Share News

తక్కువ చోరుడినే ప్రేమించాలి, తప్పేదేముంది?

ABN , Publish Date - Apr 18 , 2024 | 03:10 AM

ఆలోచనాపరుడైన ఒక మిత్రుడు ఇట్లా ప్రశ్నించాడు. ‘‘ఎంత కాలం ఇట్లా జనాన్ని మభ్యపెడతారు? వాళ్ల కంటె వీళ్లు నయం అని, ఇద్దరిలో ఒకళ్లు ఎక్కువ చెడ్డవాళ్లు అని ఎంత కాలం రాస్తూ ఉంటారు?...

తక్కువ చోరుడినే ప్రేమించాలి, తప్పేదేముంది?

ఆలోచనాపరుడైన ఒక మిత్రుడు ఇట్లా ప్రశ్నించాడు. ‘‘ఎంత కాలం ఇట్లా జనాన్ని మభ్యపెడతారు? వాళ్ల కంటె వీళ్లు నయం అని, ఇద్దరిలో ఒకళ్లు ఎక్కువ చెడ్డవాళ్లు అని ఎంత కాలం రాస్తూ ఉంటారు? అందరూ దొంగలే అని చెప్పే సమయం వచ్చిందని అనిపించడం లేదా?’’ ఇంత నిర్మొహమాటంగా నిలదీస్తే నీళ్లు నమలకుండా ఉండడం కష్టమే. ‘‘ఈ నాయకులను చూడండి, ఇంతకాలం అధికారం అనుభవించి, ఇప్పుడు ఓడిపోగానే క్షణం కూడా ఆగకుండా గోడదూకేస్తున్నారు. ఎవళ్లకీ నీతి లేదు, నియమం లేదు. సిద్ధాంతం అ‍సలే లేదు. క్రమశిక్షణ గురించి, సంస్కృతి గురించి గప్పాలు కొట్టే పార్టీలోకైనా, రాజ్యాంగాన్ని రక్షిస్తామని, ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరిస్తామని చెప్పే మరో పార్టీలోకైనా నిస్సిగ్గుగా దూకేస్తున్నారు, ఆ పార్టీలు కూడా అంతే బరితెగింపుగా చేర్చుకుంటున్నాయి.. ఏ రాయితో కొట్టుకున్నా పళ్లూడిపోతాయని తెలియడం లేదా? ఒకడిని దించి మరొకడిని ఎక్కిస్తే ఉద్ధరింపు ఏమీ జరగదని తెలిసివచ్చింది కదా?’’ మిత్రుడి ఆగ్రహావేదన సుదీర్ఘంగా కొనసాగింది.

చాదస్తమేమీ కాదు. ఆలోచించవలసిన విషయమే. దుష్పరిపాలనలో ప్రజలు ఎప్పుడూ తక్షణ ఉపశమనాన్ని కోరుకోవడం, అతి కొద్దికాలంలోనే ఊరట వెనక్కి తగ్గి తిరిగి ఆశాభంగాలూ కొత్త ఆవేదనలూ మొదలు కావడం ఇటీవలి చరిత్రలో చూస్తూనే ఉన్నాం. ప్రత్యామ్నాయాలు పరిమితంగా ఉండడం వల్ల పాత ప్రతినాయకులనే కొత్త కథానాయకులుగా ఎంపికచేసుకోవలసిన పరిస్థితి. ఎన్నికల ప్రజాస్వామ్యంలోని ఈ డొల్లతనం ఓటర్లకు నిజంగా తెలియదా? అందరూ అందరే అని, ఎవరూ సమూలంగా సమాజాన్ని మార్చివేయరని తెలియదా? తెలిసినా, ఎక్కువ మంచిని కాక, తక్కువ చెడును ఎంచుకోవలసిన దుస్థితిలోకి పడిపోయారా? రాజకీయాలను వ్యాఖ్యానించేవారు కానీ, మంచి చెడ్డలను చర్చించేవారు కానీ, అంతకు మించి ఏమి చెప్పగలరు?

