Share News

పారి‘శ్రామిక’ తణుకు

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:32 AM

నియోజకవర్గ కేంద్రమైన తణుకు పారిశ్రామిక పట్టణంగా గుర్తింపు పొందింది. వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సాహం, కార్మికుల సంక్షేమం గాలికొదిలేసింది.

పారి‘శ్రామిక’ తణుకు
దువ్వ వద్ద వయ్యేరు కాలువ

జిల్లా కేంద్ర ఆస్పత్రి భవన నిర్మాణంలో నిర్లక్ష్యం

ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు గాలికొదిలేశారు

టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు కేటాయించలేదు

జగనన్న కాలనీలకు దారి లేదు

ఎర్ర కాల్వ ముంపు నివారణ చర్యలు లేవు

టీడీఆర్‌ బాండ్ల అవినీతికి అంకురార్పణ

నియోజకవర్గ కేంద్రమైన తణుకు పారిశ్రామిక పట్టణంగా గుర్తింపు పొందింది. వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సాహం, కార్మికుల సంక్షేమం గాలికొదిలేసింది. నియోజకవర్గంలో వేలాది కార్మికుల ఆరోగ్య సంరక్షణ నిమిత్తం ఈఎస్‌ఐ ఆస్పత్రి ఏర్పాటు అంశం పాలకులకు పట్టదు. గత ప్రభుత్వం తణుకు ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా స్థాయి పెంచింది. తర్వాత వచ్చిన వైసీపీ పాలకులు జిల్లా ఆస్పత్రికి స్థల సేకరణ చేయకపోగా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నియోజకవర్గంలో పరిశ్రమలతో పౌలీ్ట్ర, వ్యవసాయం కీలకం. పౌలీ్ట్ర రంగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వేలాది ఎకరాలను ముంచుతున్న ఎర్ర కాల్వపై అక్విడెక్ట్‌ నిర్మాణాన్ని విస్మరించారు.

(తణుకు)

తణుకు నియోజకవర్గ ప్రజలకు జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీలు, ముఖ్యమంత్రి అయ్యాక గాలికొదిలేశారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి పది ఎకరాల భూమి సేకరణ, టిడ్కో ఇళ్లు లబ్దిదారులకు అందించడం కాలుష్య నిర్మూలన, కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం వంటి హామీలు అమలుకు నోచుకోలేదు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కేంద్ర ఆసుపత్రిగా టీడీపీ ప్రభుత్వం అప్‌గ్రేడ్‌ చేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆసుపత్రికి 10 ఎకరాల భూమి సేకరించాలని భావించారు. స్థల సేకరణలో పురోగతి లేదు కానీ భవన నిర్మాణానికి అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని శంకుస్థాపన చేశారు. జిల్లా ఆస్పత్రిలో సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు.

జగనన్న కాలనీల్లో సౌకర్యాలేవీ..?

జగనన్న కాలనీలకు పట్టణం, గ్రామాలకు దూరంగా భూసేకరణ చేసి స్థలాలు కేటాయించారు. లబ్ధిదారులకు కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు, డ్రెయినేజీ, తాగునీరు వంటి సౌకర్యాలు లేవు. వర్షాకాలం కాలనీలు అన్నీ చెరువులను తలపిస్తున్నాయి. కాలనీల్లో కనీసం రహదారి నిర్మాణానికి గ్రావెల్‌ కూడా వేయలేదు. లే అవుట్‌కు అరకొర మట్టి తప్ప మరలా మట్టి వేసిన సందర్బాలు లేవు.

ఈఎస్‌ఐ ఆసుపత్రి ఎక్కడ?

పారిశ్రామిక పట్టణమైన తణుకులో కార్మికులకు అవసరమైన ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటు కలగానే మిగిలింది. తణుకు పరిసర ప్రాంతాల్లో ప్రధానంగా ఆంధ్రా షుగర్స్‌, కెమికల్స్‌, అట్టల తయారీ, రాకెట్‌ ఇంధనం, పేపర్లు తయారీ పరిశ్రమల్లో వేలాది మంది కార్మికులు పని చేస్తున్నారు. కేవలం డిస్పెన్సరీతోనే వారికి వైద్య సేవలందుతున్నాయి. ఆసుపత్రి నిర్మాణం హామీ కార్యరూపం దాల్చడం లేదు. కార్మికులకు వైద్యం అవసరమైతే రాజమహేంద్రవరం, విజయవాడ వెళ్లాల్సిన పరిస్థితి.

ముంచుతున్న ఎర్ర కాల్వ

ఎర్ర కాలువ ఏటా వేలాది ఎకరాలు ముంచుతోంది. దువ్వ, ముద్దాపురం, కొండేపాడు, కోనాల, సూర్యారావుపాలెం వంటి గ్రామాల్లో వరి చేలు ఏటా నీటమునుగుతున్నాయి. అక్విడెక్టు నిర్మాణం చేయడంలో ప్రజాప్రతినిదులు పట్టించుకున్న దాఖలాలు లేవు. అన్ని చోట్ల కల్వర్టులు శిథిలావస్థకు చేరడంతో నీరు లీకేజీతో ముంపు ముప్పు తప్పడం లేదు.

