Share News

నివేదికలు, నిజాలు!

ABN , Publish Date - Mar 29 , 2024 | 03:12 AM

వికసిత భారత్‌, అచ్ఛేదిన్‌, అమృత్‌కాల్‌ ఇత్యాది అద్భుతపదజాలంతో ఎన్నికల్లో ఘన విజయాలు సాధించాలని భారతీయ జనతాపార్టీ అనుకుంటూంటే, దేశంలో పరిస్థితులు అంత పచ్చగా ఏమీ లేవని...

నివేదికలు, నిజాలు!

వికసిత భారత్‌, అచ్ఛేదిన్‌, అమృత్‌కాల్‌ ఇత్యాది అద్భుతపదజాలంతో ఎన్నికల్లో ఘన విజయాలు సాధించాలని భారతీయ జనతాపార్టీ అనుకుంటూంటే, దేశంలో పరిస్థితులు అంత పచ్చగా ఏమీ లేవని, పైగా దిగజారిపోతున్నాయని ఇటీవల వెలువడిన నివేదికలు తేల్చేస్తున్నాయి. ఉపాధి దెబ్బతిన్నదనీ, అసమానతలు ఆకాశాన్నంటాయని, సగం బలం అనుకున్న సంతోషానికి కూడా ఈ దేశపౌరుడు నోచుకోవడం లేదని ఆ సూచికలూ సర్వేలు హెచ్చరిస్తున్నాయి. భారతదేశంలో కొందరు పోగేస్తున్న సంపద గురించి, అసంఖ్యాకులైన సామాన్యజనం సంపాదన కృశించిపోవడం గురించి ఎంతోకాలంగా చదువుతున్నదీ, చూస్తున్నదే మరోమారు మన కళ్ళముందు ఆవిష్కృతమైంది.

