట్టించుకోలేదు. ఎందుకు మరీ మీ ఎమ్మెల్యే..? కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పోల వరం ప్రాజెక్టును పూర్తిచేస్తాం. చింతలపూడి ఎత్తపోతలను పూర్తి చేసి నీరందిస్తాం. 2.25 లక్షల ఉద్యోగాలు తక్షణం భర్తీ చేస్తాం. మహిళలకు ఏడాదికి లక్ష ఆర్థికసాయం చేస్తాం. పేద మహిళల పేరు మీద 5 లక్షలతో పక్కా ఇళ్లను కట్టించి ఇస్తాం. ప్రజల కోసం పనిచేసేది పార్టీ కాంగ్రెస్‌ ఒక్కటే అని షర్మిల అన్నారు. చింతలపూడి, దెందులూరు కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎలీజా, ఆలపాటి నరసింహమూర్తి, ఏలూరు ఎంపీ అభ్యర్థి కావూరి లావణ్యలను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సీపీఎం నాయకులు ఎ.రవి, సీపీఐ నాయకులు కృష్ణచైతన్య మాట్లాడుతూ ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఎంపీ అభ్యర్థి లావణ్య మాట్లాడుతూ ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, కాంగ్రెస్‌ వల్లే సాధ్యమన్నారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్‌రావు, సత్యేంద్రబాబు, కాశీ, ప్రసాద్‌, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు విస్సంపల్లి సుందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్‌లో షర్మిలను పట్టించుకోని పోలీసులు

ఏలూరు జిల్లా పర్యటనలో పీసీసీ చీఫ్‌ షర్మిల పర్యటనకు అడుగడుగునా అవాం తరాలు సృష్టించే ప్రయత్నం జరిగింది. గోపన్నపాలెం జంక్షన్‌లో ఎన్నికల ప్రచార సభ ముగించుకుని తిరిగి వెళ్లే క్రమంలో ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభించింది. గంటకు పైగా షర్మిల ఆ ప్రాంతం నుంచి ముందుకు కదలలేక వాహనంలోనే ఉండిపోయారు. కనీసం ట్రాఫిక్‌ క్లియర్‌ చేయడానికి ఒక్క పోలీసు అందుబాటులో లేనేలేరు. ఈ నిర్లక్ష్యంతో షర్మిల తీవ్ర అగ్రహం చెందారు. జిల్లా ఎస్పీని సంప్రదించేందుకు షర్మిల ప్రయత్నించగా స్పందన లేకపోవడంతో కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌కు ఫోన్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. అప్పుడు గాని కొంతలో కొంత పోలీసుల్లో కదలిక వచ్చినా ఆ లోపు స్థానికులు కలుగ చేసుకుని ట్రాఫిక్‌ క్లియర్‌ చేయడంతో శుక్రవారం రాత్రి 9 గంటలకు షర్మిల కాన్వాయ్‌ రాజమండ్రి వైపు సాగింది. చింతలపూడిలో షర్మిల ప్రసంగిస్తుండగా కొందరు వైసీపీ కార్యకర్తలు తమ జెండాలతో గలాటకు ప్రయత్నించారు.

Updated Date - Apr 27 , 2024 | 12:28 AM