కాలుష్య నివారణ ఒట్టిమాటే

తణుకు పరిసర ప్రాంతాల్లో పరిశ్రమలు ఎక్కువ కావడంతో కాలుష్యం కూడా ఎక్కువే. కాలుష్యం నివారణకు హామీ అమలు కాలేదు. గతంలో టిడిపి ప్రభుత్వంలోని పైడిపర్రు కాలువ వద్ద సంపు ఏర్పాటు చేసి అక్కడ నుంచి నరసాపురం వద్ద సముద్రంలో కలిపే విధంగా ప్రతిపాదించారు. జగన్‌ కాలుష్య నివారణ హామీ మరిచిపోయారు.

అందని గోదావరి జలాలు

పట్టణంలోని ప్రతి ఒక్కరికి గోదావరి జలాలు తాగునీరు అందిస్తామని చెప్పినా ఆచరణలో శూన్యం. పాలకొల్లు, నరసాపురం, నిడదవోలు, తణుకు పట్టణాలకు తాగునీరందించే విధంగా విజ్జేశ్వరరం వద్ద రూ.220 కోట్లతో నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు పనుల్లో పురోగతి లేదు.

జిల్లా కేంద్ర ఆస్పత్రి భవనం ఎక్కడ జగనన్నా

ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌ పాదయాత్రలో తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి పది ఎకరాల భూమి సేకరణ హామీ ఇచ్చారు. టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందిస్తామన్నారు. కాలుష్య నిర్మూలనకు మాటిచ్చారు. కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం వంటి హామీలు ఐదేళ్ల పాలనలో అమలుకు నోచుకోలేదు. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించిన జగనన్న కాలనీలకు వెళ్లేందుకు కనీసం దారి కూడా లేదు.

టీడీఆర్‌ కుంభకోణం

టీడీఆర్‌ బాండ్ల కుంభకోణానికి మంత్రి కారుమూరి తణుకులో అంకురార్పణ చేశారని ఆరోపణ. సుమారు రూ.300 కోట్లు కుంభకోణం బయట పడింది తణుకులోనే. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం పట్టణంలో గ్రీనరీ ఏర్పాటుకు 20ఎకరాలు భూమిని తీసుకుని ఎకరాల్లో ఉన్న భూమిని గజాల్లోకి మార్చి గజం ధర ప్రకారం రేటు కట్టించి టీడీఆర్‌ బాండ్లు పొందారు. ఒకటికి నాలుగు రెట్లు చొప్పున బాండ్లను తీసుకొని కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారు.

జగనన్న కాలనీ భూసేకరణలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. రైతుల నుంచి తక్కువ ధరకు భూమి కొనుగోలు చేసి ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అంచనా చూపించారనే ఆరోపణలు ఉన్నాయి.

శిథిలమవుతున్న టిడ్కో ఇళ్లు

టీడీపీ ప్రభుత్వం 90 శాతం నిర్మించిన టిడ్కో ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు ఇస్తామని హామీ ఇచ్చిన వైసీపీ అధికారంలోకి వచ్చాక మోసం చేసింది. అసంపూర్తి నిర్మాణాన్ని పట్టించుకోలేదు. లబ్ధిదారులు అధిక వడ్డీలకు తెచ్చి రూ.50వేలు నుంచి రూ.1.5 లక్షలు చెల్లించారు. అయినప్పటికీ లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించ లేదు. బ్యాంకు రుణాల వాయిదాలు చెల్లించాల్సి వస్తోంది.

నెరవేరని హామీలు

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతం ఇస్తామన్న జగన్‌ హామీ సీఎం అయ్యాక గాలికొదిలేశారు.

ఎస్సీఐఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్టేడియం నిర్మాణంపై ఎమ్మెల్యే కారుమూరి హామీ అమలు కాలేదు.

పట్టణంలో ట్రాపిక్‌ ఇబ్బందులు లేకుండా రోడ్లు విస్తరణ చేస్తామని హామీ అమలు కాలేదు. పట్టణంలో ప్రధాన సమస్య ట్రాఫిక్‌.

నియోజకవర్గంలో రహదారులన్నీ గోతులమయం. గ్రామాల్లో రోడ్డు నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవు.

తణుకు సంత మార్కెట్‌లో గత ప్రభుత్వం ఆధునిక చేపల మార్కెట్‌ నిర్మాణం చేపట్టింది. తర్వాత ఐదేళలో కేవలం పినిషింగ్‌ పనులు, విద్యుత్‌, నీటి సౌకర్యాలు కల్పించలేకపోయారు.

వైసీపీ ప్రభుత్వం చేపట్టిన పనులు మధ్యలోనే ఆగిపోయాయి. బాలురున్నత పాఠశాల్లో నిర్మించిన ఇండోర్‌ స్టేడియం నిర్మాణాలు కూడా మధ్యలో నిలిచిపోయాయి.

Updated Date - Apr 28 , 2024 | 12:32 AM