Share News

ఎన్నికల ప్రలోభాలపై జన చైతన్యయాత్ర

ABN , Publish Date - Apr 18 , 2024 | 02:55 AM

డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి ఏప్రిల్‌ 14న నెల్లూరు జిల్లా తానంచర్ల గ్రామంలో మొదలయిన జనచైతన్య యాత్ర ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణ, ఎన్టీఆర్‌ జిల్లా, ఏలూరు, రాజమండ్రి, తూర్పుగోదావరి, అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి...

ఎన్నికల ప్రలోభాలపై జన చైతన్యయాత్ర

డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ జయంతి ఏప్రిల్‌ 14న నెల్లూరు జిల్లా తానంచర్ల గ్రామంలో మొదలయిన జనచైతన్య యాత్ర ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణ, ఎన్టీఆర్‌ జిల్లా, ఏలూరు, రాజమండ్రి, తూర్పుగోదావరి, అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి సాగుతూ చివరకు మే 5న శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడు గ్రామంలో కారల్‌ మార్క్స్‌ జయంతి రోజున ముగుస్తుంది. 21 రోజులపాటు కండలేరు ముంపు గ్రామాలు, దళితుల హత్యాకాండ జరిగిన కారంచేడు, చుండూరులతో పాటు పోలవరం నిర్వాసితుల గ్రామాల సందర్శన, విశాఖ స్టీల్‌ కార్మికులకు సంఫీుభావంతో పాటు, అమరుల స్థూపాలు, మహనీయుల విగ్రహాలను సందర్శించి వారి త్యాగాలను గుర్తు చేసుకుంటుంది. లోక్‌సభకు, నవ్యాంధ్రకు ఏకకాలంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో, రాష్ట్ర పునర్విభజన సందర్భంగా హామీ పడ్డ ప్రత్యేక హోదాతో పాటు నిజమైన ప్రజా ఎజెండాను లేవనెత్తుతూ, సాగే ఈ యాత్రలో భావసారూప్యత కలిగిన శక్తులు, వ్యక్తులు పాల్గొనాలి.

సాక్షాత్తు ప్రధానమంత్రి ప్రారంభించిన రాజధాని అమరావతి నిర్మాణం గందరగోళంలో పడ్డా కేంద్రం నోరు విప్పలేదు. పోలవరంలో ముంపునకు గురైన లక్షలాది ఆదివాసులకు సరైన పరిహారం అందక కన్నీళ్లు తప్ప, నీళ్లు వచ్చిన దాఖలాలు లేవు. పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కుగా నిలిచిపోకుండా కార్పొరేట్ల చౌకబేరానికి బలిపీఠం మీద ఉంచబడింది. రాయలసీమ జిల్లా కర్నూలులో హైకోర్టు కల నెరవేరలేదు. వెనుకబడ్డ ప్రాంతాలు ఉత్తరాంధ్ర–రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ అందనే లేదు. కృష్ణపట్నం ఓడరేవు చౌకగా అమ్ముడయ్యింది. తీర ప్రాంతమంతా కాలుష్య కారక ఫార్మా కంపెనీలు, ఇతరత్రా పరిశ్రమలతో మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. వీటికి తోడు అణువిద్యుత్‌ ప్రాజెక్టులు ఆంధ్ర ప్రజల నెత్తిన పెనుభూతంగా వేలాడుతున్నాయి. బ్రిటిష్‌ కాలం నాటి చుక్కల భూముల సమస్యలకు పూర్తి పరిష్కారం లభించనేలేదు. తితిలీ, మీచౌలీ తుఫానులు కబళిస్తున్నా, ఉప్పు మేటలతో పంటలు నష్టపోతున్నా పరిహారం పొందే పరిస్థితి లేదు. ప్రత్యామ్నాయ రక్షణ ఏర్పాట్లు లేవు. కొల్లేరు ప్రాంత ఆక్రమణకు అడ్డుకట్ట లేదు. అభివృద్ధి వికేంద్రీకరణకు అర్థమే మారిపోతుంది. సంక్షేమం–అభివృద్ధి రెండు కళ్ళుగా వెలగాల్సిన స్థానంలో, ప్రజలను అడుక్కునే వాళ్లుగా దిగజారుస్తున్నారు. వ్యవస్థీకృతమైన అవినీతి ఫలితంగా పేదలు మరింత పేదలుగా దిగజారుతుంటే, కొద్ది శాతం దోపిడీదారుల చేతుల్లో దేశ సంపద కేంద్రీకృతమయ్యింది. ఈ పరిస్థితుల్లో పాలక పక్షాలు–ప్రతిపక్షాలు కేంద్రానికి మోకరిల్లుతుంటే ఎవరు, ఏ విధానాలపై ప్రజలను ఓట్లడుగుతున్నారో ప్రజలకు అంతుబట్టడం లేదు.

‘‘ఆర్థిక ప్రజాస్వామ్యం–రాజకీయ ప్రజాస్వామ్యం–సామాజిక ప్రజాస్వామ్యం’’ అంటూ పిలుపునిచ్చిన డాక్టర్‌ బాబాసాహెబ్‌ కలలన్నీ గత 73 సంవత్సరాలుగా వంచించబడుతూనే ఉన్నాయి. ఆయన కోరినట్టు భూములు అన్నీ రాజ్యం ఆధీనంలోనికి రాలేదు. కులం ప్రాతిపదికన విద్యాలయాలు, గ్రామాల్లో ఓట్లు చీలుతున్నాయి. అందుకే కారల్‌మార్క్స్‌ బోధించినట్టు దున్నేవారికి భూమి చెంది, సంపదపై సమిష్టి అధికారం నెరుపగల శాస్త్రీయ సోషలిస్టు సిద్ధాంతం తప్ప ప్రజలకు మరొక పరిష్కార మార్గం కనిపించడం లేదు. అలాగే డబ్బులకు, మందు సీసాలకు లోబడి ప్రజలు ఓటును అమ్ముకోకూడదు. నూతన ప్రజాస్వామిక విప్లవ సాధనలో భాగమై భూస్వామ్య–సామ్రాజ్యవాద దోపిడీకి తావులేని సమతా రాజ్యాన్ని స్థాపించుకుందాం.

ఆంధ్రప్రదేశ్‌ రైతు–కూలీ సంఘం,

అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య,

ప్రగతిశీల మహిళా సంఘం (స్త్రీ విముక్తి),

అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, PDSU (విజృంభణ)

Updated Date - Apr 18 , 2024 | 02:57 AM