Share News

వికాసం, వారసత్వం... మోదీ సంకల్పం

ABN , Publish Date - Apr 18 , 2024 | 02:58 AM

మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకంలో భాగంగా దేశంలోని మొత్తం 46 ప్రముఖ దేవాలయాలలో 1629 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి...

వికాసం, వారసత్వం... మోదీ సంకల్పం

మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ ప్రసాద్ పథకంలో భాగంగా దేశంలోని మొత్తం 46 ప్రముఖ దేవాలయాలలో 1629 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అందులో తెలంగాణలోని మూడు ప్రముఖ పుణ్యక్షేత్రాలున్నాయి. అవి హన్మకొండ, అలంపూర్, భద్రాచలం. యునెస్కో గుర్తింపు సాధించిన రామప్ప ఆలయానికి కేంద్రం నుంచి 62 కోట్లు మంజూరు అయ్యాయి, పనులు వివిధ దశలలో ఉన్నాయి. అలంపూర్ జోగులాంబ శక్తిపీఠానికి కూడా 36.73 కోట్లు మంజూరయ్యాయి.

ఉత్తరాదిన ఉన్న అయోధ్య రామునికి మాత్రమే నిధులు ఇస్తున్నారు, భద్రాచలంలో ఉన్న రాముని గుడికి నిధులు ఇవ్వలేదు అనే మాట కూడా అవాస్తవం. 2022లో ప్రసాద్ పథకంలో భాగంగా భద్రాచలంలో సౌకర్యాల అభివృద్ధి కోసం 41.38 కోట్లు మంజూరయ్యాయి, పనులు వివిధ దశలలో ఉన్నాయి. రామాయణ సర్క్యూట్‌లో భారత రైల్వే నడుపుతున్న ప్రత్యేక భారత్ గౌరవ్ రైల్ అయోధ్యలో ప్రారంభమై నేపాల్‌లోని సీతమ్మ జన్మస్థలం జనకపూర్‌తో పాటు భద్రాచలాన్ని కూడా కలుపుతూ తిరిగి ఢిల్లీలో ముగుస్తుంది. కాబట్టి భద్రాచలాన్ని విస్మరించారనడం అనుచితం.

ఇవి మాత్రమే కాక, హన్మకొండలోని వేయి స్తంభాల గుడిలో ఉన్న మండపం 2006లో తొలగించిన తరువాత మళ్లీ గతంలో మాదిరిగా స్థాపించే పని పూర్తిగా ఆగిపోయింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 11 కోట్ల రూపాయలతో దాని పునర్నిర్మాణాన్ని పూర్తి చేయించి, ఈ ఏడాది మార్చిలో ప్రారంభించారు. వరంగల్ ఫోర్ట్, ఉస్మానియా యూనివర్సిటీ, గోల్కొండ ఫోర్ట్‌లో సౌండ్ అండ్ లైట్ షో ప్రారంభమయ్యాయి. హుస్సేన్ సాగర్ వద్ద వాటర్ స్క్రీన్‌పై కోహినూర్ స్టోరీ పేరుతో లైట్ అండ్ సౌండ్ షో ప్రారంభమయింది. మాదాపూర్‌లో భారత్ కళా మండపం పేరుతో కొత్త ఆడిటోరియానికి శంకుస్థాపన జరిగింది. దేశంలోనే మొదటి జాతీయ శిలాశాసనాల సంగ్రహాలయం హైదరాబాద్‌లో ఫిబ్రవరిలో ప్రారంభమైంది. ఇందులో లక్షకు పైగా చారిత్రక శిలాశాసనాలని భవిష్యత్ తరాల కోసం డిజిటైజ్ చేయనున్నారు.

ఇవన్నీ కూడా భారత్ సాంస్కృతిక వైభవాన్ని పెంపొందించుకోవడానికి ఉద్దేశించినవే. మన పూర్వీకుల సంస్కృతిని తెలుసుకుని మనం కూడా కొనసాగించాలి, అప్పుడే విశ్వంలో మన దేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. వికాస్ భి, విరాసత్ భి (వికాసంతో పాటు వారసత్వం కూడా) అనే మోదీ ప్రభుత్వ సంకల్పం ఇంకా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాం.

భవాని సాగి

Updated Date - Apr 18 , 2024 | 02:58 AM