విశాల ప్రజానీకం మాత్రమే కాదు, వారి తరఫున, వారి శ్రేయస్సు కోసం ఆలోచిస్తున్నామనుకునేవారు సైతం, తక్షణ ప్రమాదాలను పరిగణనలోకి తీసుకోవలసి వస్తుంది. ఏదో ముంచుకు వస్తుంది, ఆ గండాన్ని తప్పించుకోవడానికి అనేక పరిమితులను అధిగమించి, ఒక ఆపద్ధర్మ ఆచరణకు దిగవలసి వస్తుంది. నిన్నటి దాకా ఒకరి పొడ మరొకరికి పడనివారు కూడా బలమైన మూడోశక్తిని ఎదిరించడానికి చేతులు కలుపుతారు. వెదుక్కుని రూపొందించిన ఒకే నినాదాన్ని వల్లె వేస్తారు. ఇటువంటివి అనేకమార్లు జరిగే క్రమంలో, వివిధ పార్టీల మిత్రులు, ప్రత్యర్థులు మారిపోతూ ఉంటారు. ప్రతిసారీ ఏదో ఒక ధర్మయుద్ధం జరుగుతోందన్న భ్రమ కలుగుతుంటుంది. నిజంగా ఆ పోరాటాలలో ప్రజలకు పనికివచ్చే విలువలేవైనా ఉంటాయా? కేవలం, బలహీన ప్రజాస్వామ్యం మీద బలమైన ఆశ కలిగించే విన్యాసాలు మాత్రమేనా?

సుప్రీంకోర్టుతో సహా న్యాయవ్యవస్థ అంతా ఒక తెలియని ఒత్తిడిలో ఉన్నదని తెలుస్తూనే ఉన్నది. విచారణ కూడా ఆరంభం కాని కేసుల్లో ఆరేడేళ్ల నుంచి సుదీర్ఘ నిర్బంధంలో ఉన్న మేధావులు ఉన్నారు. ప్రబీర్ పురుకాయస్థ అనే ప్రముఖ పాత్రికేయుడు, ప్రజాస్వామ్యవాది పోయిన ఏడాది అక్టోబర్ నుంచి నిర్బంధంలోనే ఉన్నారు. దర్యాప్తు సంస్థల దాడులకు, అధికారపార్టీ ఎలక్టోరల్ బాండ్లకు అవినాభావ సంబంధం ఉన్నట్టుగా పచ్చిగా తెలిసిపోతూ ఉన్నా, భారతీయ సమాజం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నది. దేశం కోసం ధర్మం కోసం ఏమైనా మాట్లాడవచ్చునని భావించే అధినాయకుడు, ప్రజాస్వామ్యం మనదేశంలోనే పుట్టిందని, రాజ్యాంగంలోనే సనాతన ధర్మం ఉన్నదని ఉద్ఘాటిస్తున్నారు. జాతీయ మీడియా పరవశించిపోయి, నాయకుడి ప్రతిమాటకీ పవిత్రార్థాలను ప్రతిపాదిస్తోంది. చర్చలు, ప్రజాస్వామ్య ప్రక్రియలు అన్నీ వృథా అని, కశ్మీర్ మీద సాహస, కఠిన చర్య తీసుకుని నిర్బంధశాంతిని సాధించారు. పెట్టుబడులకు కొత్త స్వర్గం తెరచుకున్నదని కార్పొరేట్ లోకం సంబరపడింది. ఛత్తీస్‌గఢ్‌లో చర్చలకు రమ్మని ఒకవైపు ఆహ్వానిస్తూనే, మూడు నెలల్లో వందమందిని నిర్మూలించి, ఆదివాసుల నుంచి అడవికి విముక్తి సాధించే ప్రయత్నం చేస్తున్నారు. మధ్యభారతంలోని దండకారణ్యంలో గనివనరులకు ఇక రెక్కలు రావచ్చు. బలశాలి ప్రభుత్వంలోనే ఇవన్నీ సాధ్యమని బాహాటంగానే చెప్పుకుంటున్నారు. మరింత బలం ఇమ్మని, అసలు చిత్రం చూపిస్తామని ఆశపెడుతున్నారు.

ఇవన్నీ సరే, మరి ఈ బాహుబలి పార్టీ మీద పోరాడే కూటమికి, శక్తి లేకపోవచ్చు కానీ, సంకల్పం అయినా ఉన్నదా? కోరలూ కొమ్ములూ తానే తొడిగితే, బీజేపీ హయాంలో విషాన్ని కూడా నింపుకున్న ఊపాను రద్దు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో కాకపోయినా చెవిలో అయినా చెప్పగలదా? న్యాయవ్యవస్థ వెన్నెముకను సరిచేయగలదా? జైళ్లలో దట్టించిపెట్టిన అసమ్మతికి స్వేచ్ఛ ఇవ్వగలదా? దేశం నాడీవ్యవస్థ అంతటా వ్యాపించిన అసహన, విద్వేష, విభజన కాలుష్యాన్ని ప్రక్షాళన చేయగలదా? కాంగ్రెస్ పార్టీ కానీ, అది భాగంగా ఉన్న ఇండియా కూటమి కానీ, అటువంటి మాటలు మాట్లాడగలిగే శక్తి కూడా లేని నీరసస్థితిలో ఉన్నాయి. వారికి జవసత్వాలు వస్తే వాళ్లూ ఎట్లా వ్యవహరించగలరో మనకు తెలుసు. బలహీన పక్షమని సానుభూతి చూపవచ్చును కానీ, బాధితులై ఉండీ ప్రతిఘటించలేని భీరుత్వాన్ని మాత్రం ఎట్లా అర్థం చేసుకోగలం? ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా పెద్దగా ఎటువంటి మార్పూ అనుభవంలోకి రాని ప్రజాశ్రేణులే ఇప్పుడు దేశంలో, ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని కూడగడుతున్నాయి. భ్రమతో కాక, అవసరంతో అవగాహనతో కలసి నడుస్తున్నాయి.

