Share News

రెండేళ్లలో రూ.1,000 కోట్ల టర్నోవర్‌

ABN , Publish Date - Apr 17 , 2024 | 02:14 AM

కంఫర్ట్‌- టెక్‌ బ్రాండ్‌, స్లీపింగ్‌ సొల్యూషన్స్‌ సంస్థ ది స్లీప్‌ కంపెనీ.. దేశవ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించేందుకు సిద్ధమవుతోంది. కార్యకలాపాల విస్తరణలో భాగంగా...

రెండేళ్లలో రూ.1,000 కోట్ల టర్నోవర్‌

ది స్లీప్‌ కంపెనీ టార్గెట్‌

హైదరాబాద్‌: కంఫర్ట్‌- టెక్‌ బ్రాండ్‌, స్లీపింగ్‌ సొల్యూషన్స్‌ సంస్థ ది స్లీప్‌ కంపెనీ.. దేశవ్యాప్తంగా కార్యకలాపాలు విస్తరించేందుకు సిద్ధమవుతోంది. కార్యకలాపాల విస్తరణలో భాగంగా కంపెనీ హైదరాబాద్‌లో 75వ స్టోర్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ది స్లీప్‌ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు ప్రియాంక సలోట్‌ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది కాలంలో మొత్తం స్టోర్ల సంఖ్యను 200కు చేర్చాలని నిర్ణయించినట్లు చెప్పారు. మెట్రో నగరాలతో పాటు ద్వితీయ శ్రేణి నగరాల్లో ఈ స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కంపెనీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో 12 స్టోర్లను నిర్వహిస్తోందని, ఇందులో 8 స్టోర్లు హైదరాబాద్‌లో ఉండగా మిగిలిన స్టోర్లు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, వరంగల్‌ నగరాల్లో ఉన్నాయన్నారు. విస్తరణలో భాగంగా వచ్చే ఏడాది మార్చి నాటికి తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 16 స్టోర్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రియాంక వెల్లడించారు. దేశీయ మ్యాట్రెసెస్‌ మార్కెట్‌ రూ.16,000 కోట్లుగా ఉండగా అందులో బ్రాండెడ్‌ కంపెనీల వాటా రూ.6,000 కోట్లుగా ఉందన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ టర్నోవర్‌ రూ.360 కోట్లుగా ఉందని, వచ్చే రెండేళ్ల కాలంలో ఇది రూ.1,000 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు ప్రియాంక తెలిపారు. కాగా కంపెనీ మొత్తం రెవెన్యూలో తెలుగు రాష్ట్రాల వాటా 15 శాతంగా ఉందని పేర్కొన్నారు.

Updated Date - Apr 17 , 2024 | 02:20 AM