Share News

మాటల వెనుక మాయలు

ABN , Publish Date - Mar 30 , 2024 | 05:00 AM

న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని, ఎన్నికలవేళ ఆ సర్వోన్నత వ్యవస్థను అప్రదిష్ఠపాల్జేసే యత్నాలు సాగుతున్నాయంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌కు ఏకంగా...

మాటల వెనుక మాయలు

న్యాయవ్యవస్థకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని, ఎన్నికలవేళ ఆ సర్వోన్నత వ్యవస్థను అప్రదిష్ఠపాల్జేసే యత్నాలు సాగుతున్నాయంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌కు ఏకంగా ఆరువందలమంది న్యాయవాదులు మూకుమ్మడి లేఖ రాయడం చిన్న విషయమేమీ కాదు. ఎంతో కీలకమైన అంశాల్లో అన్నివందలమంది ఏకాభిప్రాయాన్ని కలిగివుండటం, వాటిని గుదిగుచ్చి, న్యాయవ్యవస్థను రక్షించుకోండంటూ సీజీఐకు హెచ్చరికలాంటి జాగ్రత్తలు చెప్పడం విశేషమే. న్యాయవ్యవస్థ పరువును దిగజార్చేందుకు, దానిని భయంలో ముంచెత్తి తీర్పులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్న బృందాలు, కుట్రదారులు, విచ్ఛిన్నకరశక్తులు ఎవరో ఈ లేఖలో లేదు కానీ, దానిని సంధించిన ఆరువందలమందిలో ప్రముఖంగా కనిపించిన పేరు హరీశ్‌ సాల్వే. ప్రముఖులపక్షాన మాత్రమే వాదించే ఈ ప్రముఖ న్యాయవాది ఇటీవల ఎన్నికలబాండ్ల కేసులో గుప్తదానాల గుట్టును సుప్రీంకోర్టు బహిరంగపరచడాన్ని వ్యతిరేకించిన విషయం తెలిసిందే. న్యాయవ్యవస్థకు కొన్ని హెచ్చరికలు, కాసిన్ని జాగ్రత్తలు చెప్పిన ఈ లేఖమీద ప్రధాని నరేంద్రమోదీ స్పందించడం మరో విశేషం. ఆయన దానిని బేఖాతరుచేసివుంటే ఇంత ప్రాధాన్యత రాకపోయివుండేది. కానీ, ఆ లేఖను ఆయన సద్వినియోగం చేసుకున్నారు. వేధించడం కాంగ్రెస్‌కు అనాదిగా ఉన్న అలవాటేనంటూ, ఐదుదశాబ్దాలక్రితమే ‘కమిటెడ్‌ జుడీషియరీ’ని ఆ పార్టీ కోరుకుందని విమర్శించారు. ఇందుకు జవాబుగా కాంగ్రెస్‌ కూడా మోదీ హయాంలో న్యాయవ్యవస్థలో సంభవించిన వివిధ పరిణామాలను గుర్తుచేసి, ప్రతీవ్యవస్థనూ మీరే భ్రష్టుపట్టించేశారంటూ ప్రతివిమర్శలు చేసింది.

లేఖలో ఉన్న అంశాల లోతుపాతుల్లోకి పోవాల్సిన అవసరం లేదు కానీ, న్యాయవ్యవస్థను, దాని స్వతంత్రతను కాపాడటానికి ఉద్దేశించే ఎటువంటి ప్రయత్నమైనా అది సద్బుద్ధితో జరిగినపక్షంలో ప్రశంసించాల్సిందే. లేఖలోని అంశాలకంటే దానిని మోదీ ముందుకు తోయడం, ఆ తరువాత రవిశంకర్‌ ప్రసాద్‌ మీడియా సమావేశంలోనూ అవే విమర్శలు కొనసాగించడంతో చాలామందికి ఈ లేఖ వెనుక ఉన్న లక్ష్యాలమీద అనుమానాలు కలగడం మొదలైంది. కుట్రదారులు, వెన్నుపోటుదారుల నుంచి న్యాయవ్యవస్థను రక్షించేందుకు ఉద్దేశించినట్టుగా ఉపరితలంలో కనిపిస్తున్న ఈ వ్యవహారాన్ని తెరవెనుకనుంచి నడిపిస్తున్నది పాలకులేనని వారి అనుమానం. న్యాయవ్యవస్థను కొందరు శాసిస్తున్నారని, తీర్పులను ప్రభావితం చేస్తున్నారని, ముఖ్యంగా అవినీతి కేసుల్లో ఇరుకున్న రాజకీయనాయకుల విషయంలో కోర్టులమీద ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఒత్తిడితెస్తున్నారంటూ ఈ లేఖలో ప్రస్తావించిన అంశాలు ఇప్పటి రాజకీయవాతావరణంలో ఎవరి పక్షాన ఎవరు చేస్తున్న ఆరోపణలో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.

