Share News

వన్యప్రాణి సిబ్బందిని ఎన్నికలకు వాడొద్దు!

ABN , Publish Date - Apr 18 , 2024 | 03:01 AM

తెలుగు రాష్ట్రాలు ఈ సంవత్సరం తీవ్ర వర్షాభావ స్థితిని ఎదుర్కొంటున్నాయి. సాగునీటితో పాటు తాగునీటికి కూడా తీవ్ర కొరత ఏర్పడింది. ఇక పశుపోషకులు పశువుల దాహార్తిని ఎలా తీర్చాలో తెలియక మార్చి నెల నుంచే సతమతమవుతున్నారు...

వన్యప్రాణి సిబ్బందిని ఎన్నికలకు వాడొద్దు!

తెలుగు రాష్ట్రాలు ఈ సంవత్సరం తీవ్ర వర్షాభావ స్థితిని ఎదుర్కొంటున్నాయి. సాగునీటితో పాటు తాగునీటికి కూడా తీవ్ర కొరత ఏర్పడింది. ఇక పశుపోషకులు పశువుల దాహార్తిని ఎలా తీర్చాలో తెలియక మార్చి నెల నుంచే సతమతమవుతున్నారు. అడవులలో తాగునీరు లభ్యం కాక అనేక వన్యప్రాణులు పంటపొలాలు, జనావాసాలలోకి ప్రవేశించి బీభత్సాన్ని కలిగిస్తున్నాయి. విచక్షణా రహితంగా సాగునీరు, హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టుల వల్ల అడవులలోని సహజ జలవనరులు చాలాచోట్ల ఎండిపోతున్నాయి. గత ప్రభుత్వాలు ఇలాంటి దుర్భిక్ష పరిస్థితి నుంచి కాపాడడానికి రిజర్వుడు అడవులలో నిర్మించిన తాగునీటి గుంటలు, ట్యాంకులు, వాయువుతో నడిచే భూగర్భ జలాలను తోడే విండ్‌మిల్స్‌ ఏర్పాట్లు ఇప్పుడు చాలావరకు సరియైన నిర్వహణ లేక శిథిలావస్థకు చేరినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే అంతకంటే బాధ్యతారాహిత్యం వేరొకటి ఉండదు.

వెంటనే ప్రభుత్వాలు స్పందించి యుద్ధ ప్రాతిపదికన మన అడవులలోని చెక్‌డ్యామ్‌లను, చెరువులను, గుంటలను, వాటర్‌ ట్యాంకులను, భూగర్భ జలాలను తోడే విండ్‌మిల్స్‌ను పూర్తిగా పునరుద్ధరించి, ప్రతి వన్యప్రాణికీ తాగునీరు అందేలా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి. వన్యమృగాలకు తాగునీటిని క్రమం తప్పకుండా ట్యాంకర్లతో అడవులలో ఏర్పాటుచేసిన కుండీలలో నింపే విధంగా కట్టుదిట్టమైన పర్యవేక్షణ కింద చర్యలు తీసుకోవాలి.

అయితే గత పది సంవత్సరాలుగా మన అటవీశాఖలో పదవీ విరమణలు తప్ప నియామకాలు లేనందువల్ల క్షేత్రస్థాయి విధులు నిర్వహించే సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఈ స్థితిలో అడవుల్లో విధుల్ని నిర్వహించే సిబ్బందిని ఎన్నికల విధుల నుంచి పూర్తిగా మినహాయించాలి. అప్పుడే వన్యమృగాల సంరక్షణకు ఆటంకాలు ఉండవు. ఈ విషయమై ఎన్నికల కమిషన్‌, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి.

పౌరుల తాగునీటి సరఫరాలోనే ఎన్నో అక్రమాల కథనాలు వింటున్న ఈ రోజుల్లో మారుమూల అడవుల్లోని మూగజీవాలకు కనీస తాగునీటి సరఫరా పట్ల ప్రభుత్వ వ్యవస్థ చిత్తశుద్ధి అనుమానాస్పదంగా ఉండడం బాధాకరం. కాబట్టి జంతు ప్రేమికులు, పర్యావరణ–జీవకారుణ్య సంస్థలు, జీవవైవిధ్యం పట్ల స్పృహ కలిగిన పౌర సమాజం స్వచ్ఛంద సంఘాలుగా ఏర్పడి వన్యప్రాణుల దాహార్తిని తీర్చే కృషిలో పాలుపంచుకోవాలి.

ఎం.వి.జి అహోబలరావు

Updated Date - Apr 18 , 2024 | 03:01 AM