Share News

ఎన్నికలల ఉండి

ABN , Publish Date - Apr 25 , 2024 | 11:59 PM

ఉండి నియోజకవర్గంలో ఎన్నో ఎన్ని‘కలలు’ కొల్లేరు తీరంతో పాటు గోదావరి కాల్వల శివారు ప్రాంతం కావడంతో నీరు పుష్కలమని భావిస్తారు. నియోజకవర్గం మొత్తం గ్రామాలు తాగునీటికి కటకటలాడతాయి.

ఎన్నికలల ఉండి
శిథిలావస్థలో యండగండి లాకులు

సాగునీరు లేదు

ఆక్వా రైతులకు విద్యుత్‌ షాక్‌

పాదయాత్ర హామీలు గాలికొదిలేశారు

ఉండి నియోజకవర్గంలో ఎన్నో ఎన్ని‘కలలు’ కొల్లేరు తీరంతో పాటు గోదావరి కాల్వల శివారు ప్రాంతం కావడంతో నీరు పుష్కలమని భావిస్తారు. నియోజకవర్గం మొత్తం గ్రామాలు తాగునీటికి కటకటలాడతాయి. సాగునీటికి రైతులు ఎదురు చూస్తారు. వరదలు, వర్షాలకు మునిగిపోతారు. బ్రిటిష్‌ కాలంలో నిర్మితమైన యండగండి లాకుల పునర్నిర్మాణానికి జగన్‌ హామీ ఐదేళ్లలో కొట్టుకుపోయింది. నియోజకవర్గంలో మురుగు డ్రెయిన్లు గ్రామాలను, రైతులను ముంచేస్తున్నాయి. భారీ ఎత్తున ఆక్వా ఉత్పత్తులు అందించే రైతులకు జగన్‌ విద్యుత్‌ షాక్‌ ఇచ్చారు. గ్రామాల మధ్య బ్రిటిష్‌ కాలంలో నిర్మితమైన ప్రధాన వంతెనలు శిథిలమయ్యాయి. ఆక్వా ఎగుమతుల రవాణా, ప్రయాణికుల రాకపోకలు భయం భయంగా సాగుతున్నాయి.

ఉండి, కాళ్ళ, ఆకివీడు, ఆకివీడు రూరల్‌

ఆకివీడు మండలంలో అన్ని గ్రామాలకు తాగునీరు అందడం లేదు. వెంకయ్య వయ్యేరు పంట కాల్వను ప్రక్షాళన చేయకపోవడంతో మురుగునీటితోనే దప్పిక తీర్చు కోవాల్సిన పరిస్థితి నెలకొంది. వర్షా కాలం వరి చేలు, నివాస ప్రాంతా లు నీట మునుగుతున్నాయి. ఆకివీడు పరిధిలో టీడీపీ హయాంలో ఇచ్చిన సెంటున్నర పట్టాలను లబ్ధిదారుల నుంచి వెనక్కి తీసుకొని కొందరికి సెంటు చొప్పున ఇచ్చారు. కొందరికీ స్థలాలు ఇవ్వలేదు. డంపింగ్‌ యార్డు లేకపోవడంతో పట్టణ పరిధిలోని ప్రజలు త్రీవ అవస్థలు పడుతున్నారు. భీమవరం – గుడివాడ రాష్ట్రీయరహదారిపై కోపల్లె వద్ద బొండాడ డ్రెయిన్‌పై బ్రిటిష్‌ కాలంలో నిర్మించిన వంతెన శిథిలావస్ధకు చేరింది. కాళ్ళ మండలంలోని అన్ని గ్రామాల నుంచి భీమవరం వైపు నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. జువ్వలపాలెం రాష్ట్రీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు, ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. బొండాడ మురుగు కాలువపై జక్కరం – కోపల్లె వంతెన నిర్మాణానికి రూ.12 కోట్లు నిధులు మంజూరయ్యాయి. వైసీపీ ప్రభుత్వంలో బిల్లుల భయంతో కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో పనులు చేపట్టలేదు. ఉండి మండలంలో దీర్ఘకాలిక ప్రధాన సమస్య యండగండి లాకులు. వరదలు, భారీ వర్షాలకు వేలాది ఎకరాలు ముంపు బారిన పడుతున్నాయి. పాలకులు పునర్ని ర్మాణ పనులు పట్టించుకోవడం లేదు. పంట కాలువలలో గుర్రపుడెక్క తూడు, చెత్త పేరుకుపోయి సాగు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్నాయి. ఆకివీడు మండలంలోని పలు గ్రామాలు మంచినీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్నాయి. ప్రధాన మంచినీటి కాలువ వెంకయ్య వయ్యేరు. ఎగువ మండలాలకు ఇది మురుగు కాలువ. వ్యవసాయం, ఆక్వా, గ్రామాలలోని మురుగు నేరుగా కాలువలోకి వదులడంతో మండల ప్రజలకు కలుషిత నీరే దిక్కు.

బాదుడే.. బాదుడు..

గత ప్రభుత్వ హయాంలో ఆక్వా జోన్‌, నాన్‌ ఆక్వా జోన్‌, చెరువు విస్తీర్ణం పరిమితులు లేవు. ఆక్వా చెరువులకు విద్యుత్‌ సబ్సిడీ అమలు చేశారు. విద్యుత్‌ టాన్స్‌ఫార్మర్లు అతి తక్కువ ధరకే అందించారు. గతంలో 25కెవి విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ రూ. 1.80 లక్షలు కాగా ప్రస్తుతం ఆధర రూ. 3.50 లక్షలు ఉంది. 40, 63కెవి ట్రాన్స్‌ఫార్మర్‌ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఆక్వా ఉత్పత్తుల ధరలు అమాంతం పడిపోయాయి. ఫీడ్‌, సీడ్‌ ధరలు పెరిగిపోయాయి. నాణ్యతలేని సీడ్‌, ఫీడ్‌లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. వైసీపీ పాలనలో ఆక్వా రైతులు తీవ్ర నష్టాలను చవి చూస్తున్నారు, ఆక్వా పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉంది.