అన్నమైతేనేమిరా, మరి, సున్నమైతేనేమిరా అని పాడుకునే బైరాగి కూడా, తినడానికి ఏదో ఒకదాన్ని ఎంచుకోవలసిందే. పరమ తాత్విక ప్రశ్నలకు కూడా ఒక్కోసారి పచ్చి భౌతికమయిన సమాధానాలే ఉంటాయి. అన్ని రాజకీయ పక్షాలూ ఒకేతాను ముక్కలే అని, అందరు రాజకీయవాదుల డిఎన్ఎ ఒక్కటే అని స్థూల సత్యాలుగా భావించడం ఓకే. కానీ, ఒక్కో ముక్కను ఒక్కోసారి అధికారానికి తీసుకువచ్చే చిన్న అవకాశం ఓటర్లకు ఉన్నది. ఓటరు అభీష్ఠాన్ని హైజాక్ చేసే అనేకమార్గాల వల్ల, ఉన్న చిన్నపాటి ఎంపిక అవకాశం కూడా గాలికిపోతోంది. అయినప్పటికీ, ఎన్నికల వేళ, ప్రజల తరఫున ఒక ఎజెండాను ప్రచారంలో పెట్టి, దానికీ ఓటింగ్‌కూ సాధ్యమైనంతగా ముడివేయడానికి వీలయిన చోట్ల ప్రజాస్వామిక శక్తులు పనిచేస్తూ వస్తున్నాయి.

ప్రజాస్వామ్యం అంటే కేవలం ఎన్నికలు మాత్రమే కాదు. సమస్త ప్రజాజీవనరంగాలలోను అమలుజరగవలసిన విలువ ప్రజాస్వామ్యం. సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా, ప్రజాస్వామ్యం సమానత్వ భావనకు, సమానావకాశాలకు ఒక ప్రాతిపదిక. ప్రజలు తమ వ్యవహారాలను నిర్వహించడానికి కావలసిన అధికారరాజకీయ శ్రేణిని ఎంచుకుంటారు. ప్రజల పేరు మీద అధికారానికి వచ్చినవారు, అధికారయంత్రాంగం, ఇతర పాలనా వ్యవస్థల ద్వారా గౌరవప్రదమైన సామూహిక సంక్షేమాన్ని, అభివృద్ధిని సాధించాలి, నిర్వహించాలి. కానీ, ప్రభుత్వాలు ఏమిచేస్తున్నాయి? ప్రజలందరి సమష్టి సంపద అయిన వనరులను స్వార్థ వ్యక్తులకు, సంస్థలకు మళ్లిస్తున్నాయి. ప్రతిప్రభుత్వ కార్యక్రమంలోనూ ప్రజల సొమ్ము అపహరణకు వీలు కల్పిస్తున్నాయి. సామాజిక, ఆర్థిక అంతరాలను కాపాడడానికి అణచివేతను ప్రయోగిస్తున్నాయి. ఈ అసమాన, అన్యాయ సామాజిక, రాజకీయ వ్యవస్థ నుంచి ఆవిర్భవించి, దాని నియమాలకు లోబడి పనిచేసే రాజకీయపక్షాలు, విప్లవాత్మకంగా వ్యవహరిస్తాయని ఆశించలేము. ఎన్నికల సమయంలో మాత్రమే తమ అభీష్ఠాన్ని తెలిపి, ఆ తరువాత ప్రభుత్వాల నుంచి ఆశించడం మాత్రమే చేస్తే, ప్రజలు సాధించేది స్వల్పమే. ప్రజాస్వామ్యాన్ని సకలరంగాలలో అమలుజరిపేందుకు ప్రజలు ప్రయత్నిస్తేనే దాత, గ్రహీత సంబంధం తొలగిపోయి, భాగస్వామ్య భావన ఏర్పడుతుంది.

