Share News

సభ–సందేశం

ABN , Publish Date - Apr 02 , 2024 | 02:38 AM

లోక్‌సభ ఎన్నికలు వేగంగా సమీపిస్తున్న తరుణంలో, ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో ఆదివారం ‘ఇండియా’ కూటమి తన బలప్రదర్శన నిర్వహించింది. బీజేపీని ఓడించి దేశాన్ని గెలిపించాలని ప్రజలకు...

సభ–సందేశం

లోక్‌సభ ఎన్నికలు వేగంగా సమీపిస్తున్న తరుణంలో, ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో ఆదివారం ‘ఇండియా’ కూటమి తన బలప్రదర్శన నిర్వహించింది. బీజేపీని ఓడించి దేశాన్ని గెలిపించాలని ప్రజలకు ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ సభ పిలుపునిచ్చింది. మోదీ నియంతృత్వపాలన అంతం కానిదే ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడసాధించలేదని అంటూ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ఐక్య పోరాటానికి సిద్ధమైంది. క్రికెట్‌ తరహాలో మోదీ మ్యాచ్‌ఫిక్సింగ్‌ చేయబట్టే ఇన్నేసి స్థానాలు గెలుస్తున్నారని లేకుంటే బీజేపీకి 180సీట్లు కూడా దాటవని రాహుల్‌ లెక్కవేశారు. జేబులో కొందరు బిలియనీర్లను పెట్టుకొని, ఐటీ, సీబీఐ, ఈడీ ఇత్యాది కేంద్రప్రభుత్వ సంస్థలను విపక్షనేతలమీద ఆయుధాలుగా వాడుతూ, మీడియాను నియంత్రిస్తూ, ఈవీఎంలను వాడుతూ అధికారంలో కొనసాగుతున్నారే తప్ప మోదీకి నిజంగా అంతటి ప్రజామోదం లేదన్నది సారాంశం. రామ్‌లీలా మైదానంలో విపక్షనేతలు రాముడిని కూడా తలుచుకున్నారు. అధికారం, అపార వనరులు అండగా ఉన్న రావణుడిని యుద్ధంలో అవేమీలేని రాముడు ఓడించినట్టుగా, మోదీ నాయకత్వంలోని బీజేపీని గద్దెదించాలన్నారు. విపక్షపార్టీలకు చెందిన ఇద్దరు ముఖ్యమంత్రుల అరెస్టులు పదిహేడు పార్టీల ఈ ర్యాలీ ఊహించినకంటే బలంగా జరగడానికి ఓ కారణం కావచ్చు. హేమంత్‌ సొరేన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టులకు వ్యతిరేకంగా మాత్రమే ఈ సభ జరుగుతున్నట్టుగా కనిపించకూడదని, ప్రమాదంలో పడిన ప్రజాస్వామ్య పరిరక్షణకు ఇండియా కూటమి కట్టుబడినట్టుగా సందేశం ఉండాలని కాంగ్రెస్‌ చెప్పిన హితవు మేరకు, కటకటాల వెనుక ఉన్న కేజ్రీవాల్‌ కటౌట్లను తీసివేయడం సహా ఆమ్‌ ఆద్మీ పార్టీ ఈ సభా నిర్వహణలో చాలా ప్రజాస్వామికంగా వ్యవహరించిందట.

ఇండియా కూటమికి పునాదులు పడి దాదాపు తొమ్మిదినెలలు అవుతున్నది. ముంబైలో జరిగిన సభకు విపక్షనేతలు అనేకమంది హాజరైనప్పటికీ, అది ప్రధానంగా రాహుల్‌ న్యాయ యాత్రతో ముడిపడిన వ్యవహారంగా ప్రజలకు కనిపించింది. ఇప్పటి సదస్సులో కూటమిలోని అన్ని పార్టీల ప్రాతినిధ్యమూ ఉన్నట్టే. మమతాబెనర్జీ స్వయంగా రాకపోయినప్పటికీ, ఆమె సందేశాన్ని ఆ పార్టీ ప్రతినిధి చదివి వినిపించారు. పశ్చిమబెంగాల్‌లో కాంగ్రెస్‌తోనూ, వామపక్షాలతోనూ సీట్ల సర్దుబాటుకు ససేమిరా అంటున్న తృణమూల్‌ పార్టీ ఈ సదస్సు ద్వారా తాను ఇప్పటికే, ఎప్పటికీ కూటమిలో భాగస్వామినేనంటూ ప్రకటించడం ఓ విచిత్రం, విశేషం. జైళ్ళలో ఉన్న కేజ్రీవాల్‌, హేమంత్‌ సొరేన్‌ తరఫున వారి భార్యలు ఈ ర్యాలీలో పాల్గొని, తమ తమ పార్టీల అజెండాలకు అనుగుణంగా సందేశాలు, ఎన్నికల హామీలు ఇవ్వడం అటుంచితే, ముందువరుసలో రెండు ఖాళీ కుర్చీలు ఉంచడం ద్వారా ఈ సభ తన నిరసనను వినూత్నంగా ప్రకటించింది. మోదీ నిరంకుశ విధానాల కారణంగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఎన్నికల వేళ ప్రజలకు దూరంగా ఉండిపోవాల్సి వచ్చిందని చెప్పేందుకు ఇది ఉపకరిస్తుంది.

పదేళ్ళుగా అధికారంలో ఉన్నపార్టీ నిజానికి ఈపాటికే అవినీతి విషయంలో ఆత్మరక్షణలో పడాలి. కానీ, మోదీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా అవినీతిని ఎన్నికల ఆయుధంగా మార్చుకొని విపక్షనేతలమీద కేసులు పెడుతోంది, వారిని జైళ్ళలోకి నెడుతోంది, అందుకు తన అధీనంలో ఉన్న సంస్థలను వాడుతోంది. విపక్షపార్టీలు ఇంకా ఆత్మరక్షణలోనే ఉంటూ అవినీతి ఆరోపణలను ఖండించాల్సివస్తున్నది.

సభలో కూటమి నేతలు అధికారపక్షంమీద చేసిన రాజకీయ విమర్శలను అటుంచితే, దాదాపు నేతలందరూ ప్రజల దైనందిన జీవితాలకు ఉపకరించే చాలా అంశాలను ప్రస్తావించారు, నిర్దిష్టమైన హామీలు కూడా ఇచ్చారు. ఉపాధిలేమి, రైతులకు కనీస మద్దతుధర, ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు ఇత్యాదివి ప్రస్తావనకు రావడం, కూటమి ఉమ్మడి ఎజెండాగా కనిపించడం బాగుంది. ఢిల్లీ పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినప్పటికీ, పరిమితులు విధించినప్పటికీ, ర్యాలీలో ప్రజలు లక్షలాదిగా పాల్గొన్నారని విపక్షనేతలు సంతోషిస్తున్నారు. ర్యాలీ విజయవంతమైనప్పటికీ, కొన్ని చోట్ల సీట్ల సర్దుబాటు సహా చాలా అంశాలను ఇండియా కూటమి ఇంకా పరిష్కరించుకోవాల్సి ఉంది. ఖర్గే హెచ్చరించినట్టుగా, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, విభేదాలన్నింటినీ పక్కనబెట్టి కలసికట్టుగా కదులుతున్నట్టు కనిపించడం ఎంతో ముఖ్యం.

Updated Date - Apr 02 , 2024 | 02:38 AM