నోబెల్‌ విజేత థామస్‌ పికెట్టీ సహా నలుగురు ఆర్థికవేత్తలు తయారుచేసిన నివేదికకు ఓ ప్రత్యేకస్థానం ఉంది. బ్రిటీషువాడి ఏలుబడిలో కంటే ఇప్పుడే భారతదేశంలో అసమానతలు అధికంగా ఉన్నాయని ఈ వరల్డ్‌ ఇనీక్వాలిటీ ల్యాబ్‌ అధ్యయనపత్రం హెచ్చరిస్తున్నప్పుడు అవమానం కలగడం సహజం. అందుకే కాబోలు, దానిమీద అనుమానాలు రేపే కార్యక్రమం కూడా వెంటనే మొదలైంది. కానీ, భారతదేశాన్ని ప్రత్యేకంగా తప్పుడు లెక్కలతో తప్పుబట్టడం వల్ల సదరు ఆర్థికవేత్తలకు ఒరిగేదేమీ ఉండదు. పైగా, వారు చెప్పిన విషయాలు మన ఊహకు అందనివీ కావు. ఆదాయ అసమానతల్లో మనదేశం దక్షిణాఫ్రికాలను, దక్షిణమెరికాలను సైతం దాటేసిందని ఈ పత్రం హెచ్చరిస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన తొలిదశాబ్దాల్లో బలహీనుల పక్షాన నిలిచిన దేశం, ఆర్థిక సంస్కరణల అనంతరకాలంలో బిలీయనీర్ల రాజ్యంగా అవతరించిందని చెబుతోంది. ఒకశాతం అపరకుబేరుల దగ్గర నలభైశాతం దేశ సంపద పోగుపడిందని అంటూ, 1982నాటికి వీరి ఆదాయాలు, సంపదలు ఎలా ఉన్నాయో, అనంతర దశాబ్దాల్లో అవి ఎంతవేగంగా వృద్ధిచెందాయో వివరించింది. ఆర్థిక సంస్కరణలతోనూ, అనంతరం ప్రస్తుత పాలకుల ఏలుబడిలోనూ అపరకుబేరుల సంఖ్యలోనూ, వారి ఆదాయాల్లో అనూహ్యమైన పెరుగుదల ఉందని అర్థం. 167 సంపన్న కుటుంబాలమీద ఓ రెండుశాతం అధికంగా పన్నువేస్తే జాతీయ ఆదాయంలో అరశాతం పెరుగుతుందట. గత దశాబ్దిన్నరలోనే అసమానతలు అమితవేగంగా హెచ్చాయని ఈ పత్రం పునరుద్ఘాటించడంతో పాటు శతకోటీశ్వరులమీద విధించే పన్నుల విధానంలోనూ విప్లవాత్మకమైన మార్పులు రావాలని ఆకాంక్షించింది. కానీ, కుబేరులతో పాలకులకు ఉన్న పేగుబంధం తెలిసిందే. ఆర్థిక వ్యత్యాసాలను చక్కదిద్దడానికి ఈ పత్ర రచయితలు చేసిన చక్కని సూచనలు ఈ ప్రభుత్వాలకు పట్టవు. దేశ ఆర్థికరంగం ఎదుగుతున్నదనీ, అగ్రరాజ్యాలను దాటేస్తున్నామని గర్విస్తున్న దశలో, కార్మికశక్తిని సద్వినియోగపరచడంలోనూ, ఉపాధి కల్పించడంలోనూ ఎంతో వెనుకబడివున్నామని మరో నివేదిక హెచ్చరిస్తోంది. శ్రామికశక్తిలో నైపుణ్యాలను పెంచడం, తయారీరంగాన్ని అభివృద్ధిపరచడంతో పాటు మేక్‌ ఇన్‌ ఇండియా వంటి కార్యక్రమాలు ఆచరణలో ఎందుకు విఫలమైనాయన్నది సమీక్షించుకోవడం అవసరం. శ్రామికశక్తిలో దాదాపు సగం ఇంకా వ్యవసాయరంగంమీదే ఆధారపడి బతుకులీడ్వడం సరికాదు. డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌ గురించి ఉపన్యాసాలు ఇచ్చేముందు ఉన్న శక్తిని సద్వినియోగం చేసుకోవడం, మిగతారంగాలకు విస్తరించడం మీద దృష్టిపెట్టాలి. చదువున్నవారు, లేనివారు కూడా ఒకే దుస్థితిలో ఉన్నట్టు ఈ నివేదిక తేల్చింది. పదేళ్ళకాలంలో పాతికకోట్లమంది పేదలు పేదరికం నుంచి విముక్తిపొందారని పాలకులు పనిగట్టుకొని మరీ ప్రచారం చేసుకుంటారు. కానీ, ఉపాధికీ ప్రభుత్వానికీ సంబంధం లేదని కేంద్రప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వాదిస్తారు. ఆర్థికంగా అతివేగంగా ఎదుగుతున్న అత్యధికజనాభా గల ఈ దేశం యువత ఎదుర్కొంటున్న సమస్యను విస్మరించడం ప్రమాదం. మరిన్ని ఉద్యోగాలు ఇవ్వండి, ఉపాధి కల్పించండి అంటూ పరిశ్రమల సంఘాలకు, సమాఖ్యలకు విజ్ఞప్తిచేయడంతో సరిపెట్టకుండా, నిరుద్యోగికతను నిర్మూలించే విషయంలో కలసికట్టుగా పనిచేయడం అవసరం.

పదేళ్ళుగా నరేంద్రమోదీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు పేదల బతుకులను మార్చివేశాయని, పేదరికంగా నుంచి బయటపడవేశాయని భారతీయ జనతాపార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ, ఆకలినుంచి ఆనందం వరకూ ప్రతీ విషయంలోనూ పరిస్థితులు దిగజారాయని, ఇరుగుపొరుగు చిన్నాచితకా దేశాలకంటే మనం దయనీయంగా ఉన్నామని ఇటువంటి నివేదికలు ఎప్పటికప్పుడు గుర్తుచేస్తూనే ఉన్నాయి.

Updated Date - Mar 29 , 2024 | 03:12 AM