తీర్పులను ప్రభావితం చేసేందుకు కొంతమంది కుట్రలు చేస్తున్నారన్నది లేఖలో ఓ ప్రధాన ఆరోపణ. నిజానికి, సుదీర్ఘకాలంగా సర్వోన్నతన్యాయస్థానం నుంచి కేంద్రంలోని ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడవేసే తీర్పులేవీ వెలువడలేదు. ఇటీవల ఎన్నికలబాండ్ల కేసులో తీర్పు ప్రజాస్వామ్య ప్రియులకు కాస్తంత ఉపశమనాన్ని ఇచ్చింది. బీజేపీ ప్రభుత్వం ఏరికోరి తెచ్చుకున్న ఈ విధానం రాజ్యాంగవ్యతిరేకమనీ, అప్రజాస్వామికమని అంటూ సుప్రీంకోర్టు దానిని కొట్టివేసింది. అంతటితో ఊరుకోకుండా ఆ గోప్యతను బద్దలు కొట్టే దిశగా పట్టుబట్టిమరీ జారీ చేసిన ఆదేశాలు పాలకులను ఇబ్బందిలో పడవేసిన మాట నిజం. అధికారపక్షానికి మొత్తంగా ఎంత ముట్టిందన్నది అటుంచితే, ఎవరు ఎప్పుడు ఆ పార్టీకి ఎందుకు విరాళం ఇచ్చారన్న అనంతర విశ్లేషణలు దానిని ఎన్నికల ముందు ఇబ్బంది పెడుతున్నాయి. ఎన్నికలబాండ్ల కేసులో హరీశ్‌ సాల్వే పాత్ర అందరికీ తెలుసు. ఇక, ఈ బాండ్ల లావాదేవీలను బహిర్గతం చేయకుండా, కార్పొరేట్‌ కంపెనీలకూ రాజకీయపార్టీలకు మధ్య ఉన్న లాలూచీ బయటపడకుండా సుప్రీంకోర్టును నియంత్రించాల్సిందిగా రాష్ట్రపతికి లేఖరాసిన మరో వ్యక్తి ఈ లేఖమీద సంతకం చేసిన సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఆదిష్‌ అగర్వాలా. రామమందిరం ఆరంభోత్సవంనాడు న్యాయవ్యవస్థకు సెలవుదినంగా ప్రకటించాలని అభ్యర్థించిన బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ చైర్మన్‌ సంతకం చేసినవారిలో మరొకరు. ఈవీఎంలు, సీఏఏ ఇత్యాది కీలకమైన కేసుల్లో సర్వోన్నత న్యాయస్థానం నుంచి రాబోయే రోజుల్లో తీర్పులు వెలువడాల్సి ఉంది. పౌరసమాజం, మీడియా, రాజకీయం ఇత్యాది రంగాలనుంచి అరెస్టయిన అసమ్మతి గొంతులను అది వింటున్నది. న్యాయవ్యవస్థను ప్రభావితం చేయడానికో, హద్దుల్లో ఉంచడానికో పాలకపక్షంనుంచి ఏవో ప్రయత్నాలు జరగడం కొత్తేమీ కాదు. ప్రజాస్వామ్య పరిరక్షణకు ఉద్దేశించిన భవిష్యత్‌ తీర్పులను ఈ విన్యాసాలు ప్రభావితం చేయకూడదని సామాన్యుడి ఆకాంక్ష.

Updated Date - Mar 30 , 2024 | 05:00 AM