Share News

క్రీస్తు తొలి అద్భుతం

ABN , Publish Date - Apr 19 , 2024 | 05:35 AM

అది గలలియా నదీతీరంలోని ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో వివాహం జరుగుతోంది. పెళ్ళివారి ఆహ్వానం మేరకు తల్లి మరియతో పాటు ఏసు క్రీస్తు కూడా వెళ్ళాడు. వేడుకలకు హాజరయ్యే...

క్రీస్తు తొలి అద్భుతం

దైవమార్గం

అది గలలియా నదీతీరంలోని ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో వివాహం జరుగుతోంది. పెళ్ళివారి ఆహ్వానం మేరకు తల్లి మరియతో పాటు ఏసు క్రీస్తు కూడా వెళ్ళాడు. వేడుకలకు హాజరయ్యే అతిథులకు ద్రాక్షరసం ఇవ్వడం అక్కడ ఆనవాయితీ. అయితే తెచ్చిన ద్రాక్షరసం అయిపోయింది. పేదవారైన వధువు తల్లితండ్రులు తమ పరువు పోతుందనే ఆందోళనలో ఉన్నారు. వారి దుఃఖం తీర్చడానికి... ఏసు క్రీస్తు తన తల్లి సూచన మేరకు ఖాళీ బానల్లో నీళ్ళు పోయించాడు. ఆ నీటిని ద్రాక్షరసంగా మార్చి, అందరిలో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని నింపాడు.

ఖాళీ బానల్లో నీరు పోయించే బదులు... బానలతో ద్రాక్షరసాన్ని కూడా ఆయన సృష్టించి ఉండవచ్చు కదా? నీరు పోయించి, దాన్ని ద్రాక్షరసంగా మార్చడం అవసరమా? కానీ దీనిలో ఒక అంతరార్థం ఉంది. అప్పటివరకూ ఎన్నో మూఢనమ్మకాలు, సమాజ తిరోగమనానికి ఆటంకంగా నిలుస్తున్న పాత పద్ధతులు కొనసాగుతున్నాయి. అవి పాత బానల్లో ఎప్పుడూ పోసే నీళ్ళలాంటివి అయితే... వాటిని ద్రాక్షరసంగా... అంటే కొత్తగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ‘పాతవాటిని ఇప్పటికైనా ప్రయోజనకరంగా పునరుద్ధరించుకుందాం. మానవ అభ్యుదయానికి దోహదం చేసేలా మార్చుకుందాం’ అనే సందేశాన్ని ఇవ్వడం ఏసు ప్రభువు ఉద్దేశం. ఇది ఆయన చేసిన తొట్టతొలి అద్భుతం.

ఇలా ఆయన చేసిన ప్రతి అద్భుతం వెనుక, చెప్పిన ప్రతి ఉపమానం వెనుక ఒక మహత్తర సందేశం దాగి ఉంటుంది. ఆ సందేశాన్ని చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా చెప్పడం ప్రభువు ప్రత్యేకత. సువార్తికులందరూ నేర్వవలసిన మహత్తరమైన కళ. ఆయన ఏ అద్భుతాన్నీ తన ఔన్నత్యాన్ని ప్రకటించుకోవడానికో, ఇంద్రజాల ప్రదర్శనకో చూపలేదు. ఆవశ్యకతను బట్టి... దీనజనోద్ధరణ కోసమే చేశాడు. ఒక్కొక్క అద్భుతంలో ఒక ఆంతర్యం... అన్నిటిలోనూ మానవాళిపట్ల ఆయనకు ఉన్న అపారమైన ప్రేమ కనిపిస్తాయి.

ఈ నేల మీద ఎందరెందరో పుట్టారు. ఈ సమాజాన్ని మార్చడానికి బోధలు చేశారు. కానీ కొందరి ప్రవర్తనలో మాత్రమే ఆ బోధలు ప్రతిఫలించాయి. ఈ విశేషం క్రీస్తులో పుష్కలం, పరిపూర్ణం. బోధకుల మాటలకు, చేతలకు సమన్వయం కుదిరినప్పుడే ప్రజల్లో సంపూర్ణ విశ్వాసం కలుగుతుంది. దైవకార్యాన్ని నెరవేర్చడానికి మానవలోకానికి క్రీస్తు వచ్చాడు. ఆయన చేసిన అద్భుతాలన్నీ మానవజాతి తన మూఢభావాల నుంచి విముక్తం కావాలని, చీకటి నుంచి వెలుగులోకి నడవాలని సంకల్పించినవే. చైతన్యపూరితమైన ఆయన ప్రసంగాలు, నిరక్షరాస్యులైనా అతి సులువుగా గ్రహించేలా చెప్పిన కథలు... ఇప్పటికీ వాడని పూలలా వికసిస్తూనే ఉన్నాయి. సూక్తి సుగంధాలను విరజిమ్ముతూనే ఉన్నాయి. తోటి మనిషి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడాలనే సత్యాన్ని బోధించడానికి శిలువపై ఆయన చేసిన ప్రాణత్యాగం ఒక గొప్ప ఉదాహరణ.

డాక్టర్‌ దేవదాసు బెర్నార్డ్‌ రాజు,

9866755024

Updated Date - Apr 19 , 2024 | 05:35 AM