వర్తమానాన్ని మాత్రమే మదింపు వేస్తే, భారత ప్రజాస్వామ్యం అత్యంత నాసిరకమైన, అమానవీయమైన స్థితిలో ఉన్నది, అయితే, ఇది అంతకు మునుపున్న స్థితి కంటె మెరుగైనదే. గత ఏడున్నర దశాబ్దాలలో భారత ప్రజాస్వామ్యం నాణ్యత క్రమంగా పెరుగుతూ వస్తోంది. బహుశా, ప్రజాచైతన్యం, ప్రజాస్వామిక ఆచరణలు పెరిగినందువల్లనే, ప్రస్తుత ప్రభుత్వాలు హెచ్చు అణచివేతను, క్రూరమైన పాలనావిధానాలను అమలుచేయవలసి వస్తున్నది. ప్రధాన రాజకీయపక్షాలు చెప్పే మాటలు, ఆశయాలు, లక్ష్యాలు మాత్రమే కాక, వివిధ ప్రజా సమూహాలు, శ్రేణులు, సొంతంగా రూపొందించి ప్రకటించే రాజకీయ వాదనలు సమాజంలో బలం పుంజుకుంటున్నాయి. ఎన్నికల ద్వారా కాకుండా, సాటి ప్రజల మద్దతుతో, ప్రభుత్వాలతో సంప్రదింపులతో, పోరాటాలతో తమ ప్రయోజనాలను సాధించుకోవడానికి వివిధ ప్రజాసమాజాలు ప్రయత్నిస్తున్నాయి. అదే క్రమంలో, ఎన్నికల ప్రక్రియలో కూడా తమ ప్రమేయాన్ని పెంచుకోవడానికి ప్రజాస్వామిక శక్తులు మునుపటి కంటె అధికంగా చొరవ చూపుతున్నాయి. ఆ రంగాన్ని వృత్తి రాజకీయనాయకులకు, డబ్బుకు సామాజిక పలుకుబడికి లొంగిపోయే ఓటర్లకు వదిలిపెట్టకూడదని అనుకుంటున్నాయి. ఇదంతా ప్రజాస్వామ్యం మీద అనవసరపు భ్రమలు పెంచుతుందా లేక ఆచరణాత్మకమైన విశ్వాసాన్ని పెంచుతుందా అన్నది చర్చనీయాంశమే.

ఎన్నికల పద్ధతిని పూర్తిగా వ్యతిరేకించి, ఇతరమార్గాల ద్వారానే ప్రజల సాధికారతను సాధిస్తామని నమ్మేవారిని ఖండించనక్కరలేదు. వ్యవస్థను మౌలికంగా మార్చేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను సృజనాత్మకంగా అన్వేషించే ప్రయత్నం కూడా నిరంతరం సాగవలసిందే. ఓటింగ్‌ను నిరాకరించడం అన్నది ఒక విధానప్రకటన. స్వతంత్ర భారతంలో అనేక సందర్భాలలో ఓట్ల బహిష్కరణ ఒక నిరసన రూపంగా వ్యక్తమైంది. కానీ, పూర్తి వ్యవస్థ మీద నిరసనతో జరిగిన వైధానిక బహిష్కరణ అతి బలహీనంగా మాత్రమే ఉన్నది. పైగా, ‌భారత ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనడం రానురాను పెరుగుతోంది. వివిధ నిర్బంధ ప్రలోభాల ఆధారంగా కాక, స్వీయ ఇచ్ఛతో రహస్య ఓటింగ్‌ను వినియోగించుకోవాలనుకునే వారు కూడా పెరుగుతున్నారు. మెరుగైన జీవితాల కోసం ప్రజల ప్రయత్నాలు ఎన్నికల రాజకీయాలతోను, ఉద్యమ రాజకీయాలతోను కూడా కలసి నడుస్తాయి. ఒక్కోసారి ఆ రెండు రకాల రాజకీయాలు కలసి ఉండవచ్చు, మరోసారి అవి ఎదురెదురుగా తలపడవచ్చు. అధికారంలో ఉన్న వారి దౌర్జన్యం నుంచి తప్పించుకోవడంలో ప్రజలకు, ప్రతిపక్షాలకు ఉమ్మడి ప్రయోజనాలుంటాయి. వాటిని సాధించుకునే సందర్భంలో ఉభయపక్షాల మధ్య వైరుధ్యాలు తాత్కాలికంగా విశ్రాంతి తీసుకుంటాయి. ప్రజాస్వామ్య స్థలాలు విస్తరిస్తాయి. ప్రజలే లబ్ధి పొందేలా ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాలి.

ఆపద పెద్దదైనప్పుడు, అందరూ దొంగలే అనే అద్భుత సత్యాన్ని అర్జెంటుగా ప్రకటించవలసిన అవసరం ఏముంది?

కె. శ్రీనివాస్

Updated Date - Apr 18 , 2024 | 03:10 AM