ఆక్వా రైతులకు జగన్‌ షాక్‌

ఆక్వాజోన్‌, విస్తీర్ణం పేరుతో ఆక్వారైతులకు ప్రభుత్వం విద్యుత్‌ షాక్‌ ఇచ్చింది. సిఎం జగన్‌ పాదయాత్ర సమయంలో ఆకివీడు మండలం పెదకాపవరం గ్రామంలో ఆక్వా చెరువులు పరిశీలించి ఆక్వా చెరువులకు యూనిట్‌ రూ.1.50కే అందిస్తామని ప్రకటించారు. అధికారంలోనికి వచ్చిన తరువాత కొన్నాళ్ళుపాటు హామీని అమలుచేసారు. కరోనా తరువాత ఈ నిబంధనను అమలును నెమ్మది సడలించారు. ఆక్వాజోన్‌లో ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుందని, విస్తీర్ణం కేవలం 5 ఎకరాలు ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుందని నిబంధనలు తీసుకువచ్చారు. దీంతో ఆక్వా రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. రైతులు సమైక్యమై ఉద్యమించడంతో విస్తీర్ణం10 ఎకరాలకు పెంచారు.

సీఎం హామీలు

1885లో ఉండి పంట కాలువపై యండగండిలో నిర్మించిన లాకులు శిథిలావస్థకు చేరాయి. ఏటా వరదలు, వర్షాలకు వేలాది ఎకరాల పంట మునుగుతోంది. లాకుల పునర్నిర్మాణంపై జగన్‌ హామీ మరిచారు.

ఆకివీడు నుంచి ఉండి మీదుగా భీమవరం జాతీయ రహదారి విస్తరణ పనులు ఇప్పటికీ మోక్షం లభించడంలేదు.

కొల్లేరు తీర ప్రాంతమైన ఆకివీడు మండలంలో అన్ని గ్రామాలకు తాగునీరు పూర్తిస్థాయిలో పరిష్కరించలేదు. సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకులు నిర్మించలేదు.

వెంకయ్య వయ్యేరు పంట కాల్వను ప్రక్షాళన చేయకపోవడంతో మురుగునీటితోనే దప్పిక తీర్చు కోవాల్సిన పరిస్థితి.

వరి సేద్యానికి సాగునీరు అందించి, తుఫాన్‌, అధిక వర్షాలకు వరి చేలలో ముంపునీరు త్వరితగతిన బయటకు వెళ్లేలా కాలువలు, డ్రైయిన్ల పనుల హామీ నెరవేరలేదు.

కోపల్లె – జక్కరం వంతెన నిర్మిస్తామని పాదయాత్ర సందర్భంగా జగన్‌ ఇచ్చిన హామీని నెరవేర్చడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమైంది.

గోదావరి జలాలను రూ.4 వేల కోట్లతో ప్రత్యేక పైపులైను ద్వారా తాగునీరు హామీ కార్యరూపం దాల్చలేదు.

పంట కాల్వలో కలుషిత నీరు

పంట కాల్వలో వచ్చేది మంచినీరు కాదు. ఆక్వా చెరువుల నీరు కలుస్తోంది. ఆ నీటినే మంచినీటి చెరువులలో నింపి తాగాల్సిన దుస్థితి. పచ్చరంగులో నీరు దుర్వాసన వెదజల్లుతోంది. కాల్వలు తూడు, గుర్రపుడెక్కతో పూడిపోయాయి. వేసవిలో కాల్వ ఎండిపోదు. బురద, ఆక్వా నీటితో బ్యాక్టీరియా పెరిగి రోగాలకు కారణమవుతోంది.

– బొడ్డుపల్లి అప్పనపల్లి, కళింగగూడెం

తాగు నీటి కోసం ఎదురుచూపులు

పెరుగుతున్న జనాభాకనుగుణంగా మంచినీటి చెరువులు విస్తీర్ణం పెరగడం లేదు. వేసవి కాలంలో నీటిని నిలువ చేసుకోవడానికి సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులు అత్యవసరం. హమీ బుట్ట దాఖలా అయ్యింది. ఎప్పటి మాదిరిగానే వేసవి వచ్చిందంటే నీటియద్దడి షరా మామూలే. ఇదిలా ఉండగా వర్షాకాలంలో కలుషితమైన నీరే ప్రజలకు దిక్కవుతున్నది.

– నౌకట్ల రామారావు అయిభీమవరం

కాల్వ ముంచేస్తుంది

పంట కాలువ గుర్రపుడెక్క, చెత్తతో పూడిపోయింది. తొలగింపు చర్యలు లేక పంటలు నీట మునుగుతున్నాయి. వర్షాలకు వరదలకు కాల్వ గట్లు కొంతమేర దెబ్బతిన్నాయి. వేసవిలో పనులను చేపట్టి పూర్తిచేయాలి. వర్షాకాలం వచ్చిదంటే చాలు వరిపొలాలు ముంపు బారినపడుతున్నాయి. పండించిన పంట వర్షార్పాణం అవుతుంది. రైతులు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి.

పీవీఎస్‌ గోపాకృష్ణంరాజు, రైతు, యండగండి

Updated Date - Apr 26 , 2024 | 12:00 AM