Share News

వారికి ఎల్లప్పుడూ దైవానుగ్రహం

ABN , Publish Date - Apr 19 , 2024 | 05:38 AM

‘తల్లితండ్రులను సేవించడమే ఉత్తమ గతులకు మార్గం’ అని ఇస్లాం ధర్మం చెబుతోంది. దివ్య గ్రంథాలు సైతం ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.ఒక సందర్భంలో దైవ ప్రవక్త మహమ్మద్‌ చెప్పిన కథ ఇది...

వారికి ఎల్లప్పుడూ దైవానుగ్రహం

సందేశం

‘తల్లితండ్రులను సేవించడమే ఉత్తమ గతులకు మార్గం’ అని ఇస్లాం ధర్మం చెబుతోంది. దివ్య గ్రంథాలు సైతం ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.ఒక సందర్భంలో దైవ ప్రవక్త మహమ్మద్‌ చెప్పిన కథ ఇది.

ముగ్గురు వ్యక్తులు అరణ్యంలో ప్రయాణిస్తున్నారు. హఠాత్తుగా వర్షం ముంచుకురావడంతో దగ్గరలో ఉన్న ఒక గుహలోకి వెళ్ళి తలదాచుకున్నారు. వర్షం తీవ్రతకు కొండ చరియ విరిగిపోయి... ఆ గుహకు ప్రవేశద్వారానికి అడ్డంగా పడిపోయింది. దానితో ఆ బాటసారులు ముగ్గురూ అందులో చిక్కుకుపోయారు. దాని నుంచి బయటపడే పరిస్థితి లేదని వారికి అర్థమయింది. తమ జీవితాల్లో చేసిన మంచి పనులను గుర్తు చేసుకొని... తమను ఈ గండం నుంచి ఎలాగైనా బయటపడెయ్యాలని అల్లా్‌హను వేడుకోసాగారు. వారిలో ఇద్దరు తాము చేసిన సత్కార్యాలను గుర్తు చేసుకొని... అల్లా్‌హను ప్రార్థించారు. చివరి వ్యక్తి ‘‘అల్లాహ్‌! నాకు వృద్ధులైన తల్లితండ్రులు, చిన్నవారైన పిల్లలు ఉన్నారు. నేను గొర్రెలు కాసి నా కుటుంబాన్ని పోషించేవాణ్ణి. రోజూ గొర్రెలను మేపి, ఇంటికి రాగానే... పాలు తీసి నా తల్లితండ్రులకు ఇచ్చేవాణ్ణి. ఆ తరువాత నా పిల్లలకు ఇచ్చేవాణ్ణి. ఒక రోజు నేను ఇంటికి వచ్చేసరికి ఆలస్యమయింది. నా తల్లితండ్రులు నిద్రపోయారు. వారికి నిద్రాభంగం కలిగించడం ఇష్టం లేకపోయింది. మరోవైపు నా పిల్లలు ఆకలితో ఉన్నారు. అయినప్పటికీ వారికి ముందుగా పాలు ఇవ్వడం నా తల్లితండ్రుల పట్ల అవిధేయతగా భావించి... ఆ పాల పాత్రతో వారు లేచే వరకూ అక్కడే నిలబడి ఉన్నాను. నా పట్ల ప్రసన్నుడవై... ఈ బండరాయిని తొలగించు’’ అని కోరాడు. గుహ ప్రవేశ ద్వారాన్ని మూసేసిన ఆ బండరాయి తక్షణమే తొలగిపోయింది. ఆ బాటసారులు క్షేమంగా బయటపడ్డారు. తల్లితండ్రులను సేవిస్తూ, వారిపట్ల విధేయతతో మెలగినవారికి అల్లాహ్‌ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని దైవప్రవక్త ఈ కథ ద్వారా స్పష్టం చేశారు.

Updated Date - Apr 19 , 2024 | 05:38 AM