Share News

పట్టణాలను మించిన గ్రామీణ వినియోగం

ABN , Publish Date - May 08 , 2024 | 04:41 AM

ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికానికి దేశీయ ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ విక్రయాల పరిమాణంలో 6.5 శాతం వృద్ధి నమోదైందని నీల్సన్‌ఐక్యూ తాజా నివేదిక..

పట్టణాలను మించిన గ్రామీణ వినియోగం

ఐదు త్రైమాసికాల్లో ఇదే తొలిసారి: నీల్సన్‌ఐక్యూ

న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికానికి దేశీయ ఎఫ్‌ఎంసీజీ పరిశ్రమ విక్రయాల పరిమాణంలో 6.5 శాతం వృద్ధి నమోదైందని నీల్సన్‌ఐక్యూ తాజా నివేదిక వెల్లడించింది. విక్రయాల విలువపరంగా వృద్ధి 6.6 శాతంగా ఉంది. అంతేకాదు, గడిచిన ఐదు త్రైమాసికాల్లో తొలిసారిగా గ్రామీణ భారత వినియోగం పట్టణ మార్కెట్‌ను మించిపోయిందని ఆ నివేదికలో తెలిపారు. మార్చి త్రైమాసిక వినియోగ వృద్ధికి ఆహారంతోపాటు ఆహారేతర విభాగాలూ దోహదపడ్డాయని, ఆహారోత్పత్తులతో పోలిస్తే ఆహారేతర విభాగ వినియోగంలో దాదాపు రెండంకెల వృద్ధి నమోదైందని పేర్కొంది. సమీక్షా కాలానికి హోమ్‌కేర్‌, పర్సనల్‌ కేర్‌ విభాగాల పనితీరు ఆహారోత్పత్తుల విభాగాన్ని మించిపోయిందని నీల్సన్‌ఐక్యూ కస్టమర్‌ సక్సెస్‌ ఇండియా హెడ్‌ రూసెవెల్ట్‌ డిసౌజా తెలిపారు. అంతేకాదు, పట్టణ మార్కెట్‌, ఆధునిక ఉత్పత్తుల వినియోగం మందగించగా.. గ్రామీణ మార్కెట్‌, సంప్రదాయ ఉత్పత్తుల వినియోగం పెరిగిందన్నారు.

వినియోగ ట్రెండ్‌లో స్పష్టమైన విభజన: యూబీఎస్‌ భారత వినియోగ ట్రెండ్‌లో స్పష్టమైన విభజన కన్పిస్తున్నదని స్విస్‌ బ్రోకరేజ్‌ కంపెనీ యూబీఎస్‌ అంటోంది. దేశంలో ఆర్థిక అసమానతలు మరింత పెరిగాయనడానికి సంకేతమైన ‘కే’(ఆంగ్ల అక్షరం) ఆకార వృద్ధి మున్ముం దూ కొనసాగనుందని తాజా నివేదికలో అభిప్రాయపడింది.

Updated Date - May 08 , 2024 | 04:41 AM