Share News

ప్రశ్నార్థకమవుతున్న ప్రాచీన వారసత్వ నిర్మాణాల పరిరక్షణ

ABN , Publish Date - Apr 18 , 2024 | 02:53 AM

రాజులు, రాజ్యాలు పోయినా వారు నిర్మించిన అద్భుత కట్టడాలు ఆనాటి మహోన్నత సంస్కృతిని మన వారసత్వంగా సగర్వంగా చెప్పుకునేలా చేశాయి. ఆ ప్రాచీన వైభవాన్ని...

ప్రశ్నార్థకమవుతున్న ప్రాచీన వారసత్వ నిర్మాణాల పరిరక్షణ

రాజులు, రాజ్యాలు పోయినా వారు నిర్మించిన అద్భుత కట్టడాలు ఆనాటి మహోన్నత సంస్కృతిని మన వారసత్వంగా సగర్వంగా చెప్పుకునేలా చేశాయి. ఆ ప్రాచీన వైభవాన్ని కాపాడుకోవడం ఇప్పుడు ప్రపంచ మానవాళి బాధ్యత. ఈ బృహత్తరమైన అంశాన్ని గమనించి యునెస్కో 1983లో ప్రతి ఏటా ఏప్రిల్ 18ని ప్రపంచ వారసత్వ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. ప్రపంచ వారసత్వ ప్రదేశాల ప్రాముఖ్యత, చారిత్రక నిర్మాణాలను సంరక్షించడంతో పాటు ప్రజలలో వీటి గురించి అవగాహన, అనురక్తి కలిగించాలనే ఉద్దేశ్యంతో ప్రతి ఏటా వారసత్వ దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. యునెస్కో ఇంతవరకు మన దేశంలో 42 ప్రదేశాలను ప్రపంచ వారసత్వ స్థలాలుగా గుర్తించింది. ఇందులో 34 ప్రదేశాలు సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలుగా, ఏడు సహజసిద్ధమైన అద్భుత ప్రదేశాలుగా, ఒకటి మిశ్రమ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందాయి. సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క రామప్ప దేవాలయం మాత్రమే ఉంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మానవజాతి తమ వారసత్వ సంపదగా పరిరక్షించాల్సిన ప్రదేశాలు, సరైన గుర్తింపునకు నోచుకోని వారసత్వ కట్టడాలు వాటి ఆలనా పాలనా కొరకు ఇంకా ఎదురుచూస్తున్నాయి, అనేకం చారిత్రక శిథిలాలుగా కాలగర్భంలో కలిసిపోతున్నాయి. చారిత్రక సంపద ఇంకా మన తెలుగు రాష్ట్రాలలో మిగిలివున్నా, అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి యునెస్కో పరిశీలనకు పంపడానికి ఆసక్తి చూపే ప్రభుత్వాలు కరువయ్యాయి. పారిస్, వెనిస్, రోమ్ వంటి నగరాలకు ఏ మాత్రం తీసిపోని దీటైన సాంస్కృతీ స్రవంతి నగరాలు మన దేశంలో చాలా ఉన్నాయని, ప్రాచీన మధ్య యుగాలలో మన దేశానికి రాయబారులుగా, వర్తకులుగా వచ్చిన అనేకమంది విదేశీ చరిత్రకారులు వారి రచనలలో పేర్కొన్నా, ఈనాటికీ కొన్ని చారిత్రక నగరాలు సరైన గుర్తింపునకు నోచుకోక, ఆక్రమణలకు బలైపోతూ కాలగర్భంలో కలసిపోతున్నాయి. అయితే వీటి సంరక్షణ బాధ్యతలు తీసుకొనే ప్రజలే సమాజానికి, దేశానికి, ప్రపంచానికి సాంస్కృతిక సంపత్తిని అందించిన వారుగా చరిత్రలో నిలిచిపోతారు. మహోన్నతమైన మన తెలుగు రాష్ట్రాల సాంస్కృతిక, వాస్తు, శిల్పకళా సంపదను భావితరాలకు అందించడం మన అందరి కర్తవ్యం.

గోవిందు సురేంద్ర

(నేడు ‘ప్రపంచ వారసత్వ దినోత్సవం’)

Updated Date - Apr 18 , 2024 | 02:53 AM